ETV Bharat / state

శాలపల్లి వేదికగా నేడు దళితబంధు ప్రారంభోత్సవం

author img

By

Published : Aug 16, 2021, 5:31 AM IST

Updated : Aug 16, 2021, 6:16 AM IST

Dalita bandhu
Dalita bandhu

దళితుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో నేటి నుంచి దళితబంధు పథకం ప్రారంభం కానుంది. హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. లబ్ధిదారు ఎంచుకున్న జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల రూపాయలు పూర్తి రాయతీతో అందించనుంది. దళితబంధుతో పాటు దళిత రక్షణనిధిని కూడా అమలు చేయనున్నారు. దళితుల జీవితాల్లో సమూల మార్పులు తీసుకొచ్చే దళితబంధు పథకాన్ని పూర్తి చిత్తశుద్ధి, నిబద్ధతతో ఉద్యమం తరహాలో అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తోన్న తెలంగాణ దళితబంధు పథకం ఇవాళ ప్రారంభం కానుంది. పేద దళితులకు జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పదిలక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని వంద శాతం రాయతీతో అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన సర్కారు... కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ పద్ధతిలో ప్రారంభిస్తున్నారు. అన్ని దళిత కుటుంబాలకు ఈపథకం ద్వారా సాయం అందించాలని నిర్ణయించారు. హుజురాబాద్​లో జరగనున్న బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్... దళితబంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.

ఇప్పటికే నిధులు బదిలీ

అత్యంత పేదలైన 15 దళిత కుటుంబాలకు సీఎం చేతుల మీదుగా దళితబంధు పత్రాలు, చెక్ అందిస్తారు. దీంతో రాష్ట్రంలో తెలంగాణ దళితబంధు పథకం ప్రారంభం కానుంది. అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో సభలు నిర్వహించి మిగతా లబ్ధిదారులను ఎంపిక చేసి పథకం కింద సాయం అందిస్తారు. హుజురాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం కోసం ఇప్పటికే రూ.500 కోట్లు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఖాతాకు బదలాయించారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన యాదాద్రి జిల్లా వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాల కోసం 7.6 కోట్లను కలెక్టర్ ఖాతాకు బదిలీ చేశారు.

దశల వారీగా అమలు

రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి వంద చొప్పున పేద దళిత కుటుంబాలను ఎంపిక చేసి పథకం కింద ఈ ఏడాది ఆర్థికసాయం అందిస్తారు. మిగతా వారికి దశల వారీగా అమలు చేస్తారు. వచ్చే ఏడాది బడ్జెట్​లో దళితబంధు కోసం రూ.30 వేల కోట్లు వరకు కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అఖిలపక్షం, హుజురాబాద్ దళిత ప్రతినిధులతో ఇప్పటికే సమావేశమై దళితబంధు పథక తీరుతెన్నులు, అమలుపై సీఎం కేసీఆర్ చర్చించారు. ప్రభుత్వం అందించే ఆర్థికసాయంతో జీవనోపాధి, వ్యాపారం కోసం కొన్ని యూనిట్లను కూడా సిద్ధం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంత అవసరాలను దృష్టిలో ఉంచుకొని యూనిట్ల జాబితాను సిద్ధం చేశారు. లబ్ధిదారులు వారికి నచ్చిన ఉపాధిమార్గాన్ని ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మార్గానిర్ధేశం, పర్యవేక్షణ ఉంటుంది. కొంత మంది లబ్ధిదారులు కలిసి ఎక్కువ పెట్టుబడితో పెద్ద యూనిట్ పెట్టుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో దళితబంధు అమలు కానుంది.

అన్ని రకాలుగా అండగా ఉండేలా..

వార్డు, గ్రామ స్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యేకాధికారులను నియమించనున్నారు. కేవలం ఆర్థిక ప్రేరణ ఇవ్వటం వరకే పరిమితం కాకుండా దళితులను వివిధ వ్యాపార రంగాల్లో ప్రోత్సహించేందుకు ప్రత్యేక రిజర్వేషన్లు కూడా అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొంది ఏర్పాటు చేసుకునే ఫర్టిలైజర్ షాపులు, మెడికల్ షాపులు, ఆస్పత్రులు, వసతి గృహాలు, సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టులు, ఇంకా ప్రభుత్వం ద్వారా లభించే ఇతర కాంట్రాక్టులు, వైన్, బార్ షాపుల ఏర్పాటుకు లైసెన్స్ ఇచ్చే దగ్గర ప్రభుత్వం.... దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయనున్నారు.

పథకంలా కాదు.. ఉద్యమంలా తీసుకుపోయేలా..

దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన కుటుంబం, కాలక్రమంలో ఏదైనా ఆపదకు గురైతే అండగా నిలిచేందుకు వీలుగా దేశంలోనే ప్రప్రథమంగా "దళిత రక్షణ నిధి"ని ఏర్పాటు చేస్తోంది. ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఇచ్చే 10 లక్షల రూపాయలలో 10 వేల రూపాయలు లబ్ధిదారుని వాటా కింద జమ చేసుకొని దానికి మరో రూ.10 వేలు కలిపి ప్రభుత్వం దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేస్తుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా దళిత రక్షణనిధి నిధి నుంచి వారికి ఆర్థికమద్దతు ఇచ్చేలా ఏర్పాటు చేయనున్నారు. దళిత బంధు ద్వారా లబ్ధిదారులు పొందుతున్న ఫలితాలను పర్యవేక్షణ కోసం ప్రత్యేక చిప్ అమర్చిన గుర్తింపు కార్డుతో ఫలితాలను పర్యవేక్షిస్తారు. తెలంగాణ దళితబంధు ఒక పథకంగా మాత్రమే కాకుండా, ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలన్న దృఢసంకల్పంతో ముందడుగు వేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో భారీ బహిరంగసభ

తెలంగాణ ప్రభుత్వ కొత్త పథకం దళితబంధు ప్రారంభసభ హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి-ఇంద్రానగర్‌లో సోమవారం అట్టహాసంగా నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొనే ఈ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, కరీంనగర్‌, హనుమకొండ జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని దళిత కుటుంబాల్లో అర్హులైన వారికి రూ. 10 లక్షల చొప్పున జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని కోసం తొలి విడతగా రూ. 500 కోట్లు విడుదల చేసింది. సభలో 15 మంది లబ్ధిదారులకు సీఎం లాంఛనంగా చెక్కులు పంపిణీ చేస్తారు. నగదు లావాదేవీల కోసం పథకానికి సంబంధించిన డెబిట్‌కార్డులను కూడా అందిస్తారు. లబ్ధిదారులకు అనువైన పరిశ్రమలు, ఇతర యూనిట్ల వివరాలను కరపత్రాల రూపంలో పంచిపెట్టనున్నారు. ఈ పథకం ఉద్దేశం, లక్ష్యాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనలతో పలువురు కవులు పాటలు రాశారు. వీటిని సభలో విడుదల చేయనున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన ఇలా..

సీఎం కేసీఆర్‌ సోమవారం మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 2 గంటలకు సభాస్థలికి చేరతారు. సాయంత్రం 4 గంటల వరకు సభలో పాల్గొంటారు. తర్వాత హైదరాబాద్‌కు పయనమవుతారు.

అమలుపై కమిటీ ఏర్పాటు

రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు కోసం ఒక కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ సంక్షేమశాఖ అదనపు సంచాలకులు నవీన్‌ నికోలస్‌, బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు, ఆర్డీవోలు విక్టర్‌ (ఆందోల్‌), అమరేందర్‌ (వనపర్తి), కృష్ణవేణి (స్టేషన్‌ ఘన్‌పూర్‌), రమేష్‌ (తొర్రూర్‌), మేడ్చల్‌ డీఆర్‌డీఏ పీడీ పద్మజారాణి ఈ కమిటీలో ఉన్నారు.

ఇదీ చూడండి: KTR: దళిత బంధు దేశ 'దశ, దిశ'నే నిర్దేశించబోతోంది: కేటీఆర్

Last Updated :Aug 16, 2021, 6:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.