ETV Bharat / state

పర్యావరణహితం.. ఆకట్టుకుంటున్న వినూత్న గణేశ్‌ విగ్రహాలు

author img

By

Published : Aug 28, 2020, 7:16 AM IST

Eco-friendly Impressive innovative Ganesh statues
పర్యావరణహితం.. ఆకట్టుకుంటున్న వినూత్న గణేశ్‌ విగ్రహాలు

కరోనా మహమ్మారి విలయంతో ప్రజల జీవనశైలిలో ఎన్నో మార్పులొచ్చాయి. పాశ్చాత్త పోకడలకు స్వస్తీ పలుకుతూ.. సంప్రదాయ విధానాల వైపు మొగ్గు చూపుతున్నారు. వైద్యం, ఆహారం, ఇతర జీవన విధానాల్లోనూ సంప్రదాయబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది గణేశ్ ఉత్సవాల్లోనూ ఎంతో మార్పు కనిపిస్తోంది. విగ్రహాల ఏర్పాటులోనూ అదేతీరుగా ఆలోచిస్తూ... పర్యావరణహితానికి పాటుపడుతున్నారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న కరోనాకు విరుగుడుగా వాడే వివిధ రకాల పదార్థాలతో... నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి.

పర్యావరణహితం.. ఆకట్టుకుంటున్న వినూత్న గణేశ్‌ విగ్రహాలు

కరోనా వేళ ఈ ఏడు గణేష్ నవరాత్రి ఉత్సవాలు పూర్తిగా కళ తప్పాయి. విగ్రహాలు సైతం సగానికి సగం తగ్గగా.. ఉన్న చోటా అంతగా సందడి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో వినూత్న వినాయక విగ్రహాలు వెలిశాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్​తో తయారు చేసిన విగ్రహాలకు బదులు చాలాచోట్ల పర్యావరణహిత విగ్రహాలను ప్రతిష్ఠించారు. శరీరం కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకునే శొంఠి, మిరియాలు, పసుపు వంటి పదార్థాలతోపాటు... తెల్ల ఆవాలు, నల్ల ఆవాలు వంటి వాటితో విగ్రహాలు తయారు చేశారు. మరికొందరు వినాయక విగ్రహాల చిత్రాలను బ్యానర్లను మాత్రమే మండపాలలో ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి వినూత్న విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

40 ఏళ్లుగా వినూత్నంగా

నిజామాబాద్ నగరంలోని వర్ని చౌరస్తాలో 40 ఏళ్లుగా వినూత్నంగా గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠిస్తుంటారు. ఈ ఏడాది మిరియాలు, ముత్యాలు, అల్లంతో తయారు చేసిన ఐదు అడుగుల మేర మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బురుగుగల్లీలో ఈ ఏడాది.... కరోనాకు విరుగుడుగా వాడే వస్తువులతో మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకతను చాటుకున్నారు. కషాయంలో వాడే నల్ల ఆవాలు, తెల్ల ఆవాలు, సాబుదాన, పసుపు కొమ్ములు, శొంఠి, వామ, మిరియాలు, ఇలాచ్చి, దాల్చిన చెక్క వంటి పదార్థాలను ఉపయోగించి వినాయకుడ్ని తయారు చేశారు.

ప్రతిష్ఠించి ప్రత్యేకత

నగరంలోని పోచమ్మగల్లీ ఏటా భారీ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేకతను చాటుతారు. గతేడాది సైతం 60 అడుగుల పైచిలుకు ఎత్తుతో మట్టి విగ్రహం ప్రతిష్ఠించి రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నిలిచారు. ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేయడం సంప్రదాయంగా వస్తుంది. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ఐదడుగుల మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి.... విగ్రహానికి రెండు వైపులా కరోనాపై అవగాహన కలిగించేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలపై కరోనా యోధుల చిత్రాలను ముద్రించారు. హమల్వాడీ శ్రీగాంధీ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఫ్లెక్సీనే ఏర్పాటు చేశారు. వినాయక్ నగర్‌లోనూ మాస్క్ ప్రత్యేకతను చాటుతూ.. వివిధ రకాల గణేష్ ల గురించి తెలిసేలా గణేష్ విగ్రహానికి రెండు వైపులా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

గణేశ్‌ నవరాత్రుల్లో భాగంగా వరంగల్ ఓ సిటీలో వినాయకుని గరికతో అలంకరించి పూజలు నిర్వహిస్తున్నారు. ఇలా... కరోనా నేపథ్యంలో వినూత్నంగా ఏర్పాటు చేసిన విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రభుత్వ నిబంధనలకనుగుణంగా పరిమిత సంఖ్యలో భక్తులు దర్శించుకునేందుకు మాత్రమే నిర్వాహకులు అనుమతిస్తున్నారు.

ఇదీ చూడండి : ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పేరుతో 1500 కోట్లు స్వాహా

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.