ETV Bharat / state

TRS Protest in Delhi: తెరాస ధాన్యం దంగల్‌.. కాసేపట్లో సభాస్థలికి సీఎం కేసీఆర్

author img

By

Published : Apr 11, 2022, 3:19 AM IST

Updated : Apr 11, 2022, 10:20 AM IST

TRS Protest in Delhi: తెలంగాణలో పండిన ప్రతిధాన్యపు గింజను కేంద్రమే కొనుగోలు చేయాలని దిల్లీలో తెరాస సమరశంఖం పూరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వివిధ మార్గాల్లో ఉద్యమిస్తున్న గులాబీపార్టీ... దేశ రాజధానిలో దీక్షకు సిద్ధమైంది. తెలంగాణ ఉద్యమం తర్వాత దిల్లీలో తొలిసారి పోరాటం చేయనుంది. తెలంగాణభవన్‌లో జరిగే ఈ దీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్​తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

TRS Protest in Delhi: తెరాస ధాన్యం దంగల్‌.. నేడు దిల్లీలో కేసీఆర్​ దీక్ష
TRS Protest in Delhi: తెరాస ధాన్యం దంగల్‌.. నేడు దిల్లీలో కేసీఆర్​ దీక్ష

TRS Protest in Delhi: దిల్లీలో తెరాస ధాన్యం దంగల్‌కు సిద్ధమైంది. తెలంగాణలో పండిన ప్రతివడ్ల గింజనూ కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో పోరు దీక్ష చేయనుంది. ఇప్పటికే రాష్ట్రంలో వివిధమార్గాల్లో ఉద్యమిస్తున్న గులాబీ పార్టీ.. మరింత ఒత్తిడి పెంచేందుకు హస్తినలో దీక్ష చేయనుంది. తెలంగాణ ఉద్యమం తర్వాత తెరాస దిల్లీలో తొలిసారి సమరశంఖం పూరించనుంది. తెలంగాణ భవన్‌లో రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష పేరుతో దీక్షను చేపట్టనున్నారు. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్​తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్‌, రైతుబంధు సమితి, మండల పరిషత్‌, పురపాలక సంఘాల అధ్యక్షులు, అన్ని కార్పొరేషన్ల ఛైర్మన్లు, తెరాస రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులు భాగస్వామ్యులు కానున్నారు. దాదాపు 1,500 మంది ప్రజాప్రతినిధులు, నాయకులు ఆదివారం రాత్రే దిల్లీకి చేరుకున్నారు.

మద్దతు ప్రకటించిన టికాయిత్​: తొలుత రోజంతా దీక్ష కొనసాగించాలని భావించారు. ఐతే 72 ఏళ్లలో ఏప్రిల్‌ తొలి పదిహేను రోజుల్లో ఎన్నడూ లేనంత వేడి దిల్లీలో శనివారం నమోదైందని భారతీయ వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో పాటు వడగాలుల తీవ్రత ఉంటుందని హెచ్చరించడంతో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగించేలా మార్పులు చేశారు. దీక్ష ఏర్పాట్లపై దిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్​ తన నివాసంలో ఆదివారం రాత్రి మంత్రులు, ముఖ్యనేతలతో సమీక్షించారు. సమస్య తీవ్రతను దేశం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్న తెరాస నేతలు దీక్షకు భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయిత్‌ సహా పలువురు రైతు నేతలను ఆహ్వానించారు. టికాయిత్‌ ఇప్పటికే మద్దతు ప్రకటించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్రం తాము చెప్పినదే చెల్లుబాటు కావాలన్న రీతిలో ముందుకు వెళ్లడం మంచిది కాదని.. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హితవుపలికారు.

చిన్నచూపు చూస్తే కేంద్రానికే నష్టం.. "దేశంలో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడాన్ని కేంద్ర ప్రభుత్వం తక్కువ చేసి చూడడం మంచిది కాదు. రైతుసమాజ అభీష్టాన్ని పరిగణనలోకి తీసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవడం సముచితంగా ఉంటుంది. కేంద్రం తాము చెప్పిందే చెల్లుబాటు కావాలన్న రీతిలో ముందుకు వెళ్లడం మంచిది కాదు. రైతన్నలకు ఇంకా క్షోభ కలిగించడం సరికాదు. ఆరుగాలం కష్టపడి పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం దారుణం. ఇదే భాజపా ప్రభుత్వంలో వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు రంగుమారిన ధాన్యం కూడా మద్దతు ధరతో కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. కోటాను కోట్ల వ్యవసాయ కుటుంబాలను పట్టించుకోకపోవడం మంచిది కాదు. రాష్ట్రంలో యాసంగిలో పండిన మొత్తం పంటను ఏలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి." -నిరంజన్‌ రెడ్డి, మంత్రి

వేదికపై వీరే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలుత భవన్‌ ఆవరణలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం వేదికపైకి చేరుకుంటారు. వేదికపై ముఖ్యమంత్రితో పాటు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, వ్యవసాయ, పౌరసరఫరాల మంత్రులు నిరంజన్‌రెడ్డి, కమలాకర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు కిసాన్‌నేత రాకేశ్‌ టికాయిత్‌ తదితరులు కొద్దిమందే ఉంటారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఆది నుంచి తెలంగాణకు చేస్తున్న సహాయ నిరాకరణ, వడ్ల కొనుగోలు వ్యవహారంలో కేంద్రం రాజకీయాలు చేస్తోందంటూ సీఎం విమర్శలు గుప్పించనున్నారు.

హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఫ్లెక్సీలు: ధాన్యం దీక్షను ప్రతిబింబించేలా వేదిక ఎదుట వడ్ల కుప్పను పోయనున్నారు. దీనికి ఇరువైపులా సాగు కష్టాలను తెలిపేలా నాగళ్లతో రైతులు నిల్చోనున్నారు. తెలంగాణ భవన్‌ పరిసరాలను తెరాస జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో గులాబీమయం చేశారు. దిల్లీ వాసులకు అర్థమయ్యేలా హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: హస్తినలో "రైతుదీక్ష"కు సర్వం సిద్ధం.. తరలిన గులాబీ నాయకదళం..

Last Updated : Apr 11, 2022, 10:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.