ETV Bharat / state

Telangana Assembly Elections 2023 : అధికారమే లక్ష్యంగా టీ కాంగ్రెస్ అడుగులు.. ప్రచార సైన్యాన్ని ప్రకటించిన ఏఐసీసీ

author img

By

Published : Jul 15, 2023, 7:13 AM IST

T Congress
T Congress

Congress Kollapur Public Meeting : రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకోవటమే లక్ష్యంగా కాంగ్రెస్‌ కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన ఆ పార్టీ అధిష్ఠానం.. బీఆర్​ఎస్​ను గద్దె దించేందుకు ఏ అవకాశాన్నీ వదులుకోకుండా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే పూర్తిస్థాయి ప్రచార కమిటీని ప్రకటించిన ఏఐసీసీ... అటు పార్లమెంటు నియోజక వర్గాల వారీగా పర్యవేక్షకులను నియమించింది. చేరికలు, బహిరంగసభలు, నేతల పర్యటనలతో సమరానికి సిద్ధమవుతున్న తరుణంలో... ఖమ్మం సభకు దీటుగా కొల్లాపూర్‌ బహిరంగసభను నిర్వహించేలా కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

శాసనసభ ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్న కాంగ్రెస్‌

Telangana Assembly Elections Congress 2023 : శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పూర్తిస్థాయి ప్రచార కమిటీని ఏఐసీసీ ప్రకటించింది. ఇప్పటికే ప్రచార కమిటీ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ మధుయాస్కీ కొనసాగుతుండగా... ఆయనను అలాగే కొనసాగిస్తూనే పూర్తిస్థాయి కమిటీ సభ్యులను, ప్రత్యేక ఆహ్వానితుల జాబితాను ప్రకటించింది. కమిటీ ఛైర్మన్‌గా మధుయాస్కీతో పాటు ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సహఛైర్మన్‌గా కాంగ్రెస్‌ అధిష్ఠానం నియమించింది. అలాగే.. కన్వీనర్‌గా సయ్యద్‌ అజ్ముత్తుల్లా హుస్సేనీను నియమించి ముస్లిం కమ్యూనిటీకి అవకాశం కల్పించింది. మరో 37 మందిని కమిటీ కార్యనిర్వహక కమిటీ సభ్యులను, మరికొందరిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఏఐసీసీ ప్రకటించింది.

Telangana Congress Election Campaign Committee : మరోవైపు రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజక వర్గాల వారీగా 17మంది ఏఐసీసీ పర్యవేక్షకులను కాంగ్రెస్‌ నియమించింది. త్వరలో ఎన్నికల జరగనున్న రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశంపై రెండ్రోజుల క్రితం సుదీర్ఘంగా చర్చించిన కాంగ్రెస్‌ అధిష్టానం... ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు నియోజక వర్గాల వారీగా ముందస్తుగా పర్యవేక్షణకులను నియమించడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయటం... నాయకుల మధ్య సమన్వయం తెచ్చేందుకు దోహదం చేస్తుందని భావిస్తోంది.

Congress Public Meeting at Kollapur : అటు... కొల్లాపూర్‌ సభపై కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఖమ్మం జనగర్జన సభకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ నెల 20న పాలమూరు ప్రజాభేరి సభను కొల్లాపూర్‌లో నిర్వహించేందుకు పీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. సభ నిర్వహణకు అవసరమైన సమన్వయకర్తలను, జన సమీకరణకు అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిలను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్ నేతృత్వంలో నియమించింది. కొల్లాపూర్‌లో జరిగే ఈ సభావేదికగా మాజీ మంత్రి జూపల్లితో పాటు కొందరు బీఆర్​ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్‌లో చేరుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రియాంకాగాంధీ రాకపై రాని స్పష్టత : కాగా... మరో 5రోజుల్లో జరిగే ఈ సభకు ప్రియాంకాగాంధీ హజరవుతారని కాంగ్రెస్‌ నేతలు వెల్లడించినా ఆమె షెడ్యూల్‌ ఇంకా ఖరారు కాలేదు. ప్రియాంక రాకపోతే పార్టీ శ్రేణులు, కొత్తగా చేరేవారే వారు నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉందని భావిస్తున్న రాష్ట్ర పార్టీ నేతలు... రాహుల్‌ గాంధీ అయినా వచ్చేలా ఒప్పించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక గాంధీ, రాహుల్‌ గాంధీల పర్యటన ఖరారు కానట్లయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించి, కొల్లాపూర్ సభను విజయవంతం చేయాలని భావిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో దీనిపై స్పష్టతవచ్చే అవకాశం ఉంది.

కొత్త ఊపులో కాంగ్రెస్​ పార్టీ : పార్టీలో నేతల చేరికలు, అగ్రనేతల పర్యటనలు, బహిరంగసభలకు తోడుగా రాష్ట్రంలో ఇటీవల కరెంటు అంశంపై అధికార పార్టీపై నేతల ఎదురుదాడితో కాంగ్రెస్‌లో కొత్త ఊపును తీసుకొచ్చింది. అధికారమే లక్ష్యంగా ఏకతాటిపైకి వస్తున్న ఆ పార్టీ నేతలు... ఎన్నికల వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించేలా అడుగులేస్తున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.