ETV Bharat / state

త్వరలో నాపై దాడి జరగబోతోంది: రఘురామకృష్ణ

author img

By

Published : Sep 26, 2020, 4:14 PM IST

raghurama krishna raju latest news
త్వరలో నాపై దాడి జరగబోతోంది: రఘురామకృష్ణ

ఏపీ ప్రభుత్వంపై వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై దాడికి కొంతమంది ప్రభుత్వ పెద్దలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దేవాలయాలపై దాడుల విషయంలో త్వరలోనే తెదేపా నాయకుల పేర్లు చెప్పి కొంతమంది లొంగిపోబోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఏపీ ముఖ్యమంత్రి జగన్ నాటకాలు ఆడడం మానుకోవాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం తనపై కేసు పెట్టి.. కరోనా అంటించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోందని ఆరోపించారు. సీఎంఓ, తమ పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు.. ఎస్సీలతో తన ఆఫీసుపై దాడి చేయించబోతున్నారన్నారు. రెండు మూడు రోజుల్లో దాడి జరిగే అవకాశం ఉందని.. కొంతమంది ఏపీ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న చర్యలను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని రఘురామరాజు చెప్పారు.

త్వరలో నాపై దాడి జరగబోతోంది: రఘురామకృష్ణ

తనను రెచ్చగొట్టి ఆవేశంలో ఏదైనా మాట్లాడితే కేసులు నమోదు చేయాలనే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఎవరిని కులం పేరుతో దూషించలేదని రఘురామ స్పష్టం చేశారు. దాడుల్లో పాల్గొనాలంటూ కొంతమంది ప్రజా ప్రతినిధులు రమ్మన్నారని ఎస్సీ సంఘాల నేతలు తనకు ఫోన్ చేసి చెప్పారని తెలిపారు.

దొంగ హిందూ సర్టిఫికెట్లతో హిందూ మతంపై దాడి

మత మార్పిడిని ప్రోత్సహించేందుకు విదేశాల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వస్తున్నాయన్న రఘురామ.. మత మార్పిడులను ఎవరు ప్రోత్సహిస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు. మత మార్పిడి చేసుకున్నప్పటికీ క్రిస్టియన్​గా నమోదు చేసుకోకపోవడంతో ఎస్సీ హిందువులు వారి రిజర్వేషన్లు కోల్పోతున్నారన్నారు. సాక్షాత్తు చర్చి పాస్టర్లు కూడా హిందూ సర్టిఫికెట్​తోనే ఉన్నారని చెప్పారు. తనపై దాడి చేసేవాళ్లలో ఎస్సీలు ఉండరన్నారు. దొంగ హిందూ సర్టిఫికెట్లతో క్రిస్టియన్లు హిందూ మతంపై దాడి చేస్తున్నారని ఆరోపించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

హిందువులు ఇప్పటికైనా మేల్కోవాలని.. మతంపై జరుగుతున్న దాడిని ప్రతిఘటించాలని కోరారు. దేవాలయాలపై దాడుల అంశంలో తెదేపా నేతల పేర్లు చెప్పి కొంతమంది త్వరలోనే లొంగిపోబోతున్నారని రఘురామ అన్నారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు

ఒక మతం మన్ననలు పొందేందుకు పోలీస్ వ్యవస్థ ఎందుకు ప్రయత్నం చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. వారిపై నమోదైన కేసులను రద్దు చేస్తున్నారంటే ఎక్కడికి వెళ్తున్నారో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని.. ఏపీలో ఉన్న పోలీసులకు చట్టాలపై అంత అవగాహన లేదని అభిప్రాయపడ్డారు. కోడి కత్తి కేసు విచారణ ఎటుపోయిందో తెలియదన్నారు.

ఇకనైనా నాటకాలు ఆపండి

హిందూ మతంపై జరుగుతున్న దాడులపై పోరాడుతున్న తనపై దాడి చేస్తున్నారని రఘురామ కృష్ణరాజు అన్నారు. దాడులకు వ్యతిరేకంగా పోరాడుతున్న తన పదవీ తీసేస్తారా? అని ప్రశ్నించారు. ప్రస్తుతానికి కొత్త పార్టీ పెట్టే యోచన లేదని.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్​లోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. ఇకనైనా ఏపీ సీఎం జగన్ నాటకాలు ఆపేయాలని.. కరోనా అంటించే ప్రయత్నాలు, క్రిస్టియన్ ఎస్సీలతో దాడులు ఇలాంటి చిల్లర రాజకీయాలు తగవని సూచించారు. ప్రజలు ఎంత విజ్ఞులో ఓట్లు వేసే సమయంలో బయటపడుతుందన్నారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు పడాలంటే ప్రజలను ఇబ్బందులు పెట్టడం ఆపాలని చెప్పారు.

ఇదీ చదవండి: అశ్రునయనాలతో బాలూకు అంతిమ వీడ్కోలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.