ETV Bharat / state

చిన్నప్రాణం.. పెద్దగండం.. మా బిడ్డను బతికించండి సారూ..!

author img

By

Published : Apr 3, 2023, 9:06 PM IST

A boy suffering Hydrocepalus Disease in Rampur
A boy suffering Hydrocepalus Disease in Rampur

A boy suffering Hydrocepalus Disease in Rampur: పొద్దస్తమానం బీడీ కట్టల మధ్య పనిచేసే ఆ తల్లి నోట్ల కట్టలు కనలేదు. గల్ఫ్‌లో రెక్కలు ముక్కలు చేసుకునే ఆ తండ్రికి.. లక్షల రూపాయల సంపాదన తెలియదు. వారికి తాతముత్తాతలు వెనకేసిన ఆస్తిలేదు. కష్టమొస్తే వెన్నుతట్టే పెద్దదిక్కు కూడా లేదు. చెమట చుక్కలు చిందిస్తేనే నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లలేని ఇలాంటి కుటుంబానికి ఊహించని ఓ కష్టం.. ప్రాణాలు తోడేసేలా మారింది. పుట్టిన బిడ్డతోనే రోజురోజుకు పెరిగిపోతున్న గండం నుంచి గట్టెక్కించాలంటూ వేడుకుంటున్న దయనీయ పరిస్థితిపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

చిన్నప్రాణం.. పెద్దగండం.. మా బిడ్డను బతికించండి సారూ..!

A boy suffering Hydrocepalus Disease in Rampur: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌ మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన శ్రీకాంత్‌, హారిక దంపతులకు 8 ఏళ్ల క్రితం కవల పిల్లలు జన్మించారు. జంటమామిడిలా పుట్టిన ఇద్దరు మగపిల్లలను చూసి మురిసిపోయిన ఆ తల్లిదండ్రుల ఆనందం ఎంతో సేపు నిలువలేదు. కవలల్లో ఒక బాబు పుట్టిన వెంటనే చనిపోయాడు. మరో బిడ్డకు శివకుమార్‌ అని పేరు పెట్టారు. కొంతకాలం బాబు అందరిలాగే ఉన్నప్పటికీ.. 5 నెలల వయసు నిండిన సమయంలో బాబు నెత్తిన అనారోగ్యం పిడుగులా పడింది.

మొదట్లో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు శివను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు తగ్గిపోతుందని చెప్పినా.. వయసుతో పాటే వ్యాధి పెరుగుతూ ఉండటంతో తల పెద్దగా మారిపోయింది. స్థానికంగా ఎన్ని ఆసుపత్రులకు తిప్పినా ప్రయోజనం లేకపోవటంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చేసిన కష్టం, ఒంటిమీద ఉన్న బంగారం, మరింత అప్పుచేసి ఆసుపత్రిలో చూపించారు.

ఈ సమయంలోనే పరీక్షలు జరిపిన వైద్యులు.. బాబు హైడ్రో సెపలస్‌ అనే వ్యాధి బారీన పడినట్లు గుర్తించారు. ప్రైవేటు ఆసుపత్రిలో అప్పటికే రూ.10 లక్షల వరకు ఖర్చు చేసినా ఆ నిరుపేద దంపతులకు బాబు ఆరోగ్యం తలకుమించిన భారంగా మారిపోయింది. దీంతో హైదరాబాద్‌లోని గాంధీ, నీలోఫర్‌ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. హైడ్రో సెపలస్‌కు సంబంధించి అక్కడ చికిత్స సదుపాయం లేదని.. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు చెప్పగా శ్రీకాంత్‌, హారిక దంపతులు చేసేదిలేక స్వగ్రామానికి వెళ్లిపోయారు.

ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స లేదు: ప్రైవేటులో వైద్యం చేయించే స్థోమతలేక బిడ్డను ఏడాదికి పైగా ఇంటి వద్దే ఉంచుకుంటున్నారు. ప్రస్తుతం 8 ఏళ్లు ఉన్న శివకుమార్‌ కూర్చోలేడు. భోజనం చేయలేడు. అంగన్‌వాడీ కేంద్రంలో లభించే బాలామృతాన్ని మాత్రమే బాబుకు అందిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సకు 10 నుంచి 15 లక్షలు ఖర్చు అవుతుందని చెబుతున్నారని తల్లి హారిక వాపోతుంది.

ఎన్నో ఆసుపత్రులకు తిరిగినా.. ఎంతో మందిని వేడుకున్నా.. ప్రయోజనం లేకపోవటంతో తన బిడ్డను బతికించాలంటూ ఆ తల్లి నిజామాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద పడిగాపులు కాస్తోంది. ప్రజావాణిలో మొరపెట్టుకుంటే అధికారులు దయతల్చుతారని దయనీయంగా ఎదురుచూస్తోంది. ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లిన బాలుడి తండ్రి పంపించే డబ్బుతోనే వీరి కుటుంబం గడుస్తోంది. దాతలు స్పందించి శివ కుమార్ వైద్యం కోసం ఆపన్నహస్తం అందించాలని తల్లి నిహారిక వేడుకుంటోంది.

బాబుకి ఐదు నెలల నుంచి ఇలానే ఉంది. కిడ్స్​కేర్ ఆసుపత్రిలో 45 రోజులు ఉన్నాం. పెద్దబాబు చనిపోయాడు. చిన్న బాబు ఇలాగా ఉన్నాడు. ఇప్పటికీ మేము రూ.5 లక్షల దాకా ఖర్చు పెట్టాం. అయినాగానీ బాబుకి తగ్గలేదు. హైదరాబాద్ గాంధీ, నీలోఫర్​కి వెళ్తే.. అక్కడ తలలో నీరు వచ్చిందన్నారు. వారు ట్రీట్​మెంట్ ఇక్కడ లేదని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లమన్నారు. ఖర్చు ఎంత అవుతుందని అడిగితే రూ.15 లక్షలు అవుతుందని చెప్పారు. మా దగ్గర స్థోమత లేదు. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాం. -హారిక, శివకుమార్ తల్లి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.