ETV Bharat / state

ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు.. పలువురి అరెస్టు

author img

By

Published : Nov 12, 2022, 4:47 PM IST

PM Modi Telangana Tour
PM Modi Telangana Tour

Protests Againts PM Modi Telangana Tour: ప్రధాని మోదీ పర్యటన వేళ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు హోరెత్తాయి. సింగరేణి కార్మికులతో పాటు తెరాస, వామపక్ష శ్రేణులు ఆందోళనకు దిగారు. మోదీ రాకను అడ్డుకుంటామంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఎక్కడికక్కడ పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. హైదరాబాద్‌లో ఆందోళన చేస్తున్న వివిధ పార్టీలు, విద్యార్థి సంఘాల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Protests Againts PM Modi Telangana Tour: విభజన హామీలపై కేంద్ర సర్కార్‌ తీరు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటిస్తున్న వేళ తెరాస, వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆయా పార్టీలకు చెందిన పలువురు నేతలను, నిరసనకారులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మోదీ రాకకు వ్యతిరేకంగా రామగుండం బంద్‌కు సీపీఐ పిలుపునివ్వగా.. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును గోదావరిఖనిలో ముందస్తు అరెస్టు చేశారు.

జైపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కూనంనేని దీక్షకు దిగారు. హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన ఆ పార్టీ జాతీయ నేత నారాయణతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని రాష్ట్ర పర్యటనకు నిరసనగా టీఆర్​ఎస్​వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆందోళన చేశారు. నల్ల జెండాలతో రోడ్డుపై మోదీ గో బ్యాక్ అంటూ ప్రదర్శన నిర్వహింస్తుండగా.. పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్​లో ఆందోళనకు దిగిన సీఐటీయూ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేబీఆర్​ పార్క్‌ వద్ద తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ నేతలు గాల్లోకి నల్లబెలూన్లు ఎగరవేసి.. నిరసన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు వద్ద జాతీయ రహదారిపై తెరాస యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మోదీకి వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు. కరీంనగర్‌ తెలంగాణ చౌక్‌లో తెరాస, వామపక్షాలు, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. శాతవాహన విశ్వవిద్యాలయం ముందు నల్ల జెండాలతో తెరాస విద్యార్థి విభాగం నిరసనకు దిగింది.

గంగాధరలో తెరాస కార్యకర్తలు నల్లజెండాలతో ప్రదర్శన నిర్వహించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో విద్యార్థి, ప్రజా సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో తెరాస, సీపీఐ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో కార్మికులు నల్ల జెండాలతో ప్రదర్శన చేపట్టారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని సింగరేణి ఉపరితల గనుల్లో కార్మికులు నిరసనకు దిగారు. ఇల్లందులోని బుగ్గ వాగు బ్రిడ్జిపై వామపక్ష పార్టీల నేతలు రాస్తారోకో నిర్వహించారు. ఖమ్మంలో ఆందోళనకు దిగిన వామపక్ష శ్రేణులు.. గోబ్యాక్‌ మోదీ అంటూ ప్లెక్సీలు ప్రదర్శించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.