ETV Bharat / state

మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు.. ఆన్​లైన్​లోనూ బుక్​ చేసుకోవచ్చు.!

author img

By

Published : Jan 31, 2022, 9:24 PM IST

special buses to medaram jatara
మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు

Special Buses to Medaram Jatara: మేడారం మహా జాతరకు టీఎస్​ఆర్టీసీ ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. ఫిబ్రవరి 13 నుంచి 20 వరకు ఈ బస్సులు నడవనున్నాయి. వివిధ జిల్లాల నుంచి మొత్తం 3,845 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్ తెలిపారు. ఈ మేరకు బస్​ భవన్​లో ఆర్టీసీ అధికారులతో మంత్రి సమీక్షించారు.

Special Buses to Medaram Jatara: తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ ప్రకటించారు. జాతర సమయంలో టీఎస్​ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తుందన్న ఆయన.. భక్తుల రవాణా సౌకర్యార్థం 3,845 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. మేడారం జాతర ఏర్పాట్లపై హైదరాబాద్​ బస్​భవన్​లో సంస్థ ఛైర్మన్​ బాజిరెడ్డి గోవర్దన్​, ఎండీ సజ్జనార్​, అధికారులతో కలిసి మంత్రి అజయ్​ సమీక్ష నిర్వహించారు.

బస్సుల్లో పూర్తిగా శానిటైజేషన్​

జాతర ప్రాంగణంలో ఇప్పటికే బోర్డింగ్, అలైటింగ్ పాయింట్లను.. దాదాపు 50 ఎకరాల్లో 42 క్యూలైన్లను ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు. వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, తదితర జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా ఫిబ్రవరి 13 నుంచి 20వ తేదీ వరకు బస్సుల రాకపోకలు కొనసాగుతాయని మంత్రి వివరించారు.

కొవిడ్​, ఒమిక్రాన్​ నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బందికి.. స్పెషల్ డ్రైవ్ ద్వారా బూస్టర్ డోస్ ఇప్పించామని.. హ్యాండ్ శానిటైజర్స్​, మాస్కుల‌ను కూడా అందివ్వాలని మంత్రి ఆదేశించారు. డిపో నుంచి బయలుదేరే సమయంలో బస్సును పూర్తిగా శానిటైజేషన్ చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. భక్తులకు రాకపోకల సమయంలో రవాణా పరంగా ఎలాంటి నిరీక్షణ ఉండకూడదనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో బస్సులను నడపాలని సూచించారు. సమీక్ష అనంతరం పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కిన్నెర వాద్యకారుడు మొగిలయ్యను మంత్రి, ఆర్టీసీ అధికారులు సన్మానించారు.

హైదరాబాద్​ నుంచి..

  • హైదరాబాద్​- 1 డిపో సూపర్ లగ్జరీ బస్సులు ఎంజీబీఎస్ నుంచి ఉదయం 6 గంటలకు.. తిరిగి మేడారం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరుతాయి.
  • హైదరాబాద్- 2 డిపో బస్సులు.. ఎంజీబీఎస్ నుంచి, ఉదయం 7 గంటలకు.. తిరిగి మేడారం నుంచి సాయంత్రం 4 గంటలకు బయల్దేరుతాయి.
  • పికెట్ డిపో బస్సులు.. ఎంజీబీఎస్ నుంచి ఉదయం 8 గంటలకు... మేడారం నుంచి సాయంత్రం 5 గంటలకు బయల్దేరుతాయి.

ఆన్​లైన్​ సదుపాయం

ప్రజల సౌకర్యార్థం టీఎస్​ఆర్టీసీ వెబ్​సైట్​లో, టీఎస్ఆర్టీసీ యాప్​లో బస్సులను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించామని మంత్రి పువ్వాడ అజయ్ వివరించారు. మేడారం ప్రత్యేక బస్సులకు రూ.398 చొప్పున ఛార్జీలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జాతర దృష్ట్యా మేడారం పరిసర ప్రాంతాల్లో ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మేడారానికి వచ్చే భక్తులు ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న గట్టమ్మ దేవాలయానికీ వస్తుంటారు. ఈ ప్రాంతంలోనూ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Telangana Covid Cases: రాష్ట్రంలో కొత్తగా 2,861 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.