తెలంగాణలో హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం - తమ అభ్యర్థికే ఓటు వేయాలంటున్న స్టార్ క్యాంపెయినర్లు

తెలంగాణలో హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం - తమ అభ్యర్థికే ఓటు వేయాలంటున్న స్టార్ క్యాంపెయినర్లు
Telangana Political Parties Speed Up Election Campaign : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. పోటాపోటీ ప్రచారాలు, విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం రసవత్తరంగా మారింది. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీకి.. ఒక్క అవకాశమివ్వాలంటూ కాంగ్రెస్ నేతలు గడప గడపకూ తిరుగుతున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌కు మద్దతిస్తే ప్రగతిని పరుగులు పెట్టిస్తామంటూ కమలనాథులు ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
Telangana Political Parties Speed Up Election Campaign : పదేళ్ల ప్రగతి పాలనను వివరిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతున్నారు. సంక్షేమ పథకాలు, ఉచిత విద్యుత్తు వంటి అంశాలను బలంగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్నగర్ అభ్యర్థి ప్రకాశ్ గౌడ్ నార్సింగి, మణికొండ, గండిపేట పరిధిలో రోడ్‌షో నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మోపాల్ మండలంలో బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఇంటింటికి తిరిగి గులాబీ జెండాకు మద్దతివ్వాలని కోరారు.
BRS Candidates Election Campaign : నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలో ప్రచారం నిర్వహించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపక్షాలను నమ్మితే ఆగమౌతామని ఓటర్లను హెచ్చరించారు. కోరుట్ల నియోజకవర్గంలో కల్వకుంట్ల సంజయ్ ఊరూరా తిరుగుతూ బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో గాదరి కిషోర్ రోడ్‌షో నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆయన భార్య కమల మహిళలకు బొట్టుపెట్టి ఓట్లు అభ్యర్థించారు.
Congress Election Campaign : ఆరు గ్యారంటీలు సహా ప్రజాకర్షక హామీలతో మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్.. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అగ్రనేతల పర్యటనలతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతూ ప్రచార జోరు పెంచింది. బీఆర్ఎస్ సర్కార్‌పై ఉన్న వ్యతిరేకత తమకు కలిసివస్తుందనే నమ్మకంతో హస్తం పార్టీ నేతలు గడప గడపకూ తిరుగుతున్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం, వనస్థలిపురంలోని ఓ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన అడ్వొకేట్స్ ఫ్రెండ్లీ మీట్‌లో మధుయాష్కీ పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్‌లోని రహమత్‌నగర్ డివిజన్లో మహమ్మద్ అజారుద్దీన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆర్మూర్ నియోజకవర్గ అభ్యర్థి వినయ్‌రెడ్డికి మద్దతుగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహన్ ర్యాలీ, కార్నర్ మీటింగ్‌కు హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పొన్నం ప్రభాకర్, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ప్రచారం నిర్వహించారు. వారసంతలోని దుకాణాలు, కూరగాయల వ్యాపారులతోను కలిసి ఓట్లడిగారు. బజ్జీల బండి వద్ద బజ్జీలు కాలుస్తూ, టీ కొట్టులో ఛాయ్ తయారు చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు.
ములుగు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో ఎమ్మెల్యే సీతక్క పాదయాత్ర ద్వారా ఓట్లు అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా మహిళలు నృత్యాలు ఆకట్టుకున్నాయి. నకిరేకల్ అభ్యర్థి వేముల వీరేశం, తుంగతుర్తి అభ్యర్థి మందుల సామేలుకు మద్దతుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూర్యాపేటలో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జైవీర్ రెడ్డికి మద్దతుగా కేసీఆర్ సోదరుని కుమార్తె రమ్యారావు ప్రచారంలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో ఆదినారాయణ రావు పాదయాత్ర నిర్వహించారు. ఇల్లెందు పరిధిలోని కామేపల్లి మండలంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
BJP Candidates Election Campaign : బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ అస్త్రాలతో బీజేపీ ఎన్నికల బరిలోకి వెళ్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు దీటుగా ఇంధ్రధనస్సు పేరుతో మేనిఫెస్టోను సైతం ఇవాళ హోంమంత్రి అమిత్ షా ప్రకటించనున్నారు. మల్కాజిగిరి అభ్యర్థి రాంచందర్‌రావు యాప్రాల్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారానికి సినీ నటి కుష్బూ హాజరయ్యారు. మేడ్చల్ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డికి మద్దతుగా ప్రచారానికి వచ్చిన ఈటల రాజేందర్‌ను అభిమానులు భారీ గజమాలతో సత్కరించారు. పేదలకు మూడెకరాల భూమి ఇస్తానన్న వారి నుంచి దోచుకొని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఈటల విమర్శించారు.
సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ రామచందర్ ఏర్పాటు బీజేపీ ఆత్మీయ సమ్మేళనానికి ఝార్ఖండ్ మాజీ సీఎం బాబులాల్ మరాండి హాజరై కమలం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గం ధర్పల్లి మండలంలో దినేశ్ కులాచారికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఎంపీ అర్వింద్‌కు మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు.
