ETV Bharat / state

త్వరలోనే కేసీఆర్ బిహార్‌కు పారిపోవడం ఖాయం: రేవంత్​రెడ్డి

author img

By

Published : Jan 2, 2023, 8:03 PM IST

Updated : Jan 2, 2023, 9:25 PM IST

Revanth Reddy Fires on KCR: సీఎం కేసీఆర్​పై రేవంత్​రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్‌కు అధికారం తాత్కాలికమేనని.. ఎల్లకాలం ఇలా ఉండదని స్పష్టం చేశారు. బిహార్‌తో కేసీఆర్‌కు రక్త సంబంధం ఉందని.. అందుకే బీఆర్‌ఎస్‌ అని పెట్టుకున్నారని వ్యంగాస్త్రాలు సంధించారు. త్వరలోనే కేసీఆర్ బిహార్‌కు పారిపోవడం ఖాయమని ఆయన ఎద్దేవా చేశారు.

Revanth Reddy
Revanth Reddy

Revanth Reddy Fires on KCR: ముఖ్యమంత్రి కేసీఆర్​పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ సర్పంచ్‌ల నిధులను దొంగలించిన వ్యక్తి అంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వం రూ.35,000 కోట్ల నిధులను దొంగలించి బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. గ్రామ పంచాయతీల వ్యవస్థను కేసీఆర్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. సర్పంచ్‌లకు కాంగ్రెస్ అండగా ఉంటుందంటే.. ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. బొల్లారం పోలీస్​స్టేషన్‌ నుంచి విడుదలైన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పంచాయతీ నిధులపై సర్వాధికారాలను సర్పంచ్‌లకు ఇచ్చారని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. సర్పంచ్‌లకు చట్టపరంగా నిధులు, విధులు కేటాయించారని.. కానీ ప్రభుత్వం సర్పంచ్‌ల నిధులు, విధులను లాక్కుందని విమర్శించారు. రూ.35,000 కోట్ల సర్పంచ్‌ల నిధులను తీసుకుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను.. అక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని దుయ్యబట్టారు.

గ్రామపంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం: సర్పంచ్‌లకు నిధులు లేకుండా చేసి గ్రామపంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని రేవంత్​రెడ్డి దుయ్యబట్టారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు.. కరెంట్‌ బిల్లులు చెల్లించేందుకు కూడా నిధులు లేవని విమర్శించారు. గతంలో రిజిస్ట్రేషన్లు, ఇసుక ద్వారా గ్రామాలకు ఆదాయం వచ్చేదని.. ఇప్పుడు బడా కాంట్రాక్టర్ల కోసం సర్పంచ్‌లకు నిధులు లేకుండా చేశారని ఆరోపించారు. దీంతో బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

నిధులను పంచాయతీ ఖాతాల్లో వెంటనే జమచేయాలి: సర్పంచ్‌ల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ధర్నాకు పిలుపునిచ్చామని రేవంత్​రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రజల హక్కు అని పేర్కొన్నారు. నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా అరెస్టులు.. గృహనిర్బంధాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న నిధులను పంచాయతీ ఖాతాల్లో వెంటనే జమచేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

సర్పంచ్‌లు సమిధలు అవుతున్నారు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధిపత్య పోరులో సర్పంచ్‌లు సమిధలు అవుతున్నారని రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ధర్నా చౌక్‌ వద్ద ఆందోళనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బిల్లుల కోసం సర్పంచ్‌లు మంత్రులను నిలదీయాలని విజ్ఞప్తి చేశారు. డీజీపీ అంజనీకుమార్​ తమను అరెస్టు చేసి ప్రభుత్వానికి నజరానా ఇవ్వాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను సంతోషపెట్టడానికి డీజీపీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

త్వరలోనే కేసీఆర్ బిహార్‌కు పారిపోవడం ఖాయం: డీజీపీ చట్టాన్ని గౌరవించాలని రేవంత్​రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు అధికారం తాత్కాలికమేనని.. ఎల్లకాలం ఇలా ఉండదని అభిప్రాయపడ్డారు. బిహార్‌తో కేసీఆర్‌కు రక్త సంబంధం ఉందని.. అందుకే బీఆర్‌ఎస్‌ అని పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. త్వరలోనే కేసీఆర్ బిహార్‌కు పారిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. అందుకోసమే బిహార్‌ వాళ్లను నియమించుకుంటున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి మారిన 12మంది ఎమ్మెల్యేలను కూడా విచారించాలని రేవంత్​రెడ్డి డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి: సర్పంచుల నిధుల సమస్యపై కాంగ్రెస్ పోరు.. రేవంత్ రెడ్డి అరెస్టు

సీఎం ఇంటికి సమీపంలో బాంబు- రంగంలోకి సైన్యం

Last Updated : Jan 2, 2023, 9:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.