ETV Bharat / state

సంక్రాంతికి, గాలిపటానికి సంబంధం ఏంటీ? అసలెందుకు ఆరోజు పతంగులను ఎగరవేస్తారు?

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 13, 2024, 6:59 AM IST

Updated : Jan 13, 2024, 9:49 AM IST

Makar Sankranti 2024
Makar Sankranti 2024

Sankranti Special Story 2024 : సరదాల సంక్రాంతి వచ్చేసింది. ఈ పండుగంటే తెలుగు రాష్ట్రాల్లో జోష్ మామూలుగా ఉండదు. గుమ్మం ముందు రంగు రంగుల ముగ్గులు. వంటింట్లో గుమగమ లాడే పిండి వంటలు. సక్రాంతి నేలకే కాదు, నింగికి కూడా పండుగ కళను తెచ్చిపెడుతుంది. పతంగులతో నీలాకాశం కొత్త శోభను సంతరించుకుంటుంది. సప్తవర్ణాల గాలిపటాలు నింగిలో ఎగురుతుంటే ఆ ఆనందం అంతా ఇంతా కాదు. సంక్రాంతికి, గాలి పటానికి మధ్య ఉన్న సంబంధం ఏంటీ? పండుగ రోజునా ఎగురవేసే ఆ పతంగుల వెనుకున్న మర్మమేంటో తెలుసుకుందాం.

మొదలైన గాలి పటాల జోష్​ - అసలేందుకు పతంగులను ఎగరవేస్తారో తెలుసా?

Makar Sankranti 2024 : ఆకాశంలో తేలుతుంది మేఘం కాదు. తోకాడిస్తుంది పిట్టకాదు. పట్టు తప్పితే పారిపోతుంది. ఇంతకీ అదేంటో చెబుతారా? అంటే ఠక్కున గుర్తొచ్చే సమాధానం గాలిపటం(Kite). సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు నెల ముందు నుంచే ఆకాశంలో గాలిపటాలు కనువిందు చేస్తుంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అంతా సరదాగా గాలిపటాలు ఎగరవేస్తూ ఆనందిస్తుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోటాపోటీగా గాలిపటాలు ఎగరేస్తూ సందడి చేస్తుంటారు. రకరకాల ఆకారాల్లో పతంగులు నింగిని తాకుతూ అలరిస్తుంటాయి.

సంక్రాంతి పండక్కి ఈ గాలిపటాలను ఎందుకు ఎగరవేస్తుంటారు. మకర సంక్రాంతి పండుగ(Makar Sankranti Festival) చలికాలంలో వస్తుంది. సంక్రాంతి రోజు సూర్య భగవానుడు దక్షిణాయన కాలం నుంచి ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ పండుగను సూర్యభగవానుడికి అంకితం చేస్తారు. ఈ పండుగతో చలికాలం పూర్తై వసంత కాలంలోకి ఆహ్వానం పలకడం కోసం అనాదిగా ఆకాశంలో గాలిపటాలను ఎగురవేస్తున్నారు. గాలిపటాలు ఎగరవేయడం వెనుక ఆధ్యాత్మికంగా మరో కారణంగా కూడా ఉందని నమ్ముతారు. 6 నెలల తర్వాత సకల దేవతలు నిద్ర నుంచి మేల్కొంటారని వారికి ఆహ్వానం పలికేందుకు పతంగులు ఎగరవేస్తారని విశ్వసిస్తుంటారు.

Kite Festival in Telangana : గాలి పటాలు ఎగురవేయడం అనేది కేవలం వినోదానికి మాత్రమే కాదు. ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలున్నాయి. గాలిపటాలు ఎగరేసేటపుడు ఎక్కువ సమయం మన శరీరం సూర్యకిరణాలకు బహిర్గతం అవుతుంది. దీని వల్ల విటమిన్ డి(Vitamin D) లభించి శరీరంలోని చెడు బాక్టీరియా తొలిగిపోయి చర్మ సంబంధ వ్యాధులు తగ్గుతాయి. ఎండలో ఉండడం వల్ల మనసుకు వెచ్చని ఆహ్లాదం కలుగుతుంది. గాలిపటం దారాన్ని పట్టుకొని పరుగెత్తడం వల్ల కేలరీలు కరుగుతాయి. హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

కైట్స్ అండ్​ స్వీట్స్ ఫెస్టివల్​కు సీఎం రేవంత్​రెడ్డికి ఆహ్వానం

గాలిపటం గత చరిత్ర : గాలిపటాలు ఎగరేయడం ఇప్పటిది కాదు. క్రీస్తు పూర్వం 2వేల ఏళ్ల కిందట చైనాలో మొదలైంది. ప్రసిద్ధ చైనీస్ తత్వవేత్త మోజీ మొదట ఈ గాలిపటాన్ని పట్టువస్త్రంతో తయారు చేశారు. ఆ తర్వాత హేన్ చక్రవర్తి శత్రువు కోటలోకి సొరంగాన్ని తవ్వాలనే ఆలోచనతో గాలిపటం తయారుచేసి దారం కట్టి ఎగరవేశాడు. ఆ దారాన్ని కొలిచి సొరంగం తవ్వి, సైనికులను పంపి కోటను వశం చేసుకున్నాడనే కథ ప్రచారంలో ఉంది. కాలక్రమంలో గాలి పటాలు విదేశాల్లోనూ ఎగరడం మొదలుపెట్టాయి. మన దేశంలోనూ ఎగరవేయడం ప్రారంభించారు. ముందు సన్నని వస్త్రంతో, ఆ తర్వాత కాగితంతో గాలిపటాలను తయారు చేయడం మొదలుపెట్టారు. నిజాం నవాబులు కూడా గాలిపటాలు ఎగరవేయడాన్ని బాగా ప్రోత్సహించారు. పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడంతో అవి మన సంస్కృతిలో భాగంగా మారాయి.

గాలి పటాలంటే అన్ని దేశాల ప్రజలకు ఆసక్తే. పోటీలు పెట్టుకొని మరీ పతంగుల్ని ఆకాశపుటంచుల్ని తాకేలా చేస్తారు. గుజరాత్‌లోని సబర్మతీ నదీ(Sabarmati River) తీరంలో జరిగే అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌కు లక్షల మంది హాజరవుతారు. విదేశాల నుంచి వచ్చి పోటీపడుతుంటారు. గాలిపటం ఎగరవేయడం అందరి వల్ల కాదు. నేర్పు, నైపుణ్యం ఉంటే తప్ప గాలిపటం నింగిలోకి పంపించలేము. గాలి వేగం, గాలిపటాన్ని తయారు చేసే పదార్థం, హ్యాండర్ల నైపుణ్యంపై ఆధారపడి పతంగి పైకి ఎగురుతుంది.

జీవిత పాఠాలను నేర్పుతున్న గాలిపటం : ఆకాశంలో పక్షిలా విహరించే గాలిపటం మనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తుంది. మన లక్ష్యం ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలని అప్పుడే పైకి ఎదగడం సాధ్యమవుతుందని చెబుతుంది. గాలిపటం ఎగరేస్తున్నప్పుడు ఎలాగైతే పట్టు బిగిస్తామో మన జీవితంపై కూడా అలాగే పట్టు బిగించి ముందుకుసాగాలి. దిశను, వేగాన్ని నియంత్రించుకోవాలి. మరీ బిగబట్టినా లేదా అలా వదిలేసినా గాలిపటం కింద పడ్డట్లే జీవితం కూలిపోతుంది. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్న పతంగికి గాలి, చెట్లు, వేరే గాలిపటాలతో అనేక సమస్యలు వస్తుంటాయి. శ్రద్ధ పెట్టి సమస్యలను అధిగమించడానికి ప్రయత్నించాలి. అన్నింటిని భరిస్తూ ఎదగడానికి ప్రయత్నించాలని చెబుతుంది గాలిపటం.

హలో.. నేను మీ గాలిపటాన్ని.. నా స్టోరీ ఏంటో మీకు తెలుసా..?

'చైనా మాంజా అమ్మినా, కొన్నా నేరమే'

Last Updated :Jan 13, 2024, 9:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.