ETV Bharat / state

నిరుద్యోగులకు అండగా నిలుస్తోన్న 'కరీంనగర్ కేంద్ర గ్రంథాలయం'

author img

By

Published : Apr 4, 2023, 9:00 AM IST

Karimnagar Central Library
కరీంనగర్ కేంద్ర గ్రంథాలయం

Karimnagar Central Library: టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ల తర్వాత ఉద్యోగాల సాధనకు నిరుద్యోగులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారికి కరీంనగర్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ అండగా నిలుస్తోంది. ఎలాగైనా ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో యువకులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. కొందరు ఉద్యోగాలకు సెలవు పెట్టి వచ్చి, పోటీ పరీక్షల కోసం సాధన చేస్తున్నారు. అలాంటి వారికి కరీంనగర్ కేంద్ర గ్రంథాలయం వెన్నుదన్నుగా నిలుస్తోంది.

నిరుద్యోగులకు అండగా నిలుస్తోన్న కరీంనగర్ కేంద్ర గ్రంథాలయం

Karimnagar Central Library: ఇటీవల టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలు రద్దుకావడంతో నిరుద్యోగుల్లో నెలకొన్న ఆందోళన తొలగించేందుకు కరీంనగర్‌ జిల్లా కేంద్ర గ్రంథాలయం నడుం బిగించింది. ఉద్యోగార్థుల సౌకర్యార్థం గ్రంథాలయాన్ని 24 గంటలపాటు తెరిచి ఉంచుతున్నారు. రద్దైన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఉత్తీర్ణత సాధించిన 20 మంది అభ్యర్థులు సహా వందలాదిమంది నిత్యం ఆ గ్రంథాలయానికి వచ్చి చదువుతున్నారు. వారికి అండగా నిలుస్తూ జిల్లా గ్రంథాలయ సంస్థ నిరుద్యోగులకు ఉచితంగా భోజనం అందిస్తోంది. త్వరలో ఉచితంగా ఇంటర్‌నెట్‌, వైఫై అందిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు: రాత్రివేళల్లో ఇక్కడికొచ్చి చదువుకునే యువతుల కోసం ప్రత్యేకంగా రెండు గదులు కేటాయించారు. వారి రక్షణ కోసం ప్రత్యేకంగా భద్రతా సిబ్బందిని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆరుబయట చదువుకునేవారికోసం హైమాస్‌లైట్లు బిగించారు. విద్యార్థుల కోసం కుర్చీలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వేళ 5 రూపాయల ప్రభుత్వ భోజన పథకం ద్వారా భోజనం అందిస్తున్నారు.

గ్రంథాలయంలో గదుల వైశాల్యం పెంచాలి: నిరుద్యోగులు, పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఆ గ్రంథాలయంలో 75 వేలకు పైగా పుస్తకాలు అందుబాటులోఉంచినట్లు గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్‌ పొన్నం అనిల్ కుమార్ తెలిపారు. సిలబస్‌, పరీక్షల్లో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకుని మరిన్ని పుస్తకాలు తెప్పించనున్నట్లు చెప్పారు. పెరుగుతున్న చదువరుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని గ్రంథాలయంలో గదుల వైశాల్యం విస్తరించాలని విద్యార్థులు కోరుతున్నారు. స్మార్డ్‌సిటీ ప్రణాళికలో భాగంగా గ్రంథాలయంలో డిజిటల్‌ సేవలను మరింత ఉన్నతీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

"నేను సంవత్సరం నుంచి ఇక్కడ చదువుకుంటున్నాను. 24 గంటలు గ్రంథాలయ సేవలు అందుబాటులో ఉంటున్నాయి. పార్ట్​టైం ఉద్యోగం, పేదవాళ్లకి చాలా ఉపయోగపడుతుంది. కొంత మంది చదువుకోడానికి అన్ని రకాల పుస్తకాలు కొనుక్కోడానికి వారి ఆర్థిక పరిస్థితి ఉండదు. ఇక్కడ అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అధికారులు ఏర్పాటు చేశారు. అన్ని రకాల న్యూస్​ పేపర్​లు అందుబాటులో ఉంటున్నాయి. అమ్మాయిలకు బాత్​రూంలు, ఛైర్స్, ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేశారు. చదువుకోడానికి వాతావరణం చాలా బాగుంది. నేను గ్రూప్​-2 పరీక్షకు సన్నద్దం అవుతున్నాను."- నిరుద్యోగిని

"ఈ గ్రంథాలయంలో ఇంత మంది చదువుకోడం మేము చాలా సంతోషిస్తున్నాం. వారికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ప్రభుత్వం రూ.7 కోట్లుతో 5 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. రానున్న రోజుల్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం. పగటి పూట సుమారు 500 మంది , రాత్రి పూట 200 మంది అభ్యర్థులు చదువుకుంటున్నారు." - పొన్నం అనిల్‌కుమార్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్, కరీంనగర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.