ETV Bharat / bharat

'ప్రధాని కావాలనే ఆశ లేదు- సునీతకు కూాడా నో ఇంట్రెస్ట్- స్వాతిపై దాడి జరిగినప్పుడు!' - Lok Sabha Elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 22, 2024, 9:11 PM IST

Kejriwal On PM Post : ఇండియా కూటమి గెలిస్తే దేశానికి ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశమేదీ తనకు లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. బీజేపీ నుంచి దేశాన్ని రక్షించడమే తన ఏకైక లక్ష్యమని ఆయన తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కలిసి ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తాయని చెప్పారు. ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

Kejriwal
Kejriwal (Source : Getty Images)

Kejriwal On PM Post : ఇండియా కూటమి గెలిస్తే దేశానికి ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశమేదీ తనకు లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. బీజేపీ నుంచి దేశాన్ని రక్షించడమే తన ఏకైక లక్ష్యమని ఆయన తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కలిసి ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తాయని చెప్పారు. "మాది చాలా చిన్న పార్టీ. కేవలం 22 స్థానాల్లో పోటీ చేస్తున్నాం. ప్రధాని పదవిని మేం ఆశించడం లేదు" అని ఆప్ చీఫ్ స్పష్టం చేశారు.

300 లోక్‌సభ సీట్లు పక్కా!
విపక్ష కూటమికి ఈ ఎన్నికల్లో దాదాపు 300 లోక్‌సభ సీట్లు వస్తాయని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధానిగా అంగీకరిస్తారా అని అడిగిన ప్రశ్నకు కేజ్రీవాల్, "ఇప్పటిదాకా ఆ అంశంపై చర్చ జరగలేదు. ఇది సైద్ధాంతిక ప్రశ్న. మేం కలిసి కూర్చున్నప్పుడు చర్చిస్తాం" అని బదులిచ్చారు. ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

'ఇండియా గెలవగానే నాకు విడుదల'
జూన్‌ 5న ఇండియా కూటమి అధికారంలోకి వస్తే న్యాయవ్యవస్థకు తీవ్ర ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుందని కేజ్రీవాల్ అన్నారు. తనపై ఉన్న కేసులన్నీ బోగస్‌వే అని ఆయన చెప్పారు. "నాపై పెట్టిన కేసుల్లో ఎక్కడా డబ్బుల జాడ లేదు. అవినీతి జరిగితే ఆ డబ్బు ఎక్కడికి పోయింది?" అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ప్రతిపక్ష కూటమి గెలిస్తే జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే తాను స్వేచ్ఛగా ఉంటానన్నారు. "అధికారంలోకి వచ్చాక మేం న్యాయవ్యవస్థపై ఎలాంటి ఒత్తిడి చేయబోం. న్యాయవ్యవస్థపై ఒత్తిడి లేకుండా చేస్తే సరిపోతుంది. న్యాయం దానంతట అదే జరిగిపోతుంది" అని ఆప్ చీఫ్ పేర్కొన్నారు.

సునీతకు రాజకీయాలపై ఆసక్తి లేదు!
తన సతీమణి సునీతకు రాజకీయాలపై ఆసక్తి లేదని, భవిష్యత్తులో ఆమె ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే లేదని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. సునీత లాంటి జీవిత భాగస్వామి లభించడం తన అదృష్టమని ఆయన అన్నారు. తనలాంటి విపరీతమైన వ్యక్తిని తట్టుకోవడం అంత సులభం కాదని పేర్కొన్నారు. 2000 సంవత్సరంలో దిల్లీలోని మురికివాడల్లో పని చేసేందుకు, తాను ఆదాయపు పన్ను శాఖ కమిషనర్‌ పోస్టుకు రాజీనామా చేసిన సందర్భాన్ని కేజ్రీవాల్ గుర్తు చేసుకున్నారు.

అప్పట్లో ముఖ్యమంత్రి అవుతానని, పార్టీ పెడతానని అస్సలు భావించలేదన్నారు. అలాంటి టైమ్​లో కూడా తనకు సునీత అండగా నిలిచిందని కేజ్రీవాల్ చెప్పారు. ఈడీ అరెస్టు చేసినప్పుడు తనకు, దిల్లీ ప్రజలకు మధ్య వారధిగా సునీత పనిచేశారని కేజ్రీవాల్ కొనియాడారు. "దిల్లీ ముఖ్యమంత్రిగా నా పనిని కొనసాగించడానికి జైలులో సౌకర్యాలు కల్పించాలని తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాను" అని ఆయన తెలిపారు. కేజ్రీవాల్ తన భార్యను ధైర్యవంతురాలు, బలమైన మహిళగా అభివర్ణించారు.

స్వాతిపై దాడి జరిగిన టైంలో నేను లేను!
తన సహాయకుడు బిభవ్ కుమార్‌పై ఆప్ ఎంపీ స్వాతీ మాలీవాల్ చేసిన ఆరోపణలపై కేజ్రీవాల్ స్పందించారు. దీనిపై న్యాయమైన విచారణ జరగాలని తాను ఆశిస్తున్నానని, న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మాలీవాల్‌పై దాడి జరిగిన సమయంలో అధికారిక నివాసంలో ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు సీఎం కేజ్రీవాల్ బదులిస్తూ తాను ఘటనా స్థలంలో లేనని ఆయన తెలిపారు.

ఇమ్రాన్‌ఖాన్‌కు పట్టినగతే పడుతుంది!
"బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎవరినీ వదలదు. విపక్ష నేతలను జైల్లో పెడుతుంది. వాళ్ల పార్టీల గుర్తులను లాక్కుంటుంది. నన్ను, ఇతర ఆప్ నేతలను జైల్లోనే ఉంచుతారు. మమతా బెనర్జీని జైలుకు పంపుతారు" అని కేజ్రీవాల్ తెలిపారు. పాకిస్థాన్‌‌లో ఇమ్రాన్‌ఖాన్‌కు ఎదురైన చేదు అనుభవమే ఇక్కడి విపక్ష నేతలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు కేజ్రీవాల్.

ఆప్​ అంతం చేయడమే బీజేపీ లక్ష్యం- భయంతో 'ఆపరేషన్‌ ఝాడు': కేజ్రీవాల్ - AAP Leaders Protest

'కేజ్రీవాల్​కు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు'- బెయిల్​పై సుప్రీంకోర్టు క్లారిటీ - Arvind Kejriwal Supreme Court

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.