ETV Bharat / state

శాసనసభలో 42 పేజీల శ్వేతపత్రం - తెలంగాణ మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 20, 2023, 1:06 PM IST

Updated : Dec 20, 2023, 8:29 PM IST

Telangana Government Released White Paper
Telangana Assembly Sessions 2023

Telangana Assembly Sessions Live News 2023 : రాష్ట్ర అప్పులు రూ.6,71,757 కోట్లకు చేరాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది. 2014లో రూ.72,658 కోట్లు ఉన్న అప్పులు ప్రస్తుతం కార్పొరేషన్ల రుణాలతో కలిపి రూ.6 లక్షల 71 వేల కోట్లు దాటినట్లు వివరించింది. రుణ భారం కారణంగా రాష్ట్ర రెవెన్యూ రాబడుల్లో 34 శాతం అప్పులు, రీపేమెంట్లకే సరిపోతోందని పేర్కొంది. మరో 35 శాతం జీతాలు, పింఛన్లకే కావాలని గుర్తు చేసింది. అభివృద్ధి, సంక్షేమానికి 31 శాతమే ఉంటుందని పేర్కొంది. గత పదేళ్లో విద్య, వైద్య రంగాలకు చాలా తక్కువ నిధులు కేటాయించారని తెలిపింది.

శాసనసభలో 42 పేజీల శ్వేతపత్రం - తెలంగాణ మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు

Telangana Assembly Sessions Live News 2023 : బీఆర్‌ఎస్‌ సర్కారు పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. గత పదేళ్లలో అప్పులు దాదాపు పదిరెట్లు పెరిగాయని తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వ ప్రత్యక్ష గ్యారంటీలు, పరోక్షంగా ఇచ్చిన హామీలు, ఇతర ప్రభుత్వరంగ సంస్థలు తీసుకున్న రుణాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.6, 71,757 కోట్లకు చేరాయని వివరించింది. ఇందులో ఎఫ్‌ఆర్‌బీఎం (FRBM) కింద తీసుకున్న రుణం రూ.3,89,673కోట్లు ఉన్నట్లు పేర్కొంది. కార్పొరేషన్ల అప్పులు రూ.1,27,208 కోట్లు, ప్రభుత్వ గ్యారంటీలతో కార్పొరేషన్ల రుణం రూ.95,462 కోట్లు, ఆయా సంస్థలు చెల్లించాల్సిన అప్పులు రూ.59,414 కోట్లు ఉన్నట్లు వివరించింది.

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన అప్పు రూ.74,590 కోట్లు అని వెల్లడించింది. వాటర్‌ కార్పొరేషన్‌ రూ.14,060 కోట్లు, మిషన్ భగీరథ కింద రూ.20,200 కోట్లు రుణాలు తీసుకున్నట్లు తెలిపింది. బడ్జెట్‌ అంచనాలకు, వాస్తవ ఖర్చులకు దాదాపు 20 శాతం అంతరం ఉన్నట్లు శ్వేతపత్రం స్పష్టం చేసింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువగా ఉండడం సహా ఉమ్మడి రాష్ట్రంతో పోల్చినా అధికంగానే ఉందని తెలిపింది. రాష్ట్రం అప్పుల కుప్పగా మారడం వల్ల రాష్ట్ర రెవెన్యూ రాబడుల్లో 34 శాతం అప్పులు, రీపేమెంట్లకే సరిపోతోందని శ్వేతపత్రంలో తెలిపారు. మరో 35 శాతం జీతాలు, పెన్షన్లకే కావాలని గుర్తు చేసింది. అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం 31 శాతమే మిగిలిందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రోజూవారీ అవసరాల కోసం చేబదుళ్లు తీసుకోవాల్సిన దుస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తంచేసింది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం - శాసనసభా వేదికగా లెక్కతేల్చనున్న ప్రభుత్వం

రాష్ట్రం ప్రస్తుత ఏడాదిలో 90 రోజులు ఆర్‌బీఐ వద్ద చేబదుళ్లు, ఓవర్‌ డ్రాఫ్ట్‌ వంటి పద్ధతుల్లో నిధులు సమకూర్చుకుంటోందని పేర్కొంది. పదేళ్ల క్రితం మిగులు బడ్జెట్‌ స్థాయి నుంచి ప్రస్తుతం అప్పులు అనివార్యం అనే స్థితికి చేరుకుందని తెలిపింది. రాష్ట్ర జీఎస్‌డీపీలో అప్పుల భారం 36.9 శాతానికి చేరుకుందని వివరించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఇది 15.7 శాతమే ఉందని గుర్తుచేసింది. ఎఫ్‌ఆర్‌బీఎం(FRBM) నిబంధనల ప్రకారం 25 శాతం దాటకూడదని పేర్కొంది. బడ్జెట్‌తో సంబంధం లేకుండా కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న అప్పులను కూడా కలిపితే ఇది 36.9 శాతానికి చేరుకుందని పేర్కొంది.

Telangana Govt White Paper On State Economy 2014-23 : కీలకమైన విద్య, వైద్య రంగాలకు గత పదేళ్లలో ఏ రాష్ట్రంలోనూ లేనంత తక్కువ కేటాయింపులు జరిగాయని తెలిపింది. బడ్జెట్‌లో కనీసం 14.7 శాతం మేర విద్యారంగానికి కేటాయించాలనే సంప్రదాయం ఉన్నప్పటికీ తాజా బడ్జెట్‌లో 7.6 శాతం మాత్రమే కేటాయించినట్లు తెలిపింది. వైద్యరంగానికి జాతీయ సగటు 6.2శాతం బడ్జెట్‌ కేటాయింపులు ఉంటే, రాష్ట్రంలో అది 4.2 శాతం మాత్రమే ఉన్నట్లు వివరించింది. గత పదేళ్ల ప్రస్థానాన్ని ఆర్థిక అరాచకత్వంగా ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్ర వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు వివరించాలన్న ఉద్దేశంతోనే శ్వేతపత్రం విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో ఉన్న అంశాలు :

  • రాష్ట్ర మెుత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు
  • రాష్ట్ర మెుత్తం రుణాలు రూ. 6,71,757 కోట్లు
  • రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు పెరిగిన రుణభారం
  • బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20 శాతం అంతరం
  • ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలు రూ.3,89,673
  • 57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ.4.98 లక్షల కోట్ల వ్యయం
  • 2014 -15 నాటికి రాష్ట్ర రుణం రూ.72,658 కోట్లు
  • 2014-2022 మధ్య సగటున 24.5 శాతం పెరిగిన అప్పు
  • 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం రూ.3,89,673 కోట్లు
  • 2015-16 జీఎస్డీపీలో రుణ శాతం 15 .7 శాతంతో దేశంలోనే అత్యల్పం
  • 2023-24 నాటికి 27.8 శాతానికి పెరిగిన రుణ, జీఎస్డీపీ శాతం
  • రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగిన రుణ చెల్లింపుల భారం
  • రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీతాలకు 35 శాతం వ్యయం
  • ప్రభుత్వమే చెల్లించే ఎస్పీవీల రుణాలు రూ.1,85,029 కోట్లు
  • ప్రభుత్వ హామీతో ఎస్పీవీల రుణ బకాయిలు రూ.95,462 కోట్లు
  • ప్రభుత్వ హామీ లేని రుణాలు రూ.59,414 కోట్లు

శాసనసభలో వాడీ వేడీ చర్చలు - కాంగ్రెస్​ ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్న విపక్షాలు

'సీఎం రేవంత్​ రెడ్డికి పంటల బీమాకు, రైతు బీమాకు తేడా తెలియదు'

Last Updated :Dec 20, 2023, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.