ETV Bharat / state

Huzurabad By Election: ఉపఎన్నిక రద్దుకు ఈసీకి కాంగ్రెస్‌ వినతి

author img

By

Published : Oct 29, 2021, 6:51 AM IST

భాజపా, తెరాసలు పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయని కాంగ్రెస్​ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌ ఉపఎన్నిక (huzurabad by election 2021)ను రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు దిల్లీలో ఈసీకి వినతిపత్రాన్ని అందించారు.

Huzurabad By Election
ఉపఎన్నిక రద్దుకు ఈసీకి కాంగ్రెస్‌ వినతి

భాజపా, తెరాసలు పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడినందున హుజూరాబాద్‌ ఉపఎన్నిక (Huzurabad By Election 2021)ను రద్దు చేయాలని కాంగ్రెస్‌ నేతలు భారత ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌, కార్యదర్శి (సంస్థాగత) వంశీచంద్‌రెడ్డి, పీసీసీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమకుమార్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కార వేణుగోపాల్‌లు గురువారం సాయంత్రం దిల్లీలోని ఈసీఐ కార్యాలయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర, ఎన్నికల కమిషనర్‌ అనూప్‌ చంద్ర పాండేను కలిసి వినతిపత్రం సమర్పించారు.

భాజపా, తెరాసలు ఈ ఎన్నిక (Huzurabad By Election 2021)ల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డాయని తెలిపారు. అవి ఓటుకు రూ.6 వేల నుంచి రూ.పది వేల వరకు పంచాయని వివరించారు. అక్రమాలను అరికట్టడంలో రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ విఫలమయ్యారని ఫిర్యాదు చేశారు. తెరాసకు ఓట్లు వేయాలని పోలీసులు బెదిరిస్తున్నారని వివరించారు. శశాంక్‌ గోయల్‌ సహా అధికారులందరినీ మార్చిన తర్వాతే ఉప ఎన్నిక నిర్వహించాలని కోరారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక (Huzurabad By Election 2021) రాజకీయ వ్యభిచారంగా మారిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ విమర్శించారు. పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ కూడా గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని శశాంక్‌గోయల్‌ను కలిసి భాజపా, తెరాసల అక్రమాలపై ఫిర్యాదు చేశారు.

మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలి

వరి సాగు విషయంలో మంత్రులు, కలెక్టర్ల వ్యాఖ్యలపై పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. వారు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. వరి కొనకపోతే మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని తెలిపారు.

తెలంగాణను బలిచ్చే కుట్ర: రేవంత్‌రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్య విస్తరణ ఆకాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోందని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ పార్టీ పెట్టాలని మేమూ కోరుకుంటున్నాం. రెండు రాష్ట్రాలు కలిసిపోతే ఆయన భేషుగ్గా పోటీ చేయొచ్చు. ఏపీ, తెలంగాణ ఒకటే రాష్ట్రంగా ఉండాలని ఏపీ సీఎం జగన్‌ గతంలోనే కోరుకున్నారు. రెండు రాష్ట్రాలను కలిపేస్తే మంచిదే కదా’ అంటూ ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి ట్విటర్‌ వేదికగా స్పందించారు. తెరాస ప్లీనరీలో తెలంగాణ తల్లి బదులుగా తెలుగుతల్లి ప్రత్యక్షం కావడంపై అనుమానాలు వ్యక్తం చేశామన్నారు. ఇప్పుడు పేర్ని నాని వ్యాఖ్యలు ఆ అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయన్నారు. కేసీఆర్‌, జగన్‌లు ‘ఉమ్మడి’ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ‘వందల మంది ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్‌’ అని రేవంత్‌ హెచ్చరించారు.

ఇదీ చూడండి: డబ్బు, మద్యం పంపిణీ ఫిర్యాదులపై ఈసీ ఆరా.. వెంటనే స్పందించాలని ఆదేశాలు

Huzurabad Election: మంత్రి హరీశ్​రావు క్యాంపులో పోలీసుల తనిఖీలు.. ఏం దొరికాయంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.