ETV Bharat / state

Tax Department: పదోన్నతులు కల్పించారు.. పోస్టింగ్‌లు ఇవ్వడం మరిచారు

author img

By

Published : Feb 19, 2023, 1:33 PM IST

Telangana Commercial Taxes Department
తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ

Employees Transfers in Tax Department: రాష్ట్రంలో అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే 'వాణిజ్య పన్నుల శాఖ' ప్రక్షాళన ప్రక్రియ ముందుకు సాగటం లేదు. అధికారులకు పదోన్నతులు కల్పించి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికీ పోస్టింగ్‌లు ఇవ్వలేదు. వాణిజ్య పన్నుల శాఖ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా 2 కొత్త డివిజన్లు, 18 సర్కిళ్లు ఏర్పాటు చేసినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఏసీటీవో స్థాయి నుంచి ఉప కమిషనర్ల వరకు ఏళ్లకు తరబడి బదిలీలు లేకుండా ఒకేచోట పని చేస్తుండడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదని చర్చ సాగుతోంది.

Employees Transfers in Tax Department: రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ ప్రక్షాళన రెండేళ్ల క్రితం మొదలైనా.. ఇప్పటికీ పూర్తి కాలేదు. పన్నుల రూపంలో 70 శాతానికిపైగా ఈ శాఖ నుంచే వస్తోంది. సర్కార్‌ తీసుకున్న అనేక సంస్కరణలతో పన్నుల రాబడులు భారీగా పెరిగాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి వాణిజ్య పన్నుల శాఖ సర్కిళ్లు అస్తవ్యస్తంగా ఉండేవి. రాష్ట్రవ్యాప్తంగా 12 డివిజన్లు, 91 సర్కిళ్లు ఉన్నఈ శాఖలో కొన్ని సర్కిళ్ల పరిధిలో కేవలం 350 మంది డీలర్లే ఉండగా.. మరికొన్నింటి పరిధిలో 12 వేలకు పైగా డీలర్లు ఉండేవారు. ఈ కారణంగా కొందరు అధికారులకు పని ఒత్తిడి, మరికొందరికి పని లేకుండా ఉండేది.

ఆచరణకు నోచుకోలేదు: డీలర్లపై పర్యవేక్షణ కొరవడి, అక్రమార్కులను గుర్తించి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉండేది. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. శాఖాపరమైన చర్యలు తీసుకుని 91 సర్కిళ్లను 100కి పెంచి సర్కిళ్ల వారీగా డీలర్ల సంఖ్యను సర్దుబాటు చేసింది. దీంతో అధికారులపై పని ఒత్తిడి కొంతవరకు తగ్గినా డీలర్లపై ఆశించిన పర్యవేక్షణ లేకపోయింది. ఈ పరిస్థితుల్లో 2020లో పూర్తి స్థాయి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సర్కార్..​ వాణిజ్య సర్కిళ్లను 100 నుంచి 118కి, డివిజన్లను 12 నుంచి 14కు పెంచడంతో పాటు 161 పోస్టులు కొత్తగా మంజూరు చేసింది. ప్రతి సర్కిల్‌కు 2 వేల డీలర్లకు తక్కువ లేకుండా ఉండేటట్లు పునర్‌ వ్యవస్థీకరించింది. కాగా రెండేళ్లు గడిచినా ఇప్పటికీ ఆచరణకు మాత్రం నోచుకోలేదు.

సాంకేతిక పరమైన చర్యలు: వాణిజ్య పన్నుల శాఖను మరింత బలోపేతం చేసేందుకు వీలుగా కొత్తగా 148 మంది ఏసీవోలతో ఖాళీలను భర్తీ చేయడం, సర్కిళ్ల వారీగా అస్తవ్యస్థంగా ఉన్న ఉద్యోగులను అవసరాలకు తగ్గట్లు సర్దుబాటు చేసి డీలర్లపై పర్యవేక్షణ పెంచింది. అలాగే పన్ను ఎగువేతదారుల పని పట్టేందుకు సాంకేతికపరంగా చర్యలు తీసుకుంది. హైదరాబాద్‌ ఐఐటీ సంస్థ సహకారంతో కొత్త కొత్త ఫార్మాట్లు రూపకల్పన చేసి రాబడులను పెంచుకునే దిశలో ముందుకెళ్తోంది.

2014తో పోలిస్తే పెరిగిన ఆదాయం: డీలర్ల కార్యకలాపాలపైనా ప్రత్యేక దృష్టి సారించేందుకు సరికొత్త సాంకేతికతను ఉపయోగించుకుంటోంది. రాష్ట్రం ఏర్పడినప్పటి ఆర్థిక ఏడాది రూ.27,700 కోట్లుగా ఉన్న వాణిజ్య పన్నుల శాఖ రాబడులు.. 2021-22 ఆర్థిక ఏడాదిలో రూ.65,021 కోట్లు సమకూరాయి. ఈ ఆర్థిక ఏడాదిలో రూ.75,390 కోట్లు లక్ష్యం కాగా.. ఈ జనవరి వరకు రూ.58,966 కోట్ల ఆదాయం వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఏడేళ్లయినా బదిలీలు లేవు: ప్రక్షాళనలో భాగంగా 2021 మార్చిలో సహాయ వాణిజ్య పన్నుల అధికారి స్థాయి నుంచి అదనపు కమిషనర్ స్థాయి వరకు 185 మంది అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. రెండేళ్లు కావచ్చినా పదోన్నతి పొందిన అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వలేదు. కొత్త సర్కిళ్లు, కొత్త డివిజన్లు కార్యరూపం దాల్చలేదు. మాజీ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ గతంలో కమిషనర్‌గా పని చేసి రాబడులను పెంచిన అనుభవం కారణంగా ఆయన ఆదాయాన్ని పెంచే దిశలో ముందుకెళ్లారు. రాబడులతో ముడిపడి ఉన్న శాఖల్లో మూడేళ్లకొకసారి బదిలీలు జరగటం ఆనవాయితీ. కానీ ఇక్కడ ఏడేళ్లుగా బదిలీలు లేకుండా ఒకే చోట పని చేస్తున్నారు.

ఆశించిన ఫలితాలు రావట్లేదు: కొత్త తరహా ఆలోచనలతో ముందుకు వెళుతున్నప్పటికీ కొన్ని సర్కిళ్లు, డివిజన్ల పరిధిలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదన్న చర్చ సాగుతోంది. అలాగే పదోన్నతి పొందిన అధికారులు కింది స్థానంలోనే విధులు నిర్వర్తించడంతో తీవ్ర నిరాశక్తితో పని చేస్తున్నారు. తక్షణమే కొత్త సర్కిళ్లు, డివిజన్ల ఏర్పాటుతో పాటు పదోన్నతి పొందిన అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వడం ద్వారా పని విభజన జరిగి ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగుల బదిలీలు ఆలస్యం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.