ETV Bharat / state

Huzurabad Election: మంత్రి హరీశ్​రావు క్యాంపులో పోలీసుల తనిఖీలు.. ఏం దొరికాయంటే..?

author img

By

Published : Oct 27, 2021, 9:24 PM IST

హుజూరాబాద్​ ఉపఎన్నిక ప్రచార గడవు ముగిసింది. ఇక ఓటర్లను నాయకులు నేరుగా ప్రసన్నం చేసుకునే వీలు లేకపోవటం వల్ల.. వేరే పద్ధతులను ఎంచుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. పోలీసులు రంగంలోకి దిగారు. చోటామోటా నాయకులనే కాదు.. బడా నాయకులను కూడా తనిఖీ చేస్తున్నారు. మరోవైపు.. అధికార పార్టీ నేత హరీశ్​రావు క్యాంపులోనూ తనిఖీలు నిర్వహించారు.

police-inspection-in-minister-harish-rao-camp
police-inspection-in-minister-harish-rao-camp

హుజూరాబాద్​ ఉపఎన్నికల్లో నేటితో ప్రచారం ముగియటంతో పోలీసులు రంగంలోకి దిగారు. పలు చోట్ల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు... కవర్లలో నగదు పెట్టి పంచుతున్న వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన నేపథ్యంలో.. ప్రలోభాలపై పోలీసులు దృష్టి​ పెట్టారు. అటు గ్రామాల్లోని చోటామోటా నాయకుల కదలికలపై ఫోకస్​ పెట్టిన అధికారులు.. ఇటు ఇన్ని రోజులు ప్రచారం కోసం బడా నాయకులు పెట్టిన క్యాంపులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చెక్​పోస్టులు ఏర్పాటు చేసి.. చిన్నా, పెద్ద నాయకుల వాహనాలన్నింటినీ తనిఖీలు చేస్తున్నారు.

హరీశ్​ క్యాంపులో తనిఖీలు..

హుజూరాబాద్ మండలం సింగపూర్‌లోని కిట్స్ కళాశాలలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హుజూరాబాద్​ ఉపఎన్నికల ప్రచారం సందర్భంగా.. గత రెండు నెలలుగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్ సునీల్‌రావు... కిట్స్​ కళాశాల గెస్ట్​హౌస్​లోనే బస చేశారు. ఇక ప్రచారం చివరి రోజు నేపథ్యంలో కిట్స్ కళాశాలలోని గెస్ట్‌హౌజ్‌ను పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, బెడ్రూంతో పాటు ఆయా గదుల్లోని కప్‌బోర్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల్లో ఏమీ లభించలేదని పోలీసులు తెలిపారు. అయితే భాజపా ఫిర్యాదు చేయడం వల్లనే తనిఖీలు నిర్వహించారని తెరాస నాయకులు ఆరోపించారు. మరోవైపు.. సింగపూర్‌ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వాహనాన్ని కూడా పోలీసులు తనిఖీ చేశారు.

అధికారులకు సీఈఓ ఆదేశాలు..

ఓటర్లను ఎవరూ ప్రలోభపెట్టకుండా చూడాలని అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ఇప్పటికే స్పష్టం చేశారు. పోలింగ్ ఏర్పాట్లపై కరీంనగర్, హనమకొండ జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో సీఈఓ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించి.. దిశానిర్దేశం చేశారు. 20 కంపెనీల కేంద్ర బలగాలను నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లోనూ మోహరించాలన్న సీఈఓ... ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.

పోలీసుల ప్రత్యేక నిఘా..

డబ్బు, మద్యం పంపిణీపై ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో ఎక్కడా.. నగదు, మద్యం పంపిణీ లేకుండా చూడాలని ఆదేశించారు. ఎక్కడైనా అలాంటి ఘటనలు జరిగినట్లు దృష్టికి వస్తే.. వెంటనే నివేదికలు పంపాలని కలెక్టర్లకు తెలిపారు. ప్రచారం ముగుసినందున తగిన చర్యలు తీసుకోవాలని శశాంక్ గోయల్ చెప్పారు. స్థానికేతరులు ఎవరూ నియోజకవర్గంలో ఉండకుండా చూడాలని అన్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.