ETV Bharat / state

Greenery in Singareni Coal mines area : బొగ్గుగనుల్లో పచ్చదనం.. పర్యావరణ సమతౌల్యానికి చెట్ల పెంపకం

author img

By

Published : May 31, 2023, 2:54 PM IST

Updated : May 31, 2023, 10:28 PM IST

Greenery in Singareni Coal mines area: సింగరేణిలో నిత్యం 2.20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే దుమ్ము, ధూళి కారణంగా పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని నివారించేందుకు సింగరేణి చర్యలు చేపడుతోంది. రామగుండం లోని మొదటి ఓపెన్ కాస్ట్‌లో మొక్కల పెంపకంతో పాటు అనేక చర్యలు చేపడుతూ... మొత్తం సింగరేణి సంస్థకే ఆదర్శంగా నిలుస్తోంది. సింగరేణి అంటే బొగ్గే కాదు...పర్యావరణం కూడా మాకు ముఖ్యమేనని చాటి చెబుతున్నారు. మరి, వాటి ఫలితాలు ఎలా ఉండనున్నాయి....? అసలు, చెట్లు నాటడం వల్ల నిజంగానే దుమ్ముధూళిని అరికట్టవచ్చా...? ఇప్పుడు చూద్దాం.

Singareni Coal Mines
సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో.. పర్యావరణ పరిరక్షణ

సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో.. పర్యావరణ పరిరక్షణ

Greenery in Singareni Coal mines area : బొగ్గు ఉత్పత్తి అంటే ఎన్నో వ్యయప్రయాసలతో కూడిన ప్రక్రియ. ఎందుకంటే వాటి నిర్వహణలో అనేక విభాగాలు ఉండటం వల్ల దాని నుంచి దుమ్ముధూళి కణాలు వెలువడుతుంటాయి. బొగ్గులో కార్బన్​తో పాటు సల్ఫర్, నైట్రోజన్, ఆర్గానోమెటాలిక్ సమ్మేళనాలతో సహా అనేక పదార్థాలూ ఉన్నాయి. ఇవి వాతావరణంలో మిళితమై ఆ గాలిని మనం పీలుస్తే ప్రజలకు శ్వాసకోశ సమస్యలతో పాటు పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని.. అలాంటి వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు పలు చర్యలకు ఉపక్రమించారు. ప్రధానంగా నల్లబంగారం ఉత్పత్తి చేసే సింగరేణి మంచిర్యాల, పెద్దపల్లి, భూపాల పల్లి, ఖమ్మం, ఆసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తరించి ఉంది. రాష్ట్రంలో మొత్తం 22 భూగర్భగనులు, 19 ఉపరితల గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. దీంతో ఎలాగైనా వాతావరణ కాలుష్యాన్ని కాపాడాలని భావించిన సంస్థ అందుకు సంబంధించిన చర్యలపై దృష్టి సారించింది.

"ఆర్జీ-3లో సుమారుగా 5.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయటం జరుగుతోంది. ఓసీ1, ఓసీ2 నుంచి వీటి కోసం ప్రత్యేకంగా ఓబీ డమ్స్ మీద మొక్కలు పెంచటం, బారియర్స్​ను నిర్మించటం, మిస్ట్ స్ప్రే చేయటం లాంటివి చేసి పరిసర ప్రజలకు ధ్వని, పొగ కాలుష్యం నుంచి ఉపశమనం కలిగిస్తున్నాం. ఇవన్నీ కూడా వాతావరణ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు చేస్తున్నాం. చుట్టు పక్కల ఉన్న ప్రజల ఆరోగ్యం కోసం మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నాం." - వెంకటేశ్వర్‌రావు, జనరల్ మేనేజర్‌, ఆర్జీ-3 రామగుండం, పెద్దపల్లిజిల్లా

సత్ఫలితాలిస్తే మరో చోట : గనుల నుంచి వెలువడే బొగ్గును ఒక చోటుకు చేర్చి వ్యాగన్లు, సైలో బంకర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించే చోటునే కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంటుగా పిలుస్తుంటారు. ప్రస్తుతం సీహెచ్‌పీల నుంచి దుమ్ము ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా నీటిని చల్లించడం, చుట్టూ పచ్చటి కవర్లను కట్టడం వంటి పనులు చేస్తున్నారు. ఐతే, ఈ చర్యలతో సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం కావడం లేదు. అందుకే సింగరేణిలోనే మొదటిసారిగా రామగుండం-3 డివిజన్‌లోని ఓసీపీ-1 సీహెచ్‌పీలో పర్యావణ హితంగా మూడు దశల్లో మొక్కల పెంపకానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమం సత్ఫలితాలిస్తే మిగతా సీహెచ్‌పీల్లో అమలు చేయాలని యాజమాన్యం భావిస్తోంది.

పర్యావరణాన్ని సమతుల్యం చేసేందుకు : లక్ష్యానికి మించి బొగ్గును ఉత్పత్తి చేయడం వల్ల దెబ్బతిన్న పర్యావరణాన్ని సమతుల్యం చేసేందుకు ఓసీపీ-1తో పాటు పరిసర గ్రామాల్లో మొక్కలు నాటాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సింగరేణికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో 3.60 కోట్ల రూపాయలతో ఓసీపీ-1 సీహెచ్‌పీతో పాటు పరిసర జూలపల్లి, ముల్కలపల్లి, పన్నూరు, రత్నాపూర్‌, నాగేపల్లి గ్రామాల్లో మొక్కలు నాటడం, ఇంకుడుగుంతలు, చెక్‌డ్యాంలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

"బొగ్గు తీసే ప్రాసెస్​లో కోల్ డస్ట్ అనేది జనరేట్ అవుతోంది. దీనిని నివారించడానికి వర్టికల్ గ్రీనరీ అనే కాన్సెప్ట్​ను చేపట్టాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నాయో, ఓపెన్ ఏరియాలు ఉన్నాయో అక్కడ గ్రీనరినీ ప్రమోట్ చేయడానికి ఈ నర్సరీలో ఉన్న మొక్కలను పెంచుతుంటాము. ఈ నర్సరీలో సుమారు 7లక్షల మొక్కలున్నాయి. అరవై నుంచి డెబ్బై జాతుల మొక్కలున్నాయి. అడవులలో అంతరించి పోతున్న మొక్కలను సైతం పెంచి జీవ వైవిధ్యాన్ని పెంపొందించడంలో ముఖ్య భూమిక సింగరేణి పోషిస్తోంది. " -బి.కర్ణనాయక్‌, డీజీఎం, ఆర్జీ-3 అటవీ విభాగం

3 దశల్లో మొక్కలు పెంచే విధంగా : సీహెచ్‌పీ నుంచి వెలువడే దుమ్ము పరిసర గ్రామాలకు విస్తరించకుండా 3 దశల్లో మొక్కలు పెంచే విధంగా ప్రణాళిక అమలు చేస్తున్నారు. పరిసర గ్రామాలకు దుమ్ము విస్తరించకుండా 30 మీటర్ల ఎత్తు పెరిగే సరుగుడు, నారవేప, రావి, వెదురు, జామాయిల్‌, బూరుగ, తెల్లమద్ది, మర్రి మొక్కలను మూడు వరుసల్లో పెంచనున్నారు. ఓసీపీ-1లో సరికొత్తగా చేపట్టిన 3 దశల మొక్కల పెంపకంపై పరిసర గ్రామాల ప్రజల్లో ఆసక్తి నెలకొంది. 3 దశల్లో మొక్కల పెంపకంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు అధికారులు. అటు కందకాలు తవ్వడం వల్ల భూగర్భ జలాల పెంపునకు దోహదం చేస్తాయని అంటున్నారు.

జల కాలుష్యం కోసం కూడా : సింగరేణి సంస్థ ధూళి దుమ్ముతో పాటు జల కాలుష్యం నివారణకు చర్యలు చేపట్టింది. గోదావరిలో నేరుగా కలుస్తున్న మురికి నీటిని నివారించేందుకు ఎస్టీపీ ప్లాంట్లు నిర్మిస్తోంది. రోజుకు 17 మిలియన్‌ లీటర్ల మురికి నీటిని శుద్ధి చేసేందుకు భారీ ప్రాజెక్టు పనులు చేపట్టగా ఇప్పటికే రోజుకు 2 లక్షల లీటర్ల మురికి నీటిని శుద్ధిచేసే మరో మినీ ప్లాంటు పనులు పూర్తయి... మురికి నీటిని శుద్ధి చేస్తోంది. మరోవైపు లక్షల మొక్కలు నాటేందుకు నర్సరీల్లో మెుక్కలను పెంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పూల మొక్కలతో పాటు ఔషధ మొక్కలను కూడా ఇక్కడ పెంచుతున్నారు.

ఇది చాలా అవసరం : బొగ్గు గనుల విస్తరణ వేగం జరుగుతున్న క్రమంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఆర్జీ-1లో తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తాయని అధికారులు భావిస్తున్నారు. వీటితో వచ్చే ఫలితాలతో రాబోయే కొన్ని రోజుల్లో సింగరేణిలోని... మరికొన్ని ప్రాంతాల్లో కూడా వీటిని విస్తరించనున్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఇది చాలా అవసరమని ప్రజలు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :May 31, 2023, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.