ETV Bharat / state

నివేదికలు చూడకుండానే మాపై నిందలా? జాతీయ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌కు రాష్ట్రప్రభుత్వం లేఖ

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2023, 11:05 PM IST

Updated : Nov 5, 2023, 11:48 AM IST

Telangana Govt letter to National Dam Safety Authority : మేడిగడ్డ ఆనకట్ట కుంగిన వ్యవహారంలో జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన వ్యాఖ్యలు నిరాధారమని.. రాష్ట్ర సర్కార్ తోసిపుచ్చింది. సమగ్ర విచారణ పరిశోధన లేకుండానే వైఫల్యానికి కారణాలను నిర్ధారించడం ఆశ్చర్యానికి గురి చేసిందని వ్యాఖ్యానించింది. ఆప్రాన్ డిజైన్‌కు మార్పులను ఇప్పటికే గుర్తించినట్లు తెలిపిన ప్రభుత్వం.. మూడేళ్లుగా నిరంతర వర్షాలతో అది సాధ్యం కాలేదని పేర్కొంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నాకే కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు లభించాయని, ప్రాజెక్టుతో తెలంగాణకు ఎంతో లాభం చేకూరిందని వివరించింది. మేడిగడ్డ ఆనకట్ట సమర్థంగా, త్వరగా పునరుద్ధరణ అయ్యేలా సహకరించాలని జాతీయ అథారిటీని కోరింది.

Telangana Govt letter to National Dam Safety Authority Chairman
Telangana Govt letter to National Dam Safety Authority Chairman

Telangana Govt Letter to National Dam Safety Authority : మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక, అందులో లేవనెత్తిన అంశాలపై.. రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఈఎన్సీలు, ఇంజినీర్లతో సమావేశమైన నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్.. జాతీయ అథారిటీ ప్రస్తావించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. నివేదికలోని అంశాలను పేరాల వారీగా పూర్తి వివరాలతో సమాధానం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు.

అందుకనుగుణంగా జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ సంజయ్ కుమార్ సిబల్‌కు (Sanjay Kumar Sibal).. రజత్‌కుమార్ (Rajat Kumar) లేఖ రాశారు. నివేదికలో చాలా వరకు నిరాధారమైన, వాస్తవాలను పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా చేసిన వ్యాఖ్యలు ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. అథారిటీ కోరిన 20 డాక్యుమెంట్లలో 11 మాత్రమే పంపినట్లు చెబుతున్నారని.. వాటన్నింటినీ ప్రాజెక్టు తనిఖీ, అనంతరం సమావేశాల్లో కమిటీకి చూపించినట్లు తెలిపారు.

Medigadda Barrage Issue Update : 'మేడిగడ్డ జలాశయాన్ని ఖాళీ చేస్తున్న అధికారులు.. ప్రాజెక్ట్ వద్దకు విపక్షాలకు నో ఎంట్రీ'

Medigadda Barrage Issue Updates : అక్టోబర్ 29 వరకు 20 పత్రాలు అందించాలని.. 27న లేఖ వచ్చిందని రజత్‌కుమార్ పేర్కొన్నారు. చాలా పెద్ద సమాచారాన్ని అందించేందుకు తగిన సమయం ఇవ్వకున్నా.. గడువులోగా 17 పత్రాలను మెయిల్ ద్వారా పంపినట్లు వివరించారు. మిగిలిన మూడు పత్రాలను నవంబర్ ఒకటో తేదీన పంపామని తెలిపారు. రాష్ట్ర అథారిటీ సమర్పించిన వివరాలను పరిశీలించకుండానే.. హడావిడిగా కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram Project)అభియోగపత్రాన్ని పంపారని రజత్‌కుమార్‌ వ్యాఖ్యానించారు.

ఎలాంటి పరిశోధన లేకుండానే ఆనకట్ట వైఫల్యానికి కారణాలను.. కమిటీ నిర్ధారించడం ఆశ్చర్యాన్ని కలిగించిందని రజత్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం నీటిలో ఉన్న పునాది, ఇతర సంబంధిత నిర్మాణాలను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే.. సరైన కారణాలను నిర్ణయించవచ్చని పేర్కొన్నారు. ప్రభావిత భాగం వైపు నీరు రాకుండా మళ్లించేందుకు.. ప్రస్తుతం కాఫర్ డ్యామ్​ నిర్మాణంలో ఉందని రజత్‌కుమార్ వెల్లడించారు.

Medigadda Barrage in Bhupalpally : "మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవు.. కానీ?"

ఆ తర్వాత సమగ్రంగా పరిశీలించాకే పీర్స్ కుంగడానికి సరైన కారణాలను అంచనా వేయగలుగుతామని రజత్‌కుమార్‌ అన్నారు. అవేవీ లేకుండా ప్రస్తుతం కమిటీ అభిప్రాయాలను అంగీకరించబోమని స్పష్టం చేశారు. అప్‌స్ట్రీమ్ సెకాంట్ పైల్స్ వైఫల్యం, వివిధ కారణాల వల్ల ర్యాఫ్ట్ స్థిరీకరణ వైఫల్యం చెందినట్లు నివేదికలో పేర్కొన్నారని అన్నారు. అయితే అప్‌స్ట్రీమ్‌, డౌన్‌స్ట్రీమ్‌ సెకాంట్‌ పైల్స్‌కు మెయిన్‌ ర్యాఫ్ట్‌తో ఫ్లెక్సీబుల్‌ జాయింట్‌ కోసం ప్రోటోటైప్‌ను కేంద్ర జలసంఘం అభివృద్ధి చేసిందని.. ఉత్తరాఖండ్‌లోని తపోవన్ ప్రాజెక్ట్‌లో దాన్ని ఉపయోగించినట్లు వివరించారు.

NDSA Report on Medigadda : దీనివల్ల బ్యారేజీ లోడ్‌ నేరుగా పైల్స్‌పై పడకుండా చూస్తుందని రజత్‌కుమార్ అన్నారు. సెకాంట్ పైల్స్ డ్రైవింగ్ సమయంలో ఎటువంటి నష్టం జరగలేదని, దీంతో గైడ్ వాల్‌లో ఎటువంటి కదలికలు గమనించలేదని చెప్పారు. ఫీల్డ్ ల్యాబ్‌ల్లో సిమెంట్, ముతక కంకర, ఫైన్ కంకర, స్టీల్ కోసం ఐఎస్ కోడ్‌ల ప్రకారం సెకాంట్ పైలింగ్‌లో ఉపయోగించిన పదార్థాలు క్రమం తప్పకుండా పరీక్షించినట్లు.. నిర్దేశిత గడువులు, ప్రమాణాలను పాటించినట్లు రజత్‌కుమార్‌ తెలిపారు.

కఠినమైన నాణ్యత నియంత్రణ తనిఖీలు కూడా నిర్వహించినట్లు రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా లేదన్న వ్యాఖ్యలు నిరాధారమైనవని భావిస్తున్నట్లు తెలిపారు. నిర్దేశిత మార్గదర్శకాలకు లోబడి ఆర్‌సీసీ ర్యాఫ్ట్‌ను, పీడనాన్ని పరిగణలోకి తీసుకొని.. స్టిల్లింగ్ బేసిన్ ఫ్లోర్‌ను, ఆర్‌సీసీ ర్యాఫ్ట్‌ను డిజైన్ చేసినట్లు పేర్కొన్నారు. ఆప్రాన్‌ డిజైన్‌ను సవరించాల్సిన అవసరాన్ని ఇప్పటికే గుర్తించామని, ఇందుకోసం ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి అధ్యయనాలు కూడా చేసినట్లు రజత్‌కుమార్ వెల్లడించారు.

అందుకు సంబంధించిన సిఫార్సులను కూడా లేఖతో జతచేస్తున్నట్లు రజత్‌కుమార్ వివరించారు. వాటిపై ఏవైనా నిర్దిష్ట వ్యాఖ్యలు ఉంటే స్వీకరిస్తామని అన్నారు. గత మూడేళ్లుగా బేసిన్‌లో నిరంతర వర్షాలు, బ్యారేజీలో నీరు ప్రవహిస్తున్నందున సంబంధించిన పనులు చేయడానికి అవకాశం లభించలేదని వివరించారు. డ్యాం భద్రతా చట్టం 2021 డిసెంబర్ 13 నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ.. నిర్మాణాల ఎత్తు, ఇతర వివరాలకు సంబంధించిన స్పష్టత ఇవ్వలేదని, రాష్ట్ర అథారిటీ అనేక సవరణలు కోరినట్లు రజత్‌కుమార్‌ గుర్తు చేశారు.

Medigadda Barrage Issue : మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు.. రాష్ట్రానికి కేంద్రం అల్టిమేటం

2023 ఏప్రిల్ ఒకటో తేదీన జాతీయ అథారిటీ స్పష్టత ఇచ్చిందని రజత్‌కుమార్ తెలిపారు. దీంతో జూలై 12న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను జాబితాలో చేర్చినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో మేడిగడ్డ బ్యారేజీకి రుతుపవనాల ముందస్తు తనిఖీని నిర్వహించడం సాధ్యం కాలేదని.. చట్టం కింద అవసరమైన ఇతర తనిఖీ నివేదికలు ఇప్పటికే సమర్పించినట్లు వివరించారు. వర్షాకాల అనంతర తనిఖీ నవంబర్‌లో నిర్వహించనున్నట్లు రజత్‌కుమార్ చెప్పారు.

డ్యాం సేఫ్టీ 2021 చట్టంలోని అన్ని నిబంధనలను తాము పాటిస్తున్నట్లు రజత్‌కుమార్ పేర్కొన్నారు. బ్యారేజీ పునరుద్ధరణకు చర్యలు ఇప్పటికే ప్రారంభించామని, మరమ్మతులు పూర్తయ్యాకే తిరిగి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిపుణుల కమిటీ సందర్శించకుండా చేసిన వ్యాఖ్యలు నిరాధారమని తోసిపుచ్చారు. రెండింటికి సంబంధించి కూడా డ్యాం సేఫ్టీ చట్టంలోని నిబంధనలను రాష్ట్ర అథారిటీ పూర్తిగా పాటిస్తుందని రజత్‌కుమార్‌ హామీ ఇచ్చారు.

దేశంలోనే ప్రముఖ సంస్థగా పరిగణిస్తున్న తెలంగాణ సీడీఓ.. కాళేశ్వరం సహా అన్ని ప్రాజెక్టులకు అన్ని మార్గదర్శకాలను పూర్తిగా పాటించిందని రజత్‌కుమార్ వెల్లడించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖకు మంచి పేరు ఉందని తెలిపారు. నిజాంసాగర్, నాగార్జునసాగర్, శ్రీశైలం, పోచంపాడ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ప్రాజెక్టులు దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. హైడ్రాలజీ, కాస్టింగ్, ఇరిగేషన్ ప్లానింగ్, పర్యావరణ అనుమతులు తదితర అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే.. 2018 జూన్ ఆరో తేదీన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన సాంకేతిక సలహా కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిందని రజత్‌కుమార్‌ గుర్తు చేశారు.

కేంద్ర జలసంఘానికి చెందిన కాస్టింగ్ డైరెక్టరేట్.. బ్యారేజ్ డిజైన్‌ను పనితీరు, వ్యయానికి సంబంధించి విస్తృతంగా అధ్యయనం చేసిందని రజత్‌కుమార్ అన్నారు. అప్పటి కేంద్ర జలసంఘం చైర్మన్ మసూద్ హుస్సేన్, చీఫ్ ఇంజనీర్లతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి.. వేగంగా పూర్తి చేసినందుకు ప్రభుత్వాన్ని ప్రశంసించి ప్రాజెక్ట్‌ను ఇంజినీరింగ్ అద్భుతంగా అభివర్ణించినట్లు రజత్‌కుమార్‌ పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, జీవావరణంపై అద్భుత సానుకూల ప్రభావం పడిందని రజత్‌కుమార్ వివరించారు. తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తి 300 శాతం పెరిగిందని తెలిపారు. నీటిపారుదల కొరకు ఉపరితల నీటి సరఫరా, భూగర్భ జలాశయాల రీఛార్జింగ్ కారణంగా రాష్ట్రంలో భూగర్భజల మట్టం 7 మీటర్లకు పైగా పెరిగిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సానుకూల ప్రభావం ఫలితంగా రాష్ట్ర ఆవిర్భావం నాటికి 1.28 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం.. ఇప్పుడు 3.17 లక్షలతో దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక, ప్రయోజనకరమైన ప్రాజెక్ట్‌ను.. ఎటువంటి అదనపు పరిశీలనలు లేకుండా సమర్థంగా, త్వరగా పునరుద్ధరించేందుకు రాష్ట్ర ఏజెన్సీలతో సహకరించాలని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీని రజత్‌కుమార్ విజ్ఞప్తి చేశారు.

Medigadda Barrage Issue Update : మేడిగడ్డ బ్యారేజీ 15 అంశాల నివేదికను కేంద్రానికి పంపిన రాష్ట్ర ప్రభుత్వం

మేడిగడ్డ బ్యారేజీ ఘటన జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ లేవనెత్తిన అంశాలు, ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం

Last Updated : Nov 5, 2023, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.