ETV Bharat / state

బోయగూడ ఘటనలో ప్రాణాలు దక్కించుకున్న వ్యక్తి పోలీసులకు ఏం చెప్పాడంటే?

author img

By

Published : Mar 25, 2022, 4:52 PM IST

police enquiry continues on Boyaguda Fire Accident
బోయగూడ ఘటనలో ప్రాణాలు దక్కించుకున్న వ్యక్తి పోలీసులకు ఏం చెప్పారంటే?

Boyaguda Incident: సికింద్రాబాద్ బోయగూడ టింబర్‌డిపోలో 11 మందిని పొట్టనబెట్టుకున్న అగ్నిప్రమాదానికి కారణాలు కనుక్కోవటంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణాలు దక్కించుకున్న వ్యక్తి నుంచి సమాచారం తెలుసుకున్నారు పోలీసులు. ఇంతకీ అతను ఏం చెప్పారంటే?

Boyaguda Incident: సికింద్రాబాద్‌ బోయగూడలోని తుక్కు గోదాంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో 11 మంది సజీవ దహనం కావడంతో... ప్రమాదానికి దారి తీసిన కారణాలను క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీం, ఫోరెన్సిక్ అధికారులు ఘటనా స్థలంలో నమూనాలు సేకరించారు. మొదట మంటలంటుకొని.. ఆ తర్వాత సిలిండర్ పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లుగా పోలీసులు ఇప్పటికే నిర్థారణకు వచ్చారు. అయితే మంటలు ఎలా వ్యాపించాయనే విషయాలను తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. విద్యుతాఘాతమా లేకపోతే ఇంకేదైనా కారణమా అనే కోణంలోనూ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

తుక్కు గోదాంలో అట్ట ముక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలు మద్యం సీసాలున్నాయి. ఇవన్నీ నెమ్మదిగా లోలోపల అంటుకొని ఆ తర్వాత ఒక్కసారి దావానంలా వ్యాపించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంటల దాటికి సిలిండర్ పేలినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదాన్ని పసిగట్టిన పరేమ్ అనే కార్మికుడు కిటికీలో నుంచి కిందికి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పరేమ్ నుంచి పోలీసులు ఇప్పటికే సమాచారం సేకరించారు. ప్రమాదం రోజు రాత్రి ఒక గదిలో ముగ్గురు, మరో గదిలో 9మంది నిద్రపోయినట్లు పరేమ్ పోలీసులకు తెలిపారు. సిలిండర్ పేలుడుతో మెలకువ వచ్చి చూడగా మొత్తం పొగ కమ్ముకొని మంటలు వ్యాపించాయని... కిందికి దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లు పరేమ్ పోలీసులకు వివరించారు.

పరిశీలించిన హెచ్‌ఆర్సీ ఛైర్మన్ చంద్రయ్య

సికింద్రాబాద్ బోయగూడలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో 11 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమని మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ చంద్రయ్య అన్నారు. ఘటనా స్థలిని మానవ హక్కుల ఛైర్మన్ చంద్రయ్య, ఆంధ్రప్రదేశ్​ అగ్నిమాపక శాఖ డీజీ ప్రతాప్​లు పరీశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అగ్నిమాపక అధికారులు, పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సరైన అనుమతులు లేకుండా జనావాసాల్లో స్క్రాబ్ గోదాములకు అనుమతులు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. అలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునవరావృతం కాకుండా అధికారులు, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అగ్నిప్రమాద ఘటనపై ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతోందని త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయని అన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగానే 11 మంది మృత్యువాత పడ్డారని వెల్లడించారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.