ETV Bharat / state

గ్రూప్‌-4కు ట్రై చేస్తున్నారా.. ఇలా చదివితే జాబ్ పక్కా..!

author img

By

Published : Dec 5, 2022, 9:56 AM IST

TSPSC Group 4 Notification
TSPSC Group 4 Notification

Tips for Group 4 Preparation : ఉద్యోగార్థుల ఎదురుచూపులకు తెర వేస్తూ 9,168 గ్రూప్‌- 4 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలయింది. యూపీఎస్సీ అభ్యర్థులతో సహా లక్షల మంది ఈ పరీక్ష రాయాలని తపన పడుతున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కే 2.8 లక్షల మంది హాజరయ్యారంటే ఈ పరీక్షకు 10 లక్షలపైన దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అంటే తీవ్రమైన పోటీలో ఉద్యోగాన్ని పొందాల్సి ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో ఎలాంటి మెలకువలు పాటిస్తే 2023 ఏప్రిల్‌/ మేలో జరిగే పరీక్షలో విజయం సాధించవచ్చో తెలుసుకుందాం!

Tips for Group 4 Preparation : గ్రూప్‌-4 రాతపరీక్షలో పేపర్‌ 2 స్కోరింగ్‌కు ఆస్కారమిస్తుంది. అయినప్పటికీ లభిస్తున్న కొద్ది నెలల కాలాన్ని ప్రణాళికాబద్ధంగా సద్వినియోగపర్చుకుంటే పేపర్‌ 1 లో కూడా అధిక స్కోరు తెచ్చుకుని మంచి ఫలితాన్ని సాధించవచ్చు.

పేపర్‌ 1: ఇందులో ఉన్న 11 విభాగాల్లో తెలంగాణ సంబంధిత - భౌగోళికం, తెలంగాణ ఉద్యమం, సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం, పాలన విధానాలు, ఆర్థిక వ్యవస్థ మొదలైనవాటిపై తొలి దృష్టి పెడితే, 40-50 ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు గుర్తించే అవకాశం వుంది. అందువల్ల తెలంగాణ అంశాలతో సన్నద్ధత ఆరంభించడం మంచిది.

భారత రాజ్యాంగం: దీనిపై 10-15 ప్రశ్నలకు అవకాశం ఉంది. తక్కువ సమయంతో ఎక్కువ ఫలితాన్ని అందించే విభాగమని చెప్పవచ్చు. చాప్టర్ల వారీగా ప్రాధాన్యం నిర్ణయించుకుని చదవాలి. కరెంట్‌ అఫైర్స్‌ను అనుసంధానించుకుని చదివితే ఎగ్జామినర్‌ దృష్టి పడే అంశాలు అర్థమవుతుంటాయి. పాత ప్రశ్నపత్రాల్లో అడిగిన ప్రశ్నలు కూడా రిపీట్‌ అయ్యే అవకాశం ఉన్నందున వాటి సాధన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.

భారతదేశ భౌగోళిక అంశాలు: బేసిక్స్‌ ప్రధానంగా ప్రశ్నలుంటాయి. పాఠశాల పుస్తకాల్లోని అంశాలను అభ్యసించి, ఆపై డిగ్రీ స్థాయివి చదివితే మంచిది.

భారత ఆర్థిక వ్యవస్థ: 10-15 ప్రశ్నలకు అవకాశం ఉంది. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో పుస్తకాల్లో ఉన్న బేసిక్స్‌ ముఖ్యం. అనంతరం భారతదేశ ఆర్థిక సర్వే, బడ్జెట్లపైన స్థూల అవగాహన పెంచుకోవాలి. స్థూల గణాంకాలపై అవగాహన ఉండాలి. లోతైన గణాంకాల అవసరం సాధారణంగా ఉండదు. ప్రణాళిక వ్యవస్థ, నీతి ఆయోగ్‌, సాంఘిక ఆర్థిక సమస్యలైన నిరుద్యోగం, పేదరికం మౌలిక భావనలు తెలుసుకోవాలి. వాటి నిర్మూలనకు భారత ప్రభుత్వ చర్యలపై అవగాహన ఉండాలి. అందుకు తాజా కేంద్ర పథకాలపై పట్టు సాధించాలి. విత్త, ద్రవ్యవ్యవస్థలపై పరిజ్ఞానం అవసరం. వర్తమాన సమాచారంతో అనుసంధానం చేసుకోవాలి.

..

దీన్నుంచి కూడా 10-15 ప్రశ్నలు రావొచ్చు. అయితే అత్యధిక శాతం ప్రశ్నలు భారత జాతీయోద్యమం మీద వస్తాయి. సంవత్సరాల వారీగా ఉద్యమంలోని వివిధ దశలు- ఫలితాలు, ఉద్యమాన్ని నడిపిన ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలు, జాతీయోద్యమం నాటి గవర్నర్‌ జనరల్స్‌, ఆ కాలంలో విడుదలైన బ్రిటిష్‌ చట్టాలు, వాటికి భారతీయ స్పందన, ఉద్యమ కాలంలో తెలంగాణలో జరిగిన సంఘటనలు మొదలైన రూపాల్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. తెలుగు అకాడమీ ‘జాతీయోద్యమ చరిత్ర’ బాగా ఉపయోగపడే గ్రంథం.

దైనందిన జీవితంలో సైన్స్‌: సిలబస్‌లో పేర్కొన్నదాన్ని బట్టి సైన్స్‌ అనువర్తనాలపై ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. అలాగే భావిస్తే పాఠశాల స్థాయి పుస్తకాల్లోని భౌతిక జీవ రసాయన శాస్త్ర అనువర్తనాన్ని చదువుకుంటే సరిపోతుంది. అందువల్ల పాఠ్యపుస్తకాల్లోని సైద్ధాంతిక అంశాలకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వకుండా మౌలిక అంశాలను చదువుకుని అనువర్తనాలపై దృష్టి పెట్టాలి.

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ: ఈ విభాగం సిలబస్‌లో పేర్కొనలేదు కాబట్టి ప్రశ్నలు వచ్చే అవకాశం లేదనుకోవడం సబబు కాదు. ఎందుకంటే కరెంట్‌ అఫైర్స్‌లో భాగంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రశ్నలు అడగవచ్చు. నిత్యజీవితంలో సైన్స్‌లో అంతర్భాగంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీపైనా ప్రశ్నలు అడగవచ్చు. అందుకని రోజువారీ జీవితంతో ముడిపడిన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీపై పట్టు సాధించాలి.

పర్యావరణ సమస్యలు- విపత్తు నిర్వహణ: ఈ రెండిటిపైన 10కి అటు ఇటుగా ప్రశ్నలు రావొచ్చు. 10+2 స్థాయిలో ఉన్న విపత్తు నిర్వహణ, పర్యావరణ అంశాలు చదివితే చాలు. కొంతవరకు పాఠశాల స్థాయి పుస్తకాల్లోనూ సమాచారం ఉంది. మౌలిక అంశాలు ప్రధానంగా ప్రశ్నల రూపంలో రావొచ్చు.

అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు: ఈ విభాగంలో మనదేశానికి వివిధ దేశాలతో ఉన్న సంబంధాలు ప్రధానాంశాలుగా ఉంటాయి. ముఖ్యంగా సరిహద్దు దేశాలతో సంబంధాలు అనే కోణంలో ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంది. అంతర్జాతీయ సంఘటనలు అనే కోణంలో వివిధ ప్రపంచ వేదికలను ప్రధానంగా అధ్యయనం చేయాలి. కరెంట్‌ అఫైర్స్‌ అనుసంధానించుకుని చదివితే మరింత మంచిది. ‘వివిధ అంతర్జాతీయ వేదికలపై భారతదేశం పాత్ర’ అనే కోణం ప్రశ్నలుగా రావచ్చు. అంతర్జాతీయ వేదికను ఎప్పుడు ప్రారంభించారు, వాటి ప్రస్తుత అధ్యక్షత, సభ్య దేశాల సంఖ్య, లక్ష్యాలు, తాజా సమావేశాలు అనే కోణంలో చదవాలి. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వివిధ సంఘటనలూ ముఖ్యాంశాలే. ఇటీవల జరిగిన ఉక్రెయిన్‌ యుద్ధం లాంటివి.

పేపర్‌ 2: గ్రూప్‌-4 సిలబస్‌లో అత్యధిక మార్కులు వచ్చేందుకు అనువైనది పేపర్‌ 2 అని చెప్పవచ్చు. గతంలో ఎస్‌ఎస్‌సీ, బ్యాంకు ఉద్యోగాలకు తయారైనవారికి దాదాపు 90% మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. అదే విధంగా ప్రతిరోజూ రెండు నుంచి మూడు గంటల ప్రాక్టీస్‌ చేస్తే తాజా అభ్యర్థులు కూడా దీటుగా మార్కులు తెచ్చుకోవచ్చు. పేపర్‌ 2 లో ఐదు విభాగాలున్నాయి.

మెంటల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్‌: ఈ విభాగంలో కోడింగ్‌ డీకోడింగ్‌, రక్త సంబంధాలు, పజిల్స్‌, వర్గీకరణ, ఎనాలజీ, ఎసర్షన్‌ రీజన్‌, వెర్బల్‌ నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌ మొదలైన అంశాలపై ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నలకు ఉన్న లాజిక్‌, పరిష్కార పద్ధతిని తెలుసుకొని వీలైనన్ని ప్రశ్నలకు సాధన చేస్తే గరిష్ఠ మార్కులు తెచ్చుకోవచ్చు. మొదట సైద్ధాంతిక అంశాలు అర్థం చేసుకొని విస్తృత సాధన చేస్తుండటమే ఈ విభాగంలో రాణించే మెలకువ.

అంకగణిత, సంఖ్యా సామర్థ్యాలు: వడ్డీ లెక్కలు, కాలం-పని, కాలం- వేగం, నిష్పత్తులు, వాటాలు లెక్కింపు మొదలైన పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ప్రశ్న బోధపడితే పరిష్కారం సులువే. కాబట్టి ప్రశ్నలను అర్థం చేసుకునే విధానంపై దృష్టి పెట్టాలి. అందుకు వీలైనన్ని ప్రశ్నలను సాధన చేయాలి. దత్తాంశ విశ్లేషణ సంబంధిత ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంది. సాంఖ్యక శాస్త్ర పాఠ్యాంశాలైన సగటు, మధ్యమం, బహుళకం వ్యాప్తి మొదలైన అంశాలను అధ్యయనం చేయటం వల్ల వాటిపై వచ్చే చిన్న చిన్న ప్రశ్నలు ఎదుర్కోవచ్చు. సంఖ్యా సామర్థ్యాల ప్రశ్నలను ఎదుర్కొనేందుకు BODMAS, అంకెల మధ్య ఉండే సహ సంబంధాలు, అంకెల వరుసక్రమాలు మొదలైన సూత్రాల మీద ఆధారపడిన ప్రశ్నలను సాధన చేయాలి..

కాంప్రహెన్షన్‌: సమాచారాన్ని ఒక పేరాగ్రాఫ్‌లో ఇస్తారు. దాన్ని చదివి వివిధ రకాలైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వటమే. ఈ ప్రశ్నలను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఏ పుస్తకాలూ చదవాల్సిన అవసరం లేదు. సంబంధిత ప్రాక్టీస్‌ బిట్స్‌ కలిగిన పేరాగ్రాఫ్‌లను చదివి సాధన చేయటం అలవాటైతే చాలు. పేరాను వేగంగా, ఏకాగ్రతతో చదవడం, అర్థం చేసుకోవటం, సంక్షిప్తీకరించుకోవడం అనే అంశాలపై ఆధారపడి ఈ విభాగంలో మార్కులు తెచ్చుకోవచ్చు. ఈ సూక్ష్మాన్ని గుర్తించి పేరాలను వేగంగా చదువుతూ అర్థం చేసుకుంటే కాంప్రహెన్షన్‌ను సులభంగా ఎదుర్కోవచ్చు.

వాక్యాల పునర్నిర్మాణం: ఈ విభాగం కోసం ప్రత్యేకంగా సన్నద్ధం అవ్వనక్కర్లేదు. వరస మార్చిన వివిధ వాక్యాలను అర్థవంతమైన రూపంలో తిరిగి అమర్చాలి. ఇలాంటి ప్రశ్నలను సాధన చేయడం ద్వారా మార్కులు రాబట్టుకోవచ్చు.

కరెంట్‌ అఫైర్స్‌: ఇటీవల జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ స్థాయిలో ఉంటాయని భావించనక్కర్లేదు. పరీక్ష తేదీకి ఆరు నెలలు వెనుక నుంచి ప్రశ్నలు అడగొచ్చు. 9 నెలల కాలావధిలో చదివితే మేలు. ఫ్యాక్ట్స్‌పై దృష్టి పెడుతూనే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో మాదిరిగా ప్రశ్నలు వస్తే అని ఆలోచించి చదవడం వల్ల అన్ని జాగ్రత్తలూ తీసుకున్నట్లు అవుతుంది.

గ్రూప్‌-4లో నెగిటివ్‌ మార్కులు లేనందున అన్ని ప్రశ్నలకూ జవాబులు ఇచ్చే వ్యూహం అనుసరించాలి. సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్నట్లుగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ మాదిరిగా జతపరిచే ప్రశ్నలు, ఎక్కువ సమయం పట్టేవి వస్తాయని బెంబేలు పడనక్కర్లేదు. గ్రూప్‌-4 ఉద్యోగాలు అనేవి ఉద్యోగ వ్యవస్థలో అట్టడుగు ఉద్యోగాలు అందువల్ల గ్రూప్‌-1 స్థాయి పరీక్షను ఎదుర్కోవాలని భావించటం అహేతుకం. క్లిష్టత గురించి మనసుకు భయాన్ని నేర్పితే చదవడం మీదున్న ఆసక్తి కూడా పోతుంది. అందువల్ల సమగ్ర ప్రిపరేషన్‌ అవసరమే కానీ అనవసరమైన అపోహలతో సిద్ధమవటం మంచిది కాదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.