ETV Bharat / state

మొన్న మరియమ్మ.. నేడు ఖదీర్ ఖాన్.. పోలీసుల థర్డ్ డిగ్రీతో బలవుతున్న అమాయకులు

author img

By

Published : Feb 18, 2023, 1:05 PM IST

Third degree
Third degree

Man Died due to Police Third Degree in Medak : పోలీసు అధికారులు విచారణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నిందితులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. తాజాగా మెదక్ జిల్లాలో దొంగ అనే అనుమానంతో ఖదీర్‌ఖాన్‌ అనే వ్యక్తిపై కర్కశత్వంగా వ్యవహరించారు. పోలీసుల దెబ్బలతోనే తన భర్త చనిపోయాడని ఆయన భార్య వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి వేడుకున్నారు.

Man Died due to Police Third Degree in Medak : మెదక్​కు చెందిన ఖదీర్‌ఖాన్‌ అనే వ్యక్తిపై దొంగ అనే అనుమానంతో పోలీసులు తమ కర్కశత్వాన్ని ప్రదర్శించారు. పీఎస్​లో నాలుగు రోజుల పాటు విపరీతంగా కొట్టి.. నిందితుడు ఆయన కాదని తెలిసి వదిలేశారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న భర్తను ఆసుపత్రికి తీసుకెెళ్లేందుకు భార్య ప్రయత్నించగా.. ఎక్కడా తమ తప్పు బయటపడకుండా ఉండేందుకు ఇంట్లోనే ఉంచాలని పోలీసులు ఆమెను బెదిరించారు.

తామే బలం గోలీలు తెచ్చిస్తాం.. వేసుకొంటే సర్దుకుంటుందని చెప్పారు. ఖదీర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించగా.. గాంధీలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి ప్రాంతంలో మృతి చెందారు. తమకు న్యాయం చేయాలని ఈనెల 6వ తేదీన కుటుంబ సభ్యులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను కలిసి వేడుకున్నారు.

ఖదీర్ ఖాన్ భార్య తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పట్టణానికి చెందిన ఎండీ ఖదీర్​ఖాన్ చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. ఆయనకు భార్య సిద్దేశ్వరి, ముగ్గురు పిల్లలున్నారు. గత నెల 12వ తారీఖు భాగ్యనగరంలోని చిన్నమ్మ ఇంటికి వెళ్లారు. జనవరి 27న పట్టణంలోని అరబ్​గల్లీలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఓ మహిళ తన పుస్తెలతాడు కొట్టేశారంటూ మెదక్ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలలో విజువల్స్ పరిశీలించిన పోలీసులు నిందితుడి పోలికలు ఉండడంతో ఖదీర్​ఖాన్​ను హైదరాబాద్​లో గతనెల 29న అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ నెల 2 వరకు మెదక్ పీఎస్​లోనే ఉంచి చిత్రహింసలు పెట్టారు. ఆ రోజే అతని భార్యకు విషయం చెప్పి తీసుకెళ్లమని చెప్పారు. పోలీస్ స్టేషన్​కు వెళ్లి చూస్తే.. ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. అలాగో అలా అతికష్టం మీద ఇంటికి తీసుకెళ్లాం. తామే వచ్చి కొన్ని మందులు ఇస్తామని ఖదీర్​ఖాన్​ను బయటకు తీసుకురావొద్దని హుకుం జారీ చేశారు. ఈ నెల 8న ఖదీర్ పరిస్థితి విషమంగా మారింది. మొదలు దగ్గరలోని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ నుంచి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించారు. ఫిబ్రవరి 12న గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా గురువారం అర్ధరాత్రి ప్రాంతంలో మరణించారు.

ఇదే విషయమై మెదక్ డీఎస్పీ సైదులును వివరణ కోరగా ఆయన ఈ విధంగా స్పందించారు. ఖదీర్​ఖాన్ దొంగతనం చేశాడనే అనుమానంతోనే మెదక్‌ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. సాంకేతికపరమైన విచారణ చేశారు తప్పా ఆయనను కొట్టలేదన్నారు. దొంగతనానికి పాల్పడలేదని తేలడంతో మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి ఖదీర్ కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు. తర్వాత కొన్ని రోజులకు ఆయన అస్వస్థతకు గురయ్యాడని పేర్కొన్నారు.

ఈ మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ.. పోలీసులు కొట్టారని ఆరోపణలు రావడంతో మెదక్ ఎస్సై రాజశేఖర్, కానిస్టేబుళ్లు ఆర్.పవన్​కుమార్, బీ. ప్రశాంత్​లను ఫిబ్రవరి 14న మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని బదిలీ చేశారని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని డీఎస్పీ సైదులు వెల్లడించారు. ఆసుపత్రిలో ఉన్న ఖదీర్‌ఖాన్‌ను పరామర్శించేందుకు ఈనెల 9న పలువురు నేతలు, స్థానికులు ఆయన వద్దకు వెళ్లారు. తనను పోలీసులు ఎలా కొట్టారో వారికి ఆయన వివరించారు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.