ETV Bharat / state

'అందరూ ఒకే అబద్ధం చెప్పేలా మీ మంత్రులను ట్రైన్ చేయండి.. మోదీ జీ'

author img

By

Published : Feb 17, 2023, 12:48 PM IST

KTR tweet on Nirmala Sitharaman: తెలంగాణకు వైద్య కళాశాలల మంజూరు విషయంలో కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విటర్​లో స్పందించారు. మంత్రుల చెప్పే విషయాలు అబద్దాలని.. కనీసం అబద్ధాలైనా అందరూ ఒకేలా చెప్పాలని, దాని కోసం కేంద్ర మంత్రులకు సరైన శిక్షణ ఇవ్వాలని ప్రధాని మోదీకి వ్యంగ్యంగా కేటీఆర్ ట్వీట్ చేశారు.

Minister KTR
మంత్రి కేటీఆర్

KTR tweet on Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణకు మెడికల్ కాలేజీల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ని విమర్శించిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ఆమెకు కౌంటర్ ఇచ్చారు. ప్రధాన మంత్రి మోదీ.. తమ కేంద్ర మంత్రులకు సరైన శిక్షణ ఇవ్వడం లేదని ట్వీట్ చేశారు. ఎలాగూ అబద్ధాలే చెబుతున్నారు.. కనీసం అందరూ ఒకే అబద్ధం చెప్పేలా అయినా వాళ్లకి ట్రైనింగ్ ఇచ్చి ఉండాల్సిందని మోదీని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.

ఇటీవల తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో.. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంపై విమర్శల వర్షం కురిపించారు. కేంద్రమే భారీగా అప్పులు చేస్తోందని ఆరోపణలు చేశారు. కేంద్రంలో అసమర్థ పాలకులు ఉన్నారంటూ ఘాటుగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్​కు వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. కేసీఆర్​కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తమపై విమర్శలు చేసేవారు ఓసారి వారి సంగతేంటో క్షుణ్నంగా చూసుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సంగతి ఏంటి? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్న సమయంలో.. వైద్య కాలేజీలు లేని జిల్లాల పేర్లను పంపాలని కేసీఆర్​ సర్కార్​ను కోరామని.. కానీ ఈ సర్కార్.. ఇప్పటికే వైద్య కళాశాలలు ఉన్న జిల్లాల పేర్లను ప్రతిపాదిస్తూ మళ్లీ పంపిందని చెప్పారు. అందుకే ఆ ప్రతిపాదనను తిరస్కరించామని వేరే జిల్లాల పేర్లను పంపమని కోరినట్లు తెలిపారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు దానిపై స్పందించలేదని మండిపడ్డారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి.. కేసీఆర్​కు తన రాష్ట్రంలో ఏ జిల్లాలో వైద్య కళాశాలలు ఉన్నాయో కూడా తెలియదని ఎద్దేవా చేశారు.

నిర్మలమ్మ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. తెలంగాణకు తొమ్మిది కళాశాలలు ఇచ్చామని కిషన్ రెడ్డి అంటున్నారని.. అసలు తెలంగాణ నుంచి ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని మాన్సుక్ మాండవీయ అంటున్నారని ట్వీట్ చేశారు. మరోవైపు రెండు ప్రతిపాదనలు వచ్చాయని నిర్మలా సీతారామన్ అంటున్నారని చెప్పారు. ముగ్గురు చెరో మాట చెబుతున్నారని అబద్ధాలు చెప్పేటప్పుడైనా అందరూ ఒకే మాట మీద ఉండాలి కదా అని చురకలంటించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.