ETV Bharat / state

5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ మీద కేసీఆర్‌ జోక్ చేయొద్దు: నిర్మలా సీతారామన్

author img

By

Published : Feb 16, 2023, 9:37 PM IST

Nirmala Sitharaman
Nirmala Sitharaman

Nirmala Sitharaman Comments on CM KCR: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె... ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ మీద కేసీఆర్‌ జోక్ చేయొద్దని కోరారు. 2014లో తెలంగాణ అప్పులు ఎంత? ఇప్పుడెంత అని ప్రశ్నించిన ఆమె... రాష్ట్రాల అప్పులను కంట్రోల్ చేసే బాధ్యత కేంద్రానికి ఉందని పేర్కొన్నారు.

Nirmala Sitharaman Comments on CM KCR: తెలంగాణలో ఏ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉన్నాయో తెలియదా అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్​ను ఉద్దేశించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. అమృతకాల బడ్జెట్ అంశంపై దూరదర్శన్ న్యూస్ హైదరాబాదులో ఏర్పాటు చేసిన డీడీ డైలాగ్ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సీఎం కేసీఆర్​, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అప్పుడు ఎంత.. ఇప్పుడు ఎంత..?: చేతులు జోడించి చెబుతున్నా.. దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్​లకు చేరాలన్న లక్ష్యంపై విమర్శలు చేయొద్దని నిర్మలా సీతారామన్ సీఎం కేసీఆర్​కు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన అప్పులపై కేంద్ర ఆర్థిక మంత్రి పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ పాలనకు ముందు తెలంగాణ రాష్ట్ర అప్పులు ఎంత? ఇప్పుడు ఎంత ? అని ఆమె ప్రశ్నించారు. 2014లో తెలంగాణ రాష్ట్రానికి 60వేల కోట్ల రూపాయలే ఉండగా, ఇప్పుడు 3లక్షల కోట్ల రూపాయలకు చేరాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్రాల అప్పులను కంట్రోల్ చేసే బాధ్యత కేంద్రానికి ఉందన్నారు.

ఆ జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఇవ్వలేం: రాష్ట్రాలు చేసే అప్పులను నియంత్రించే బాధ్యత రాజ్యాంగం కేంద్రానికి ఇచ్చిందని... దానినే తాము అమలు చేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మెడికల్ కాలేజీలు లేని జిల్లాల పేర్లను అడిగినప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు బాధపడితే ఏం లాభమని ఆమె ప్రశ్నించారు. నో డేటా అవైలబుల్ గవర్నమెంట్ ఎవరిదో ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. నంబర్లు, ప్రాజెక్టులు చూసుకొని బీఆర్​ఎస్ నాయకులు మాట్లాడాలని పేర్కొన్నారు. కరీంనగర్, ఖమ్మంలో మెడికల్ కాలేజీలు ఉన్నా అవే జిల్లాల పేర్లు మళ్లీ మెడికల్ కాలేజీల కోసం పంపించారని ఆమె తెలిపారు. అందుకే తిరస్కరించి పంపించినా... కొత్త జిల్లాల పేర్లు ఇప్పటికీ పంపించలేదన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.