ETV Bharat / state

Farmers Problems: అన్నదాతల అరిగోసలు.. కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు

author img

By

Published : Nov 7, 2021, 4:35 PM IST

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఓ వైపు వర్షాలు.. మరోవైపు అధికారుల కాలయాపన.. రైతుల కష్టాలను రెట్టింపు చేస్తోంది. రోజుల తరబడి ఎదురు చూసినా.. ధాన్యం కొనుగోళ్లకు మోక్షం కలగట్లేదు. తేమ శాతం, తాలు పేరుతో రైతులను మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తేమ శాతం ఎక్కువుందని కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేయకా.. ధాన్యం బాగా ఎండి నూక అవుతుందని మిల్లర్లు నిరాకరిస్తూ.. అన్నదాతలు అరిగోసలు పడుతున్నారు.
nizamabad-farmers-problems-for-paddy-procurement
nizamabad-farmers-problems-for-paddy-procurement

ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది ఇందూరు అన్నదాతల పరిస్థితి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రైతులు పడిగాపులు పడుతున్నారు. ఏ కేంద్రంలో చూసినా.. ధాన్యం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. ఆరుగాలం పంట పండించిన రైతులకు.. కోత పూర్తి చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేర్చిన తర్వాత అసలు కష్టాలు ఎదురవుతున్నాయి. కేంద్రాల్లో తేమ శాతం నిబంధనలకు అనుగుణంగా 17శాతం లోపు ఉంటే తప్ప కాంటా వేయడం లేదు. ఒకవేళ తేమ శాతం వచ్చినా.. తమ వంతు కోసం ఎదురు చూడక తప్పదు. ఈ రెండు దాటుకుని కాంటా వేసినా.. లారీలు రాక తూకం వేసిన ధాన్యం కేంద్రాల్లోని బస్తాల్లో ఉండిపోతోంది. లారీలు వచ్చి మిల్లుకు తరలించినా.. మిల్లర్లు నూక పేరుతో పీటముడి పెడుతున్నారు. ధాన్యం బాగా ఎండిందని.. పూర్తిగా నూక అవుతుందని చెబుతున్నారు. లేదంటే తేమ శాతం ఎక్కువుందంటూ ధాన్యం దించేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో ధాన్యం మిల్లులో దించలేక తిరిగి తెచ్చుకోలేక రైతులు సతమతమవుతున్నారు.

తరుగు సమర్పించుకుంటేనే..

మిల్లర్లు ఏ సాకూ చెప్పకుండా ధాన్యం దించుకోవాలంటే రైతుల ముందున్న ఏకైక మార్గం తరుగు. నాలుగు నుంచి ఐదు కిలోల తరుగు ఇస్తామని రైతులు చెబితే చాలు సొంతంగా లారీ, హమాలీలు, గన్నీ సంచులు సైతం కేంద్రాలకు పంపించేందుకు సిద్ధమైపోతున్నారు. కోతలు ప్రారంభమైప్పటి నుంచే రైతులు కేంద్రాలకు ధాన్యం తెస్తున్నారు. ప్రభుత్వం కేంద్రాలను సమయానికి తెరవక.. రైతులందరి ధాన్యం పేరుకుపోయింది. ప్రస్తుతం కేంద్రాల్లోకి రైతులు ఒకేసారి ధాన్యం తెస్తున్నారు. దీనికి తోడు మిల్లర్లు దీపావళి కొత్త ముహూర్తాల పేరుతో ధాన్యం దించుకునేందుకు ఇష్టపడటం లేదు. అమావాస్య, ఆ తర్వాత మంచి రోజు పేరుతో ధాన్యం తీసుకోవడం లేదు. దీంతో లారీల్లోనే ధాన్యం ఉండిపోతోంది.

కేంద్రాల్లో కాంటా పూర్తయినా.. మిల్లుకు తరలించేందుకు లారీలు లేక ఇబ్బందులు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోళ్ల వేగం పెంచాలని.. ఇబ్బందులను తొలగించాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.