ETV Bharat / state

సర్పంచుల నిధుల సమస్యపై కాంగ్రెస్ పోరు.. రేవంత్ రెడ్డి అరెస్టు

author img

By

Published : Jan 2, 2023, 2:15 PM IST

Updated : Jan 2, 2023, 2:58 PM IST

Revanth Reddy Arrest
Revanth Reddy Arrest

Revanth Reddy Arrest : ప్రజా సమస్యలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వం అడ్డుకోవడం ఏంటంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. పంచాయతీలకు నిధుల సమస్యపై నిరసనలకు సిద్ధమైన కాంగ్రెస్‌ నేతల్ని అడ్డుకోవడంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

Revanth Reddy Arrest : పంచాయతీలకు నిధుల సమస్యపై రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నాకు పీసీసీ పిలుపునిచ్చింది. ఇందిరా పార్కు వద్ద ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనికి తోడు... కాంగ్రెస్ నేతల్ని ఎక్కడికక్కడ పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. పెద్ద సంఖ్యలో పోలీసులు నేతల ఇళ్ల వద్ద మొహరించారు. నాయకులెవరూ ఇంటి బయటకు రాకుండా అడ్డుకున్నారు.

హైదరాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. దీంతో ఆయన ఇంటివద్ద ఉద్రిక్తత తలెత్తింది. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు రేవంత్‌ యత్నించడంతో.. పోలీసులు ఆయన్ను బలవంతంగా అరెస్ట్ చేసి కారులో ఎక్కించుకుని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులతో రేవంత్‌ వాగ్వాదానికి దిగారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధర్నా చౌక్ ఉన్నదే ధరనాలు చేసేందుకని... అక్కడ ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలిపేందుకు పోలీసుల అనుమతి ఎందుకని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ధర్నా చౌక్‌లో ఇబ్బంది ఉంటే పోలీసులు అక్కడే అభ్యంతరం వ్యక్తం చేయాలి కాని తనను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకోవడమేంటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎంపీగా తన విధులు తాను విధులు నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. తన విజిటర్లను ఎలా అరెస్టు చేస్తారని నిలదీశారు. సర్పంచ్‌ల అకౌంట్‌లో డబ్బులు దారి మళ్లించారని.. రూ.35వేల కోట్లు ప్రభుత్వం విత్ డ్రా చేసుకుందని వాళ్లపై కేసులు పెట్టుకోవాలని పోలీసులతో అన్నారు.

రేవంత్‌రెడ్డి ఇంటివద్దకు వచ్చేందుకు యత్నించారని ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డిని జూబ్లీహిల్స్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ గాంధీభవన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఇతర రాష్ట్రస్థాయి నేతలు, కార్యకర్తలు ధర్నా చౌక్‌ కు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు గేట్ వద్దనే అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో గేటు ఎక్కి బయటకు దూకేందుకు కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

జిల్లాల నుంచి కూడా కాంగ్రెస్‌ శ్రేణులు హైదరాబాద్ రానివ్వకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎక్కడిక్కడ అరెస్టులు చేస్తున్నారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీసీసీ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డిని గాంధీభవన్ వద్ద అరెస్టు చేసి బేగం బజార్ పోలీసు స్టేషన్ కు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అప్రజాస్వామికమని, ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని నేతలు విమర్శించారు.

అరెస్టు చేసిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. సర్పంచ్‌లకు వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించడం దుర్మార్గమని ఆయన విడుదల చేసిన ప్రకటనలో మండిపడ్డారు. గ్రామాలలో పనులు చేయకపోతే అధికారులు సస్పెండ్ చేస్తామని సర్పంచ్‌లను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాలలో ధర్నాలు, రాస్తారోకోలు లాంటి కార్యక్రమలు చేయాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాలని కోరారు.

ఇవీ చదవండి:

Last Updated :Jan 2, 2023, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.