ETV Bharat / state

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పేరుతో 1500 కోట్లు స్వాహా

author img

By

Published : Aug 28, 2020, 6:21 AM IST

చైనా ఆన్‌లైన్‌ గేమింగ్‌ కేసులో సీసీఎస్‌ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఆ కేసులో ఓ చైనీయుడితోపాటు మరో ముగ్గురిని కస్టడీలోకి అధికారులు తీసుకుని విచారించారు. హవాలా సొమ్మును ప్రణాళిక ప్రకారం చైనా సంస్థలు తరలించాయని గుర్తించారు. కొత్తగా మరో రెండు సంస్థలను పోలీసులు గుర్తించారు. కలర్‌ ప్రిడిక్షన్‌ పేరిట ఈ దందా కొనసాగిందని... విద్యార్థులను యువతను ఆకర్షించి వందల కోట్లు కొల్లగొట్టినట్లు విచారణ బృందం వెల్లడించింది.

online betting fraud 1500 crore in the India last four months
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పేరుతో 1500 కోట్లు స్వాహా

రంగులు చెప్పండి.. లక్షల రూపాయలు గెలుచుకోండి అంటూ యువకులు...విద్యార్థులను ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ద్వారా ఆకర్షించి వందల కోట్ల రూపాయలను చైనా కంపెనీలు కొల్లగొట్టాయి. వాటి కార్యకలాపాలు రోజుకో కొత్త రూపంలో వెలుగు చూస్తున్నాయి. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న మరో రెండు సంస్థలను సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై నెలాఖరు వరకు 400 కోట్ల రూపాయల లావాదేవీలు రెండు సంస్థల్లో జరిగినట్టు పోలీసుల విచారణలో బయలుపడింది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కేసులో యాన్‌హువో ప్రధాన నిందితునిగా ఉన్నాడు. ఆ రెండు కంపెనీల ఆర్థిక వ్యవహారాల్లో అతను కీలక పాత్ర పోషించాడని తెలింది. డోకీపే, లింక్‌యున్‌ సంస్థల్లోని డైరెక్టర్లలో కొందరు రెండు కొత్త సంస్థల్లోనూ ఉన్నారన్న ఆధారాలు లభ్యమయ్యాయి. దీంతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ మోసం పరిమాణం 1500 కోట్లకు పెరిగిందని పోలీసులు చెబుతున్నారు.

ముందు ఎనిమిది సంస్థలు

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కేసు విచారణలో భాగంగా రోజుకో కొత్త అంశం బయటపడుతోంది. ముందు ఎనిమిది సంస్థలు, తర్వాత రెండు, మళ్లీ ఇరవై ఇలా అయిదు రోజుల విచారణలో 30 సంస్థలున్నాయని తేలింది. ఆ 30 సంస్థలను హాంకాంగ్‌లోని ఓ సంస్థ నిర్వహిస్తోంది. డోకీపే, లింక్‌యున్‌ సంస్థల లావాదేవీలను పోలీసులు లోతుగా పరిశీలించగా, దిల్లీ కేంద్రంగా మరో రెండు కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈ కామర్స్‌ సేవల పేరుతో వందల సంఖ్యలో గేమింగ్‌ వెబ్‌సైట్లను అందుబాటులో ఉంచామని గుర్తించారు. ఈ రెండు సంస్థల్లోని 400 కోట్ల లావాదేవీలు బయటపడగా.. మరికొన్ని డొల్ల కంపెనీలు బయటపడ్డాయి.

నిందితుడు యాన్‌హువో

వాటి చిరునామాలు, బ్యాంకు లావాదేవీలను విచారణ బృందం సేకరిస్తోంది. నిందితుడు యాన్‌హువో మాత్రం తాము సక్రమంగా లావాదేవీలు నిర్వహిస్తున్నామని.. డిజిటల్‌ నగదు బదిలీ, సాఫ్ట్‌వేర్‌ నిపుణుల సేవల పేర్లతో దిల్లీలో 30 సంస్థలను నిర్వహిస్తున్నామని ఇప్పటికీ చెబుతున్నాడని సమాచారం. హవాలా మార్గం ద్వారా వందల కోట్లను హాంకాంగ్‌కు పంపించేందుకు యాన్‌హువో బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంది. యాన్‌హువోతోపాటు ఇతర చైనీయులు, దిల్లీకి చెందిన దీరజ్‌, నీరజ్‌ తరచూ సంభాషించుకునేందుకు వుయ్‌ చాట్‌ మొబైల్‌ ఆప్లికేషన్‌ను ఉపయోగించినట్టు బయటపడింది. ఆ యాప్‌ ద్వారా మాట్లాడితే పోలీసులతోపాటు ఎవరికీ వారి సంభాషణలు రికార్డు రూపంలో లభించవు. దీంతోపాటు సంక్షిప్త సందేశాలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని చైనా అధికార భాషలో ఉండగా మరికొన్ని హింది, ఇంగ్లీష్‌లో ఉన్నాయి. ప్రత్యేక పరిజ్ఞానం ద్వారా వీరి సంభాషణలు, సంక్షిప్త సందేశాలను పరిశీలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదీ చూడండి : ఓ అధికారి నిర్లక్ష్యంతో జూనియర్​ లైన్​మెన్​ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.