ETV Bharat / state

కలకలం రేపుతున్న నకిలీ విత్తనాల దందా

author img

By

Published : May 26, 2021, 9:17 AM IST

Counterfeit seed
కుమురం భీం జిల్లాలో నకిలీ విత్తనాలు

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల దందా కలకలం రేపుతోంది. అధిక దిగుబడి ఆశచూపి దళారులు రైతులను మోసం చేస్తున్నప్పటికీ... నకిలీ విత్తనాలకు అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. గతేడాది, ప్రస్తుతం ఈ వ్యవహారంలో పట్టుబడ్డ కేసుల సంఖ్యే దీని తీవ్రతకు అద్దం పడుతోంది. పూర్తి వివరాలతో ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న ఈ నకలీ విత్తనాల దందాపై ప్రత్యేక కథనం.

నకిలీ పత్తి విత్తనాలను నమ్మి రైతులు మోసపోకుండా ఒకవైపు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంటే.. కొంతమంది దళారులు మాత్రం రైతులను నిండా ముంచుతున్నారు. అధిక దిగుబడి వస్తుందని ఆశ చెప్పి నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. రైతులను నిలువునా ముంచుతున్న దళారుల ఆట కట్టించడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు చేపడతామని అంటున్నప్పటికీ… ఆ దిశగా అడుగులు పడడం లేదు. దీంతో నకిలీ విత్తన దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది.

కుమురం భీం అసిఫాబాద్ జిల్లాలో 3 లక్షల 50 వేల ఎకరాల్లో రైతులు పత్తిని సాగు చేస్తుండగా.. దాదాపు 6 లక్షల 50 వేల విత్తనాలు అవసరమని వ్యవసాయ అధికారుల అంచనా. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ తర్వాత ఎక్కువగా కుమురం భీం జిల్లా లోనే పత్తిని సాగుచేస్తున్నారు. సాగుకు అవసరమయ్యే విత్తనాలకు ప్రైవేట్ కంపెనీలే దిక్కు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని దళారులు వివిధ కంపెనీలు, వివిధ పేర్లతో విరివిగా నకిలీ పత్తి విత్తనాలను రైతులకు అంటగట్టి నిండా ముంచుతున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన దళారులు వ్యూహాత్మకంగా తమ నకిలీ పత్తి విత్తన దందా కొనసాగిస్తున్నారు. ఇందుకు ఇటీవల చింతలమానేపల్లి పోలీసులు భారీ ఎత్తున నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనపర్చుకోవడమే నిదర్శనం.

ఈనెల 18న పోలీసులు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామంలోని ఒక గోదాంలో నకిలీ విత్తనాలు ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించగా... భారీ ఎత్తున నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. 42 లక్షల విలువచేసే 21 క్వింటాళ్ల విత్తనాలు, ఒక కారు స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ఈ నెల 20న కాగజ్ నగర్ పట్టణంలోని ఒక ట్రాన్స్ పోర్ట్​లో నకిలీ పత్తి విత్తనాలు దిగుమతి జరుగుతున్నాయన్న సమాచారం మేరకు టౌన్ పోలీసులు తనిఖీలు చేయగా... 240 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు లభించాయి. వాటి విలువ రూ.లక్షా 84 వేలు. ఈ కేసులో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లాడ్జీలలో బస...

ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలువురు దళారులు ఆయా సీజన్లకు ముందే కుమురం భీం జిల్లా కాగజ్ నగర్, మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు... బెల్లంపల్లి పట్టణాల్లోని పలు లాడ్జింగ్ లలో బస చేస్తున్నారు. ఆయా జిల్లాల్లోని మారుమూల మండలాలైన పెంచికలపేట, బెజ్జూరు, చింతలమానేపల్లి, నెన్నెల, తాండూరు, వేమనపల్లి, చెన్నూరు తదితర మండలాల్లో సబ్ ఏజెంట్లను నియమిస్తున్నారు. వారి ద్వారా నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్నారు. ఈ దందా గత కొన్నేళ్లుగా సాగుతోంది. కుమురం భీం జిల్లాలో గతేడాది నకిలీ పత్తి విత్తనాలను భారీ ఎత్తున స్వాధీనపరచుకొని 18 మందిపై కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. మంచిర్యాల జిల్లాలో గతేడాది 30 కేసులు నమోదు చేయగా.. ప్రస్తుతం ఐదు కేసులు నమోదు అయినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో నకిలీ విత్తనాలకు సంబంధించిన 12 మంది సూత్రధారులు ఈ దందాను కొనసాగిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సబ్ ఏజెంట్లు దాదాపు 50కి పైగా నే ఉన్నట్లు తెలిసింది. వీరందరి పై నిఘా పెట్టి అరెస్టు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు.

గుట్టు చప్పుడు కాకుండా...

వివిధ రాష్ట్రాల నుంచి నకిలీ పత్తి విత్తనాలు, నిషేధిత గడ్డి మందులు పలు ప్రైవేటు ట్రాన్స్​పోర్ట్​లలో, కొబ్బరిబొండాలు రవాణా జరిగే లారీలలో గుట్టుచప్పుడు కాకుండా దిగుమతి చేస్తున్నారు. కుమురం భీం జిల్లా లోని మహారాష్ట్ర సరిహద్దులో దళారులు గోదాములను ఏర్పాటు చేసుకుని నిల్వ చేస్తున్నారు. రాత్రి, వేకువజామున వాహనాల్లో ఆయా మండలాల్లోని సబ్ ఏజెంట్లకు సరఫరా చేసి తమ దందాను రహస్యంగా కొనసాగిస్తున్నట్లు తెలిసింది.

నకిలీ విత్తనాలతో అనర్థాలు..

నకిలీ విత్తనాలు నిషేధిత గడ్డి మందులను వాడితే భూమి సారం పోతుంది. పంటలను సాగు చేసే రైతులు క్యాన్సర్ బారిన పడతారు. జీవ జాతుల మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. అయినా పని భారం తగ్గి.. అధిక దిగుబడులు సాధించవచ్చునని భావించి ఆ గడ్డి మందు, నకిలీ విత్తనాలను సాగుచేస్తున్నారు రైతులు. వాటి వల్ల కలిగే నష్టాలను రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.

నకిలీ విత్తనాల దందాపై దృష్టిసారించిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. రైతులకు నకిలీ విత్తనాలు, నిషేధిత గడ్డి మందు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం కమిషనర్ కుమురం భీం జిల్లా ఇంఛార్జీ ఎస్పీ సత్యనారాయణ హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలో పలువురు సూత్రధారులను ఇప్పటికే గుర్తించామని త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు. రైతులు సైతం ప్రభుత్వం ఆమోదించిన లైసెన్స్ ఎరువుల, విత్తనాల దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయాలని, వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు పాటించాలని కోరారు.

ఇదీ చూడండి: ఆనందయ్య మందుపై పిటిషన్.. విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.