ETV Bharat / state

రాష్ట్ర ప్రభుత్వానికి ద్రౌపదీ ముర్ము ప్రశంసలు.. ఆ విషయంలో..

author img

By

Published : Dec 29, 2022, 1:50 PM IST

Updated : Dec 29, 2022, 3:15 PM IST

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

13:46 December 29

రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించిన ద్రౌపదీ ముర్ము

Draupadi Murmu Review on Tribal Development Schemes : ఆదివాసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలుసుకున్నారు. దక్షిణాది విడిదిలో భాగంగా సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉన్న ద్రౌపది ముర్ము.. ఆదివాసీలు, ప్రత్యేకించి బలహీన గిరిజన సమూహాలు - పీవీటీజీల అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్, అధికారులు పాల్గొన్నారు.

పీవీటీజీల సభ్యులు, విద్యార్థులతో స్వయంగా మాట్లాడిన రాష్ట్రపతి.. వారికి అందుతున్న విద్య, వైద్యం, సాగు, తాగునీరు, కనీస మౌలిక సదుపాయాలపై అరా తీశారు. తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీల కోసం, ప్రత్యేకించి పీవీటీజీల కోసం.. అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తూ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

అభివృద్ధి పదంలో: గిరిజనులు, ఆదివాసీల కోసం ప్రతి ఏడాది రైతుబంధు ద్వారా ఎనిమిదిన్నర లక్షల మందికి ఇప్పటివరకు రూ.7,349 కోట్లు అందించినట్లు చెప్పారు. గిరిజన ఆవాసులకు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందుతోందని.. ఆరోగ్య వసతుల కోసం 437 ఉపకేంద్రాలు, 32 బర్త్ వెయిటింగ్ రూములు, ఏడు డయాగ్నొస్టిక్ హబ్​లను నిర్మించినట్లు తెలిపారు. ఆదిమ గిరిజన తెగల ప్రాంతాల్లో 31 పాఠశాలలు, కోలముల కోసం ప్రత్యేక ప్రాథమిక, సైనిక పాఠశాలలు, న్యాయవిద్య, ఫైన్ ఆర్ట్స్ కొరకు ప్రత్యేక కళాశాలల ఏర్పాటుతో పాటు దివ్యాంగుల కొరకు ప్రత్యేక పాఠశాలలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 918 మంది గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందినట్లు పేర్కొన్నారు. సీఎం ఎంటర్ ప్రెన్యూర్ షిప్ పథకం కింద 205 మంది యువతకు ఎనిమిది విభాగాల్లో సహకారం అందించినట్లు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా వెల్లడించారు. అందులో ఐదుగురు ఆదిమ గిరిజన తెగలకు చెందిన వారు ఉన్నారని పేర్కొన్నారు.

లక్షా 40 వేల మంది గిరిజన యువతులకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ.1,126 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు ప్రకటించారు. అటవీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ చెంచు కోలములు, కొండారెడ్డి తెగలకు ప్రభుత్వ సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. 440 ఆదిమ జాతి గిరిజన గ్రామాలలో రూ.60 కోట్లతో అంతర్గత రహదార్లు, 53 ఆదిమ జాతి ఆవాసాలలో రూ.2.39 కోట్లతో సౌర విద్యుదీకరణ చేపట్టి 443 కుటుంబాలకు లబ్ధి చేకూర్చినట్లు పేర్కొన్నారు. 3467 గిరిజన గ్రామాలకు రూ. 221 కోట్ల వ్యయంతో త్రీఫేజ్ విద్యుదీకరణ కల్పిస్తున్నట్లు, గిరిజన గ్రామ పంచాయతీలకు పంచాయతీ భవనాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.3275 కోట్ల ఖర్చుతో గిరిజన ప్రాంతాల్లో 5,162 కిలోమీటర్ల రహదారులు నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ తరహా అనేక కార్యక్రమాలను ఆదిమజాతి గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల కోసం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము... రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు.

ఇవీ చదవండి:

Last Updated :Dec 29, 2022, 3:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.