ETV Bharat / state

BJP, BRS మధ్య మాటల తూటాలు.. హీటెక్కుతున్న రాష్ట్ర రాజకీయం

author img

By

Published : Feb 18, 2023, 8:34 AM IST

BJP and BRS
BJP and BRS

BJP and BRS War : కేంద్ర ప్రభుత్వం, బీఆర్​ఎస్ సర్కార్‌ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఇప్పటికే వివిధ అంశాలపై కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య విమర్శలు, సవాళ్లు, లేఖాస్త్రాలు కొనసాగుతుండగా తాజాగా అప్పులు, మెడికల్‌ కాలేజీల అంశాలు మరింత కాకరాజేశాయి. అసెంబ్లీ వేదికగా కేంద్రంపై సీఎం కేసీఆర్ చేసిన విమర్శలను హైదరాబాద్‌ పర్యటనలో తిప్పికొట్టిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ వైద్యకళాశాలలపై రాష్ట్రప్రభుత్వం సరైన ప్రతిపాదనలే పంపలేదన్నారు. దీనిపై కేంద్రమంత్రులకు అబద్దాలు చెప్పడంలోనైనా ప్రధాని శిక్షణ ఇప్పించాలని కేటీఆర్, హరీశ్‌రావు విమర్శలతో మాటలవేడి తారస్థాయికి చేరింది.

కేంద్రం, రాష్ట్రప్రభుత్వం మధ్య ముదిరిన మాటలయుద్ధం

BJP and BRS War : బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం.. బీఆర్​ఎస్ సర్కార్‌ మధ్య మాటల వార్‌ కొనసాగుతోంది. రాష్ట్రానికి వచ్చిన నిధులు, ప్రాజెక్టులు అంశంపై ఇప్పటికే సవాళ్లు, లేఖలు, ప్రతిలేఖలు కొనసాగుతున్నాయి. పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లేదే ఎక్కువ.. వచ్చేది తక్కువ అని రాష్ట్ర మంత్రులు చెబుతున్నారు. మరో అడుగు ముందుకేసిన ఐటీ మంత్రి కేటీఆర్ తాము చెబుతున్న లెక్కలు తప్పని రుజువుచేస్తే రాజీనామాకు కూడా సిద్ధమని సవాల్‌ విసురుతున్నారు. బీఆర్​ఎస్ సర్కార్‌ చేస్తున్న విమర్శలపై కిషన్‌రెడ్డి సహా రాష్ట్రానికి వస్తున్న పలువురు కేంద్ర మంత్రులు సైతం దీటుగానే బదులిస్తున్నారు. పన్నుల వాటాయే కాదు.. వివిధ పథకాల రూపంలో రాష్ట్రానికి అంతకంటే ఎక్కువగానే నిధులు వస్తున్నాయని చెబుతున్నారు.

5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం పెద్ద జోక్‌ : ఈ క్రమంలోనే టీఆర్​ఎస్ నుంచి బీఆర్​ఎస్​గా మార్పు చెందిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకుని విమర్శల వాడిని పెంచారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వమే పెద్దగండంగా మారిందంటూ బహిరంగ సభలు సహా ప్రభుత్వ కార్యక్రమాల వేదికగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కేంద్రంపై చేసిన ఆరోపణలు మరింత వేడిని రాజేశాయి. తెలంగాణకు ఒక్క వైద్య కళాశాల కూడా ఇవ్వని భాజపాకు ఎందుకు ఓటు వేయాలంటూ సూటిగా ప్రశ్నించారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం పెద్ద జోక్‌గా అభివర్ణించారు.

కేంద్రం మాదిరిగా రాష్ట్రం అప్పులు చేయటం లేదు : సీఎం కేసీఆర్ విమర్శలపై స్పందించిన కిషన్‌రెడ్డి... చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసత్యాలతో దేశప్రతిష్ఠను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌... బీఆర్ఎస్ సర్కార్‌ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. దీనిని తిప్పికొట్టిన మంత్రి హరీశ్‌రావు కేంద్రం మాదిరిగా వడ్డీలు చెల్లించేందుకు తాము అప్పులు చేయటంలేదని.. భావితరాలకు సంపద సృష్టిస్తున్నట్లు చెప్పారు. మెడికల్‌ కాలేజీల ప్రతిపాదనలు పంపే విషయంలో రాష్ట్రానిదే తప్పు అన్న నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలను హరీశ్‌రావు తిప్పికొట్టారు.

కేంద్ర మంత్రులందరిలో కిషన్ రెడ్డి ఆణిముత్యం : వైద్య కళాశాలల కేటాయింపుపై నిర్మలా సీతారామన్‌ మాటలపై ట్విట్టర్‌ వేదికగా మంత్రి కేటీఆర్ వ్యంగాస్త్రాలు సంధించారు. కిషన్‌రెడ్డి సహా కేంద్ర మంత్రులు చేసిన ట్వీట్లను జతచేస్తూ... అబద్ధాలైనా ఎప్పుడూ ఒకేలా చెప్పేలా కేంద్ర మంత్రులకు శిక్షణ ఇవ్వాలని.. ప్రధాని మోదీకి సూచించారు. తొమ్మిది కళాశాలలు ఇచ్చామని కిషన్ రెడ్డి అంటున్నారని... అసలు తెలంగాణ నుంచి ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని మన్సుఖ్‌ మాండవీయ అంటున్నారన్నారు. మరోవైపు రెండు ప్రతిపాదనలు వచ్చాయని నిర్మలా సీతారామన్ అన్నారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో లేనటువంటి 9 వైద్య కళాశాలలను సృష్టించిన ఘనత... కేంద్రమంత్రి కిషన్​రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. ఆయుష్ పేరిట హైదరాబాద్‌లో కల్పిత "గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్"ను కూడా ప్రకటించారన్నారు. కేంద్ర మంత్రులందరిలో కిషన్ రెడ్డి ఆణిముత్యం అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.