ETV Bharat / state

వాస్తవాలు మాట్లాడితే కేంద్ర మంత్రులకు నిద్ర పట్టడం లేదు: హరీశ్‌రావు

author img

By

Published : Feb 17, 2023, 5:53 PM IST

Updated : Feb 17, 2023, 6:15 PM IST

Harishrao fires on Nirmala Sitharaman Comments: కేంద్ర ఆర్థిక మంత్రి తెలంగాణ సర్కార్‌పై చేసిన విమర్శల పట్ల రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఎదురుదాడి చేశారు. బురద జల్లడం తప్పితే... కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమిలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై సీఎం కేసీఆర్‌ వాస్తవాలు మాట్లాడితే కేంద్ర మంత్రులకు నిద్రపట్టడంలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా రాష్ట్ర సర్కార్‌ ఎక్కడ అప్పులు చేసిందని ఆయన ప్రశ్నించారు.

Harishrao
Harishrao

Harishrao fires on Nirmala Sitharaman Comments: కేంద్ర ప్రభుత్వ తీరుపై సీఎం కేసీఆర్‌ వాస్తవాలు మాట్లాడితే కేంద్ర మంత్రులకు నిద్రపట్టడంలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం హైదరాబాద్​లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై చేసిన విమర్శలపై ఆయన ఎదురుదాడి చేశారు. కేంద్రం మాదిరిగా వడ్డీలు చెల్లించేందుకు తాము అప్పులు చేయటంలేదని... తెలంగాణ భావితరాలకు సంపద సృష్టిస్తున్నట్లు చెప్పారు.

అయిన కేంద్ర ప్రభుత్వాన్ని కాదని రాష్ట్ర సర్కార్‌ ఎక్కడా అప్పులు చేయలేదని స్పష్టం చేశారు. దేశంలో నెలకొన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో పూర్తి ఆధారాలతో మాట్లాడారన్నారు. తెలంగాణ అప్పుల గురించి మాట్లాడే ముందు నిర్మలాసీతారామన్‌ కేంద్రం అప్పుల గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. వైద్యకళాశాలల ఏర్పాటుపై ఒక్కో కేంద్ర మంత్రి ఒక్కో విధంగా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. వేరే రాష్ట్రాలకు ఒక నీతి తెలంగాణకు ఒక నీతినా అని ప్రశ్నించారు.

అప్పులు పెరగడానికి కేంద్రమే కారణం : తెలంగాణకు రావాల్సి నిధులను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని హరీశ్​ మండిపడ్డారు. ఫైనాన్స్ కమిషన్ నిర్ణయాలను తుంగలో తొక్కి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. జీఎస్టీ నిధుల విషయంలో ఆంధ్రప్రదేశ్​కి నిధులను ఇచ్చి తెలంగాణకి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. రాష్ట్రంలో అప్పులు పెరగడానికి కేంద్రప్రభుత్వమే కారణమని హరీశ్​ ఆరోపించారు.

వాస్తవాలు మాట్లాడితే కేంద్ర మంత్రులకు నిద్ర పట్టడం లేదు: హరీశ్‌రావు

'నిర్మలా సీతారామన్‌ తెలంగాణపై విషం గక్కే ప్రయత్నం చేశారు. కేంద్రానికి తెలియకుండా తెలంగాణ ఎక్కడా అప్పులు చేయలేదు. కేంద్రంలాగా మేము వడ్డీలు చెల్లించేందుకు అప్పులు చేయటంలేదు. చేసిన అప్పులతో తెలంగాణ భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాం. అప్పులతో ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి చేశాం. కేంద్రం రూ.లక్షల కోట్లు అప్పు తీసుకుని ఏం చేస్తోంది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు.. చేశారా..? కేంద్ర బడ్జెట్‌లో పేదలకు కోతలు తప్పా.. మరేమి లేదు. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ అన్ని అబద్దాలు చెప్పారు.'-హరీశ్​రావు, రాష్ట్ర ఆర్థిక మంత్రి

కేంద్రం నుంచి రూ.1.25 లక్షల కోట్లు రావాలి: ఆయుష్ మాన్ భారత్ కింద 25 లక్షల మందికి మాత్రమే లబ్ది జరుగుతుందన్న హరీశ్​రావు.. ఆరోగ్య శ్రీ కింద 5 లక్షల 90 వేల మందికి లబ్ది జరుగుతుందని పేర్కొన్నారు. తాము అడిగేది ప్రభుత్వ మెడికల్ కళాశాల.. తమరు ఇవ్వమని మొండి చేయి చూపిస్తే రాష్ట్ర నిధులతో వరంగల్​లో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణకు వైద్య కళాశాలలు కోరితే మంజూరు చేయట్లేదని ధ్వజమెత్తారు. సొంత నిధులతో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.1.25 లక్షల కోట్లు రావాలన్న హరీశ్​రావు.. ముందు బకాయిలు చెల్లించి కేంద్రమంత్రులు మాట్లాడాలని సూచించారు.

ఇవీ చదవండి:

Last Updated :Feb 17, 2023, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.