ETV Bharat / state

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌కు పోలీసుశాఖ పటిష్ఠ బందోబస్తు

author img

By

Published : Oct 30, 2022, 10:21 AM IST

Heavy Police Bandobast in Munugode: రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువుగా మారిన.. మునుగోడు పోలింగ్‌ ఏర్పాట్లపై పోలీస్‌ శాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాలను క్లస్టర్‌లుగా విభజించి వాటి పర్యవేక్షణ బాధ్యత ఎస్సై స్ధాయి అధికారులకు అప్పగించారు. నగదు, మద్యం పంపిణీ నియంత్రణకు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు.

Police Bandobast
Police Bandobast

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌కు పోలీసుశాఖ పటిష్ఠ బందోబస్తు

Heavy Police Bandobast in Munugode: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ రోజుకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నియోజకవర్గంలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీస్‌ శాఖ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గ్రామాలను క్లస్టర్‌లుగా విభజించి వాటి పర్యవేక్షణ బాధ్యత ఎస్​ఐ, ఆ స్థాయి అధికారులకు అప్పగించింది. నియోజకవర్గం నల్గొండ, యాదాద్రి జిల్లాల పరిధిలో ఉండగా, యాదాద్రి జిల్లా రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఉంది. అయితే ఎన్నికల భద్రతా ఏర్పాట్లను నల్గొండ జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి పర్యవేక్షిస్తున్నారు.

నియోజకవర్గంలో సుమారు 170 గ్రామాలుండగా... ఒకట్రెండు గ్రామాలను ఒక క్లస్టర్‌లాగా ఏర్పాటు చేశారు. ఇలా మొత్తం 104 క్లస్టర్‌లను ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్‌కు ఒక ఎస్ఐతో పాటూ 30 మంది సిబ్బందిని నియమించారు. సమస్యాత్మక, అత్యంత సున్నిత గ్రామాల్లో రాష్ట్ర పోలీసులతో పాటూ కేంద్ర బలగాలు భద్రతా విధులు నిర్వహించనున్నాయి. వీరు రెండు బృందాలుగా విడిపోయి నిరంతరం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. వీరికి ఆయా గ్రామాల్లోని రైతు వేదికల్లో బస కల్పించాలని నిర్ణయించారు. ఆయా గ్రామాల్లో ప్రచారానికి వచ్చే వివిధ పార్టీల ముఖ్యులు, గామంలో చోటు చేసుకునే ఘర్షణలు, ఇతర ఘటనలు జరిగినప్పుడు ఆ సంబంధిత క్లస్టర్‌కు చెందిన ఎస్సైతో పాటూ సిబ్బంది పర్యవేక్షించాల్సి ఉంటుంది.

నియోజకవర్గానికి వెళ్లే సరిహద్దులు నాలుగు మూలల వద్ద నగదు, మద్యం నియంత్రణకు ఇప్పటి వరకు చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. ప్రతి చెక్‌పోస్టుకు మూడు బృందాలు నిరంతరం గస్తీ ఉండేలా ఒక్కోదానికి 12 మంది సిబ్బందిని నియమించారు. వీరికి అదనంగా ఐదుగురు కేంద్ర రిజర్వు బలగాలను సైతం నియమించారు. ఎన్నికల భద్రతా ఏర్పాట్ల నిమిత్తం ఎనిమిది కంపెనీల కేంద్ర రిజర్వు బలగాలు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు పది రోజుల క్రితమే చేరుకున్నాయి.

గతంలో మండల కేంద్రాల్లో పోలీసులు బలగాలు బస చేసి ఆ మండలాల పరిధిలో ఘటనలు జరిగినప్పుడు అక్కడికి చేరుకునేవి. దీంతో ఎన్నికల సందర్భంగా చాలా ప్రాంతాల్లో గొడవలు జరిగేవి. ఇప్పుడు ఇలా కాకుండా క్లస్టర్లను ఏర్పాటు చేసి పోలీసులను క్షేత్రస్థాయిలోనే ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో పోలీసులు ఉండటంతో గొడవలు నియంత్రణలో ఉంటాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.