ETV Bharat / state

ఎస్సై, ఏఎస్సై తుది పరీక్ష తేదీలు ఇవే.. ఆ కండిషన్స్ అప్లై..

author img

By

Published : Apr 2, 2023, 9:50 AM IST

SI ASI Final Exam Dates
SI ASI Final Exam Dates

Telangana SI ASI Final Exam Dates: ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించి.. దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేసుకున్న ఎస్సై, ఏఎస్సై అభ్యర్థులకు పోలీసు నియామక మండలి తుది పరీక్షల తేదీలను ప్రకిటించింది. ఈ నెల 8, 9 తేదీల్లో వీటికి సంబంధించిన పరీక్షలు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు హాల్​ టికెట్ల డౌన్​ లోడ్​ విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరీక్ష కేంద్రాల వివరాలను ఛైర్మన్​ వి.వి.శ్రీనివాస్​ వివరించారు.

Telangana SI ASI Final Exam Dates: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్సై, ఏఎస్సై.. తత్సమాన ఉద్యోగాల తుది పరీక్ష ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించడానికి పోలీసు నియామక మండలి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు శనివారం వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు రెండు రోజుల్లో నాలుగు పరీక్షలు రాయాల్సి ఉంటుంది.

ఐటీ, పీటీవో, ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరోలో ఏఎస్సై అభ్యర్థులు రెండు పరీక్షలు రాయాలి. తుది పరీక్ష రాసే అభ్యర్థులంతా ఈ నెల 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 6వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకూ హాల్‌టికెట్లు డౌన్​లోడ్​ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి www.tslprb.in వెబ్‌సైట్‌ ద్వారా హాల్​టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని నియామక మండలి ఛైర్మన్​ వి.వి శ్రీనివాస్​ తెలిపారు. హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ కాని వారు support@tslprb.inకు మెయిల్‌ చేయాలని సూచించారు. లేదంటే 9393711110, 9391005006 నంబర్లకు ఫోన్​ చేయాలని తెలిపారు.

Telangana Si Exam: హాల్​ టికెట్​ తీసుకున్న వారు అందులో తెలిపిన విధంగా నిర్ణీత ప్రాంతంలో పాస్​పోర్ట్​ ఫొటో అంటించాలని పేర్కొన్నారు. ఫొటో గుర్తింపులేని వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమన్నారు. ఇంగ్లీష్‌, తెలుగు, ఉర్దూ భాషా పరీక్షలను తుది ఎంపికకు పరిగణించకున్నా.. వీటిలో కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ పట్టణాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

పోటీ విపరీతం: ఈసారి కానిస్టేబుళ్ల పోస్టులకు పోటీ తక్కువగా ఉండగా.. ఎస్సై పోస్టులకు మాత్రం విపరీతమైన పోటీ నెలకొంది. మొత్తం 587 పోస్టులకు గానూ తొలుత 2 లక్షల 47వేల 630 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దేహదారుఢ్య ఫలితాల అనంతరం వీరిలో 59వేల 574 మంది మాత్రమే విగిలారు. అంటే ఒక్కో కొలువుకు 101 మంది వరకు పోటీలో ఉన్నారు. మొత్తం పోస్టుల్లో సివిల్‌ విభాగంలోనే 554 పోస్టులు ఉన్నాయి.

వీటి కోసం 52 వేల 786 మంది ప్రస్తుతం పోటీలో ఉండటంతో ఈ విభాగంలో ఒక్కో పోస్టుకు 95 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఐటీ అండ్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో ఒక్కో పోస్టుకు 179 మంది చొప్పున.. పోలీస్‌ రవాణా విభాగంలో 311 మంది అభ్యర్థులు, ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో ఏఎస్సై పోస్టులకు 240 మంది చొప్పున పోటీలో ఉన్నారు. తుది రాత పరీక్ష అనంతరం సామాజిక వర్గాల వారీగా కటాఫ్‌ మార్కుల ఆధారంగా పోస్టుల కేటాయింపు ఉంటుంది.

ఇవీ చదవండి:

TSPSC పేపర్ లీకేజీ.. ప్రవీణ్​ను సెలవుపై ఎందుకు పంపలేదు..?

'పేపర్ లీక్ కేసు.. సిట్ వద్దు.. సిట్టింగ్ జడ్జి విచారణ కావాలి'

'దసరా మూవీలో ఆ సన్నివేశాలను డిలీట్​ చేయాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.