ఆటో కార్మికులకు కేసీఆర్ గుడ్ న్యూస్ - ఫిట్నెస్ ఛార్జీలు మాఫీ

ఆటో కార్మికులకు కేసీఆర్ గుడ్ న్యూస్ - ఫిట్నెస్ ఛార్జీలు మాఫీ
CM KCR Speech At Manakondur Public Meeting Today : తెలంగాణలో ఆటో కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని ఆటో కార్మికులకు ఫిట్నెస్ ఛార్జీలు, సర్టిఫికెట్ కోసం అయ్యే ఖర్చును రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మానకొండూర్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఈ మేరకు కేసీఆర్ ప్రకటన చేశారు.
CM KCR Speech At Manakondur Public Meeting Today : తెలంగాణలో శాసనసభ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న వేళ.. బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఓవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ మరోవైపు ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో పర్యటించిన కేసీఆర్.. అక్కడ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు.
Fitness Charges Waived Off for Auto Workers in Telangana : మానకొండూరు ప్రజా ఆశీర్వాద సభ వేదికగా కేసీఆర్ తెలంగాణలోని ఆటో కార్మికులకు శుభవార్త చెప్పారు. ఆటో కార్మికులకు ఫిట్నెస్ ఛార్జీలు, సర్టిఫికెట్‌కు అయ్యే ఖర్చును రద్దు చేస్తామని ప్రకటించారు. దేశంలో హోంగార్డులకు అత్యధిక జీతాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ పునరుద్ఘాటించారు. మరోవైపు ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ వారి చేతులో ఉన్న అసలైన ఆయుధం ఓటు అని వివరించారు. ఓటు వేసేటప్పుడు ప్రజలంతా అభ్యర్థులతో పాటు వారి పార్టీల చరిత్రను చూడాలని.. జాగ్రత్తగా నాయకులను ఎన్నుకోవాలని సూచించారు.
KCR Fires on Congress : బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే పుట్టిందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలిచావులు తప్ప ఇంకేమీ లేవని అన్నారు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి రూ.2కే కిలో బియ్యం ఇచ్చారన్న కేసీఆర్.. కాంగ్రెస్ పాలన బాగుంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టి ఉండేదని ప్రశ్నించారు. ఒకనాడు ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ అని విమర్శించారు. బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రలో కలిపి ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుండా.. బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) పార్టీని చీల్చే ప్రయత్నం చేసిందని కేసీఆర్ ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని కేసీఆర్ గుర్తు చేశారు. ఇవన్నీ మీ కళ్ల ముందున్నాయని చెప్పారు. రైతుబీమా, రైతుబంధు, 24గంటలు విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా.. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు వస్తే మూడు గంటలే కరెంట్ ఇస్తామంటున్నారని ఆరోపించారు. ధరణి తీసేసి భూమాత పెడతామంటున్నారని.. తిరిగి పట్వారీలను తెస్తామని అంటున్నారని విమర్శించారు. వచ్చే ఐదేళ్లలో భారీగా ఇళ్ల నిర్మాణాలు చేపడతామని.. రానున్న కాలంలో ఇండ్లు లేని పేదలు ఉండకూడదని కేసీఆర్ అన్నారు.
"బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే పుట్టింది. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందో ఆలోచించాలి. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలిచావులు తప్ప ఇంకేమీ లేదు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి రూ.2కే కిలో బియ్యం ఇచ్చారు. కాంగ్రెస్ పాలన బాగుంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టి ఉండేది. ఒకనాడు ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్. బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రలో కలిపి ఇబ్బంది పెట్టారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుండా.. బీఆర్ఎస్(టీఆర్ఎస్) పార్టీని చీల్చే ప్రయత్నం చేసింది." - కేసీఆర్, ముఖ్యమంత్రి
