ETV Bharat / state

'రూ.10 కోట్లు విలువ చేసే స్థలాన్ని సెటిల్​మెంట్​ పేరిట ఎమ్మెల్యే సుధాకర్​ కొట్టేశారు'

author img

By

Published : Dec 4, 2022, 11:59 AM IST

Allegations Against Kodumuru MLA Sudhakar : పిల్లుల కోట్లాట కోతికి లాభమైనట్లుగా ఓ వివాదస్పద స్థలం పరిష్కరిస్తానంటూ పంచాయితీ చేసిన వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధి, ఏకంగా ఆ స్థలాన్నే కొట్టేశాడని.. తమకు తెలియకుండానే విక్రయించి డబ్బులు జేబులో వేసుకున్నాడని బాధితుల ఆరోపిస్తున్నారు. తగవు తీర్చమని వేడుకుంటే అసలకే మోసం వచ్చిందని బాధితులు బావురమన్నారు. ఇదేమి అన్యాయమని ప్రశ్నిస్తే, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన బాధితులు వాపోతున్నారు.

Allegations Against Kodumuru MLA Sudhakar
Allegations Against Kodumuru MLA Sudhakar

Allegations Against Kodumuru MLA Sudhakar : ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలులో ఓ స్థలం వ్యవహారంలో కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయితీ చేస్తానంటూ తమకు తెలియకుండానే వేరేవారికి అమ్మి డబ్బులు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులను, న్యాయస్థానాన్ని ఇప్పటికే ఆశ్రయించామని, తమకు ప్రాణహాని ఉందని వాపోతున్నారు. జరిగిన మోసాన్ని ‘ఈనాడు-ఈటీవీ భారత్​’తో మొర పెట్టుకున్నారు.

కర్నూలుకు చెందిన బాధితులు వజహద్‌ అలీ, ఇమ్రాన్‌ తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు మండలం మామిదాలపాడు పరిధిలోని సర్వే నంబరు 203-సి1ఏ1లో 93 సెంట్ల స్థలం ఉంది. దీన్ని ఇర్షాద్‌, మరో నలుగురికి రూ.7.50 కోట్లకు అమ్మేందుకు 2020 సెప్టెంబరులో అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఆ సమయంలో కొంత మొత్తం ఇచ్చారు. రిజిస్ట్రేషన్‌కు ముందే ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో రద్దు చేసుకోవాలనుకున్నట్లు బాధితులు తెలిపారు.

ఎగ్రిమెంట్‌ చేసుకున్న ఇర్షాద్‌ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక్కడ సివిల్‌ కేసును క్రిమినల్‌ కేసుగా మార్చి, భూమి రిజిస్ట్రేషన్‌ చేయాల్సిందేనని తమపై పోలీసులు ఒత్తిడి తెచ్చారని వాపోయారు. దీంతో తాము కోడుమూరు ఎమ్మెల్యేను ఆశ్రయించామని, అక్కడే అసలు కథ మొదలైందని చెబుతున్నారు.

కమీషన్‌కు భరోసాగా అగ్రిమెంట్‌: ‘పంచాయితీ చేసినందుకు రూ.30 లక్షలు కమీషన్‌ ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. అందుకు భరోసాగా ఏదైనా స్థలం ఇవ్వాలన్నారు. దీంతో ఉలిందకొండలో ఉన్న 96 సెంట్ల స్థలాన్ని సేల్‌డీడ్‌ చేశాం. ఇర్షాద్‌ బృందం ముందుగా చెల్లించిన రూ.4.20 కోట్లకు మరో రూ.2.35 కోట్లు కలిపి మొత్తం రూ.6.55 కోట్లు తిరిగి ఇచ్చేలా ఎమ్మెల్యే సుధాకర్‌, 38 వార్డు కార్పొరేటర్‌ గిప్సన్‌తో కలిసి పంచాయితీ చేశారు.

లాక్‌డౌన్‌ సమయంలో డబ్బులు సమకూరకపోవడంతో ఎమ్మెల్యేను మూడు నెలలు గడువు కావాలని కోరారు. ఇర్షాద్‌ బృందానికి కట్టాల్సిన నగదును వడ్డీకి ఇప్పించి, ఏడాది సమయం ఇస్తానంటూ ఫుల్‌ రిజిస్ట్రేషన్‌ చేయించాలని ఎమ్మెల్యే తెలిపారు. 2021 జులై 15న ఆయన అనుచరులైన రఘునాథ్‌రెడ్డి, రవికుమార్‌ పేర్లపై సాయంత్రం 6.30కి హడావుడిగా రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఇర్షాద్‌ బృందానికి చెల్లించాల్సిన డబ్బు చెల్లించకుండా.. మొత్తం భూమిని ఇర్షాద్‌ బృందంలోని నలుగురి పేర్లతో 2021 జులై 30న రిజిస్ట్రేషన్‌ చేయించారు’ అని తెలిపారు. ఇందులో సుమారు రూ.3.50 కోట్లు ఎమ్మెల్యే జేబుల్లో వేసుకున్నారని ఆరోపించారు.

ఫిర్యాదు చేస్తే పేరు తప్పించారు: రూ.10 కోట్ల స్థలాన్ని సెటిల్‌మెంట్‌ పేరుతో అమ్మేసి, ఎమ్మెల్యే మోసం చేసినట్లు తొలుత గతంలో పనిచేసిన ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశామని వజహద్‌ అలీ, ఇమ్రాన్‌ తెలిపారు. హైకోర్టులో వేసిన పిటిషన్​లోనూ ఎమ్మెల్యే పేరు పెట్టామన్నారు. తాలూకా స్టేషన్‌లో 2022 జులై 30న ఫిర్యాదు చేయగా.. ఎమ్మెల్యే పేరు తీసేసి మిగిలిన వారిపై ఎఫ్‌ఐఆర్‌ చేశారన్నారు. అనంతరం కేసును పక్కన పెట్టేశారన్నారు. ఇదే సమయంలో స్థలంతో తనకు సంబంధం లేదని, రూ.4.20 కోట్లు అప్పుగా ఇచ్చానని, మొత్తం వడ్డీతో చెల్లించాలంటూ ఇర్షాద్‌.. న్యాయస్థానంలో తమపై పిటిషన్‌ వేశారన్నారు.

నేను సెటిల్‌మెంట్‌ చేయలేదు: నాపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు. నేను సెటిల్‌మెంట్‌ చేయలేదు. అగ్రిమెంట్‌ చేయడం, ఆపై రద్దు చేయడం.. ఇలా రెండుసార్లు చేసి మూడోసారి స్టేషన్‌లో కేసు పెట్టారు. ఆ సమయంలో ఇమ్రాన్‌ నా దగ్గరకు వచ్చారు. సమయం ఇస్తే సెటిల్‌మెంట్‌ చేసుకుంటామని కోరారు. నష్టపోతున్నామని బాధపడితే సాయం చేద్దామని అనుకుని, తర్వాత ఎవరెవరో మధ్యవర్తులు కలగజేసుకోవడంతో నేను పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇద్దరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. -సుధాకర్‌, కోడుమూరు ఎమ్మెల్యే

మాకు ప్రాణహాని ఉంది: కర్నూలులో ఉన్నత కుటుంబాల్లో మాది ఒకటి. ఎవరెవరో ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. మాకు ప్రాణహాని ఉంది. న్యాయం కోసం వెళ్తే ఎమ్మెల్యే మమ్మల్నే మోసం చేశారు. గత జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాం. హైకోర్టులో పిటిషన్‌ వేయడంతో పాటు, రిజిస్ట్రేషన్‌ రద్దుచేయాలని జిల్లా కోర్టులో కేసు వేశాం. -వజహద్‌ అలీ, ఇమ్రాన్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.