ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్... ఆర్టీసీకి కొవిడ్​తో కోలుకోలేని దెబ్బ

author img

By

Published : Aug 16, 2020, 10:17 PM IST

tsrtc plunged into further losses in telangana
మరింత నష్టాల్లోకి కూరుకుపోయిన ఆర్టీసీ

ఆర్టీసీ నష్టాల్లోకి కూరుకుపోతోంది. సమ్మె త‌ర్వాత‌ కోలుకుంటున్న త‌రుణంలో మూలిగేనక్కపై తాటిపండు పడ్డచందంగా ఒక్కసారిగా కొవిడ్‌ దెబ్బతీసింది. ఆర్థిక పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. వ‌చ్చే ఆదాయానికి... పెట్టే ఖ‌ర్చుకు వ్యత్యాసం భారీగా పెరిగి జీతాల కోసమే ప్రభుత్వం వైపు ఆశగా చూడాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది.

కరోనా ప్రభావంతో ఆర్టీసీ బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు ముందుకు రావడం లేదు. లాక్‌డౌన్‌ తర్వాత ఆక్యూపెన్షీ రేషియో 20 శాతం ఉండేది. ఆ త‌ర్వాత‌ 30 శాతానికి పెరిగి... ఇప్పుడు 35 శాతం వద్ద నిలిచిపోయింది. ఇప్పుడు రవాణా సంస్థ కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ భరోసా కల్పిస్తున్నా..ప్రయాణికులు మాత్రం ఆశించిన స్థాయిలో బస్సెక్కడం లేదు. ఫలితంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరింత నష్టాల్లోకి కూరుకుపోయింది.

కొవిడ్‌కి ముందు రాష్ట్ర వ్యాప్తంగా 9వేల 600 బ‌స్సుల‌ను నడిచేవి. వీటిలో 13 వంద‌ల అంత‌రాష్ట్ర సర్వీసులు, హైదరాబాద్‌లో 3వేల 700ల సిటీబ‌స్సుల‌ను డిపోలకే పరిమితయ్యాయి. జిల్లాల‌కు న‌డిపించే 3వేల బ‌స్సులు య‌థావిధిగా న‌డుస్తున్నాయి. ఆదాయం తెచ్చే అంత‌ర్‌రాష్ట్ర బ‌‌స్సు స‌ర్వీసులు డిపోల‌కే ప‌రిమిత‌మవడం నష్టాలకు కారణమవుతోంది.

నిధుల‌న్నీ ఖర్చయిపోయాయి

ప్రభుత్వం ఆర్నెళ్ల క్రితం పూచిక‌త్తుతో బ్యాంకు నుంచి ఆర్టీసీకి... 600 కోట్ల రుణం స‌మ‌కూర్చుకుంది. 600 కోట్లు సీసీఎస్‌కు కొంత‌, మిగిలింది పీఎఫ్​కు చెల్లించాల‌నుకున్నప్పటికీ.. క‌రోనా ప్రభావంతో నిధుల‌న్నీ ఖర్చయిపోయాయి. ప్రభుత్వం బ‌డ్జెట్​లో కేటాయించిన వెయ్యి కోట్లలో ప్రతి మూడు నెల‌ల‌కు 250 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఇందులోనూ 100 కోట్లు చెల్లించగా.. అవి గ‌త నెల జీతాల‌కే ఖ‌ర్చపోయాయి.

డీజిల్​కు 2 ల‌క్షలు

క‌రోనాకి ముందు రోజూ ఆర్టీసీకి 12 కోట్ల ఆదాయం వ‌చ్చేది. ఇప్పుడది 2 కోట్లకు ప‌డిపోయిన‌ట్లు అంచ‌నా. ఇందులో ప్రస్తుతం నడుస్తున్న 40 శాతం బ‌స్సుల‌ డీజిల్‌ కోసమే 2 ల‌క్షల వరకు ఖర్చవుతోంది. అంటే వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం డీజీల్​కు, నిర్వహణకే స‌రిపోతుంది. ఇక ఉద్యోగుల జీతాల‌కే ప్రతినెలా 125 నుంచి 130 కోట్ల వ‌ర‌కు అవ‌స‌ర‌మ‌వుతాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంలో బడ్జెట్‌లో కేటాయించిన నిధులకోసం ఆర్టీసీ ఎదురుచూడాల్సిన పరిస్థితి.

కార్గో బ‌స్సుల ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. ప్రభుత్వ సంస్థలకే కార్గో పరిమితం కావడం ఆదాయం ఆశించిన స్థాయిలో లేదు. కొరియ‌ర్, పార్శిల్ స‌ర్వీసులతో రోజూ సుమారు 6ల‌క్షల వ‌ర‌కు వ‌స్తుంద‌ని అధికారులు భావిస్తున్నారు. న‌ష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకోవాల‌ని ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి : ఎడతెరిపిలేని వర్షాలు... మేడారాన్ని చుట్టేసిన వరద నీరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.