ETV Bharat / state

T Congress MLA Candidates 2023 : కాంగ్రెస్ ముందస్తు అభ్యర్థుల ఎంపికలో జాప్యం.. అదే కారణం!

author img

By

Published : Jul 11, 2023, 12:55 PM IST

T Congress MLA Candidates List 2023 : తెలంగాణలో ముందస్తు అభ్యర్ధుల ఎంపిక జరిగితే ఇతర పార్టీల ప్రభావం పడే అవకాశం ఉందని రాష్ట్ర కాంగ్రెస్‌ భావిస్తోంది. ఆరు నెలల ముందే అభ్యర్ధులు ప్రకటించడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని నాయకులు భావిస్తున్నప్పటికీ అది సాధ్యపడే అవకాశం కనిపించడం లేదు. జనాధరణ కలిగిన నాయకులకు పని చేసుకోవాలని అనధికారికంగా సూచించడం తప్ప మరొకటి చేయలేని పరిస్థితి కాంగ్రెస్‌లో నెలకొంది.

T Congress
T Congress

Telangana Congress MLA Candidates 2023 : తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రతి ఎన్నికల్లో అభ్యర్ధుల ప్రకటన తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎక్కువగా చివర క్షణంలో బరిలో నిలిచే వారి పేర్లను అధిష్ఠానం వెల్లడిస్తోంది. ఇందువల్ల గెలిచే అవకాశం ఉన్న నాయకులు కూడా ఓటమి చవిచూడాల్సి వస్తోందన్న వాదన పార్టీలో వినవస్తుంది. చివర క్షణంలో అభ్యర్ధులను ప్రకటించడం వల్ల... ప్రచారం తగినంత చేసుకోలేకపోవడం, ప్రత్యర్ధుల ఎత్తులను చిత్తు చేసే పైఎత్తులు వేసుకుని ముందుకు వెళ్లలేకపోవడం, ఆర్థికంగా అవసరమైన డబ్బు సమకూర్చుకోలేకపోవడం తదితర కారణాలతో ఓటర్లకు దగ్గరవలేక చతికల పడాల్సి వస్తోందని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని నుంచి బయట పడి మెరుగైన ఫలితాలు దక్కించుకోకపోతే రాష్ట్రంలో నెలకొన్న సానుకూల వాతావరణం కూడా ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు.

T Congress MLA Candidates Selection 2023 : ప్రధానంగా ఎన్నికల బరిలో దిగే అభ్యర్ధులు ఎవరైనా కావచ్చు... వ్యక్తిగత ప్రజాధరణతో పాటు పార్టీ ఆధరణ తోడైనప్పుడే గెలుపునకు మెండుగా అవకాశాలు ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకున్న కొందరు నాయకులు పార్టీ ఎప్పుడు ప్రకటన చేసినా... తమకే టికెట్‌ దక్కుతుందన్న విశ్వాసంతో క్షేత్రస్థాయిలో జనంలో కలియతిరుగుతున్నారు. ప్రతి రోజు ఏదొక కార్యక్రమం పేరున జనంలోకి వెళ్లుతున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ... ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. స్థానికంగా పరిష్కారం కానీ సమస్యలను కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత... పరిష్కరిస్తామని హామి ఇస్తున్నారు.

ఎమ్మెల్యే టికెట్ కోసం జనంలోనే తిరుగుతున్న నాయకులు : గత కొంతకాలంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మేడ్చల్‌ నియోజక వర్గంలో హరివర్దన్‌ రెడ్డి, ఉప్పల్‌లో రాగిడి లక్ష్మారెడ్డి, వికారాబాద్​లో ప్రసాద్ కుమార్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో హుజూర్​నగర్​లో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సూర్యాపేటలో పటేల్‌ రమేష్‌ రెడ్డి, మిర్యాలగూడలో బి. లక్ష్మారెడ్డి, సాగర్‌లో జానారెడ్డి చిన్న కుమారుడు జయ్‌వీర్‌ రెడ్డి, ఆలేరులో బీర్ల ఐలయ్య, వేములవాడలో అది శ్రీనివాస్, పెద్దపల్లిలో విజయరమణారావు, వరంగల్ తూర్పులో కొండాసురేఖ, మానకొండూర్ కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు కొంతకాలంగా జనంలోనే ఎక్కువ గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారు... రాష్ట్ర వ్యాప్తంగా 50 నుంచి 60 మంది నాయకులు ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఓ వైపు పార్టీ బాధ్యతలు.. మరోవైపు నియోజకవర్గాల్లో పర్యటన : కొందరు నాయకులు పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్ కుమార్, శ్రీధర్ బాబు లాంటివాళ్లు తమ నియోజకవర్గాల్లో తరచూ పర్యటిస్తున్నారు. తమ ఓటు బ్యాంకును పెంచుకుంటున్నారు. పార్టీ టికెట్లు వారికి ఇస్తామని చెప్పకపోయినా... తమకే టికెట్‌ దక్కుతుందన్న విశ్వాసంతో ప్రజల్లో ఉంటూ తమ పని చేసుకుంటూ పోతున్నారు. పార్టీ సర్వేలు నిర్వహించినా తామే ప్రజాధరణ కలిగి ఉంటున్నందున తమకే టికెట్లు వస్తాయన్న ధీమాతో నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది.

మూడు నెలల ముందైనా అభ్యర్థులను ప్రకటించాలి : రాష్ట్రంలో 2024 జనవరి 16 నాటికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గడువు తీరుతుంది. అప్పటిలోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. ఇందువల్ల ఈ ఏడాది నవంబరు లేదా డిసెంబరులో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీనిని బట్టి చూస్తే... రాబోవు ఎన్నికలకు కేవలం అయిదు నెలలు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆరు నెలలు ముందే అభ్యర్ధుల ప్రకటన అనేది... సాధ్యం కానందున కనీసం మూడు నెలల ముందు అయినా అభ్యర్ధుల ప్రకటన చేయాలన్న డిమాండ్‌ కాంగ్రెస్‌ పార్టీలో తెరపైకి వస్తోంది. మరోవైపు అభ్యర్ధుల ముందస్తు ప్రకటనపై పార్టీ వర్గాల్లో రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి.

అభ్యర్థులను ముందే ప్రకటిస్తే... అసమ్మతి పెరిగే అవకాశం : పార్టీలో జోష్‌ పెరుగుతున్నప్పటికీ... అభ్యర్ధుల ప్రకటన ముందే ప్రకటిస్తే నాయకుల మధ్య అసమ్మతి పెరిగేందుకు అవకాశం ఉండడం, బలమైన అభ్యర్థి అనిపిస్తే ఇతర పార్టీలు... వారిని తమ పార్టీలోకి లాక్కునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పీసీసీ, ఏఐసీసీ స్థాయి నాయకులు ఒక కమిటీగా ఏర్పాటై నియోజక వర్గాల వారీగా ఆశావహులతో సమావేశమై చర్చించి... పార్టీ గెలుపు గుర్రాలకే టికెట్‌ ఇస్తుందని స్పష్టం చేయడంతోపాటు... ఎవరికి టికెట్‌ వచ్చినా అంతా కలిసికట్టుగా పని చేసేట్లు నాయకులను సమాయత్తం చేయడం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని పార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.