ETV Bharat / state

ankapur desi chicken అంకాపూర్ నాటుకోడి కూర, అమెరికా చేరి

author img

By

Published : Aug 17, 2022, 7:52 AM IST

ankapur desi chicken చుట్టూ పచ్చని పంటచేలు.. నగరాన్ని తలపించేలా అందమైన భవనాలతో కొలువుదీరిన అంకాపూర్‌ వ్యవసాయంలో ఎంత పేరు తెచ్చుకుందో అదే స్థాయిలో నాటుకోడి కూరను వండటంలో పేరుగాంచింది. ఇతర చోట్ల ఎక్కడ తిన్నా ఈ రుచి రాదు. మరి అంకాపూర్‌ నాటుకోడి స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి.

ankapur desi chicken
ankapur desi chicken

ankapur desi chicken : దాదాపు 40 ఏళ్ల కిందట గ్రామంలో మొదట తాళ్లపల్లి రామాగౌడ్‌ అనే వ్యక్తి ఈ నాటుకోడి కూర వండటం ప్రారంభించారు. ఈయన చేసే చికెన్‌ కారంగా, ఘాటుగా అద్భుతమైన రుచి ఉండటంతో.. స్థానికంగా అందరి నోళ్లలో పడి మెల్లమెల్లగా జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు పాకింది. ఇది తినేందుకే ఆదివారాలు ఇక్కడికి వచ్చే వారున్నారు. రోజురోజుకు డిమాండ్‌ పెరుగుతుండటంతో కుటుంబమంతా ఆర్డర్‌ మీద కావాల్సిన వాళ్లకు పంపించే వ్యాపారం కొనసాగించారు. క్రమంగా ఊర్లో ఇతరులూ ఆర్డర్‌ మెస్‌లు ప్రారంభించారు. మొదట్లో చుట్టుపక్కల గ్రామాల వారికి సరఫరా చేయగా ప్రస్తుతం గల్ఫ్‌దేశాలు, అమెరికాకు సైతం పార్శిళ్లు వెళ్తున్నాయి.

నాటుకోడి

ప్రస్తుతం గ్రామంలో సుమారు 20 మంది ఈ ప్రత్యేక వంటకం నేర్చుకొని వ్యాపారం చేస్తున్నారు. వ్యవసాయరంగంలో ఈ గ్రామానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు రావడంతో ఇక్కడికి రైతులు, సందర్శకులు నిత్యం వందల మంది వచ్చిపోతుంటారు. పాతికేళ్లుగా దేశ విదేశాల అతిథులు ఇక్కడికి వచ్చి రైతులు చేస్తున్న వినూత్న వ్యవసాయంపై అధ్యయనం చేసి స్థానిక రుచులను ఆస్వాదించి వెళ్తున్నారు. అలా అంకాపూర్‌ ‘దేశీ చికెన్‌’గా ఇక్కడి వంటకం ప్రత్యేకంగా పేరు సంపాదించుకుంది. కుటుంబంలో సుమారు నలుగురు ఉంటే అందరూ ఇదే వృత్తిలో ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో 20 ఆర్డర్‌ మెస్‌లు వెలిశాయి. ఒక్కొక్క హోటల్‌లో సుమారు 30 కిలోల నాటుకోడి కూరను వండి ఆర్డర్‌ ద్వారా అందిస్తున్నారు. రూ.600 నుంచి రూ. 650కి ఒక్కో నాటుకోడి, నలుగురికి సరిపడా భోజనం (అన్నం) అందిస్తారు. గ్రామంలో నిత్యం రూ.4 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. సాధారణ రోజుల్లో 2400 మంది, ఆదివారాలు 3500 మంది వరకు తింటారు.

ప్రత్యేకంగా మసాలాలు.. నాటుకోడి కూర వండేందుకు మసాలాలు ప్రత్యేకంగా ఎప్పుటికప్పుడు తయారు చేసుకుంటారు. ధనియాలు, లవంగాలు, యాలకులు, కొబ్బరి పొడి, అల్లం, ఎల్లిగడ్డ, ఉల్లి, కొత్తిమీర, పుదీనా వంటకానికి ముందే దంచి పెట్టుకుంటారు. వంటలో వాడేందుకు నాణ్యమైన నూనె ఉపయోగిస్తారు.

ఎల్లలు దాటుతున్న రుచి.. అంకాపూర్‌ దేశీ చికెన్‌ రుచి తెలిసిన వారు ఈ మార్గంలో ప్రయాణిస్తే తినకుండా వెళ్లరు. చుట్టుపక్కల ఎక్కడ సమావేశాలు, విందులు ఉన్నా ఈ ఊరు నాటుకోడి కూర విధిగా ఉండాల్సిందే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం అంకాపూర్‌ పర్యటనకు వచ్చినప్పుడు రుచి ఆస్వాదించారు. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, జగిత్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌తో పాటు గల్ఫ్‌ దేశాలు, అమెరికాకు తీసుకెళ్తున్నారు.

రోజుకు 30 కిలోలు వండుతాం.. "ఇదే వృత్తిగా ఎంచుకొని కుటుంబంలో అందరం కలిసి పని చేస్తాం. చుట్టుపక్కల గ్రామాలు తిరిగి సహజ సిద్ధంగా పెరిగే దేశీ కోళ్లను కొనుగోలు చేస్తాం. కూరలో ఉపయోగించే కారం, మసాలాలు స్వయంగా తయారు చేసుకుంటాం. దీంతో వంటకానికి మంచి రుచి వస్తుంది. రోజుకు 30 కిలోల నాటుకోడి కూరను ఆర్డర్‌ ద్వారా అందిస్తా. రుచి, నాణ్యతగా పాటించడంతో డిమాండ్‌ ఉంటోంది." - భూమేశ్‌, అంకాపూర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.