Ganesh Immersion: గణేశ్​ శోభాయాత్ర, నిమజ్జనానికి భాగ్యనగరం సిద్ధం... ఏర్పాట్లు పూర్తి

author img

By

Published : Sep 18, 2021, 9:35 PM IST

ganesh shobha yatra

హైదరాబాద్​లో గణేశ్​ శోభాయాత్ర, నిమజ్జనం కోసం పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా 27వేల మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించనున్నాయి. నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శోభాయాత్రలో పాల్గొనే వాహనాలు తప్పితే ఇతర వాహనాలను రహదారులపైకి అనుమతించరు. నిమజ్జనాన్ని పర్యవేక్షించడానికి హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి రెండు నంబర్లను అందుబాటులో ఉంచారు.

గతేడాది కరోనా వల్ల గణేశ్​ ఉత్సవాలు (Ganesh Festival) జరగలేదు. ఈ ఏడాది హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా భారీగా విగ్రహాలు ఏర్పాటు చేశారు. 9రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథులు, భక్తుల శోభాయాత్ర మధ్య హుస్సేన్​సాగర్​లో నిమజ్జనం (Ganesh Immersion) కానున్నాయి. శోభాయాత్రకు మంటపాల నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర, గణేశ్​ నిమజ్జనాన్ని చూసేందుకు హైదరాబాద్​లోని నలుమూలల నుంచి ప్రజలు ట్యాంక్​బండ్ వైపు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా సమీప జిల్లాల నుంచి కూడా ప్రజలు రానున్నారు. పోలీసులు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని భారీ ఏర్పాట్లు చేశారు.

జియో ట్యాగింగ్...

హైదరాబాద్ కమిషనరేట్ (Hyderabad Commissionerate) పరిధిలో పది రోజులుగా గణేశ్​ మండపాల నిర్వాహకులతో పోలీసులు సమన్వయం చేసుకుంటూ ప్రతి విగ్రహానికి జియో ట్యాగింగ్, బార్ కోడింగ్ ఇస్తున్నారు. పోలీసుల వద్ద దాదాపు 9వేల మంది నిర్వాహకులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీటిలో 10 ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలు 1,000 వరకు ఉన్నాయి. 4 నుంచి 10ఫీట్ల లోపు ఉన్న విగ్రహాలు 8వేల వరకు ఉన్నాయి. కానీ చాలా మంది పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. అన్ని ప్రాంతాల నుంచి వచ్చి హుస్సేన్​సాగర్​లో నిమజ్జనం చేసే విగ్రహాలు 4 ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నవి 45 వేల వరకు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. 10 ఫీట్ల కంటే ఎత్తు ఉన్న విగ్రహాలను ట్యాంక్​ బండ్ వైపు... 10ఫీట్ల లోపు ఉన్న విగ్రహాలను ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్ వైపు ఉన్న క్రేన్ల ద్వారా నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేశారు.

ఈసారి పీవీ మార్గ్​లో కూడా...

గతేడాది ట్యాంక్​బండ్, ఎన్టీఆర్ మార్గ్​లో మాత్రమే విగహ్రాలను నిమజ్జనం చేశారు. కానీ ఈసారి ట్యాంక్ బండ్ సుందరీకరణ వల్ల అక్కడ క్రేన్లను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయడం వీలు కాలేదు. గతేడాది 25 కేన్లను ట్యాంక్​బండ్​పై ఏర్పాటు చేయగా ఈసారి 12కే పరిమితమయ్యాయి. ఇందువల్ల హుస్సేన్ సాగర్ చుట్టూ పలు ప్రాంతాల్లో క్రేన్లను ఏర్పాటు చేశారు. మొత్తం 55 భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఎన్టీఆర్ మార్గ్​లో 10 క్రేన్లు, పీవీ మార్గ్ వైపు 7 క్రేన్లు, ట్యాంక్ బండ్ మీద 12, చిల్ట్రన్ పార్కు సమీపంలో 3, కిమ్స్ ఆస్పత్రి సమీపంలో 3క్రేన్లు ఏర్పాటు చేశారు. నగరంలో హుస్సేన్​సాగర్​లోనే కాకుండా మీరాలం ట్యాంక్, రాజన్నబౌలీ, షేక్​పేట్ ఎర్రకుంట ట్యాంక్, సరూర్ నగర్ చెరువు, సఫిల్​గూడ ట్యాంక్, హస్మత్ పేట్ ట్యాంక్​లోనూ నిమజ్జనం చేయనున్నారు. ఇవే కాకుండా చిన్నచిన్న చెరువుల్లోనూ నిమజ్జనం చేయనున్నారు. షేక్ పేట ఎర్రకుంట వద్ద 2, మీరాలం ట్యాంకు వద్ద 2, రాజన్నబౌలీలో 3 క్రేన్లు ఏర్పాటు చేశారు.

27వేల మందితో బందోబస్తు...

27వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీసులే కాకుండా.. చుట్టుపక్కల జిల్లాల నుంచి పోలీసు సిబ్బందిని బందోబస్తులో భాగస్వాముల్ని చేస్తున్నారు. స్పెషల్ పోలీసులు కూడా విధుల్లో పాల్గొననున్నారు. హోంగార్డులు, ఎస్పీఓలు, ఫారెస్ట్, ఎక్సైజ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బలగాలు పాల్గొననున్నాయి. వజ్ర వాహనాలు, గ్యాస్ స్క్వాడ్, వాటర్ కెనన్, క్విక్ రెస్పాన్స్ టీమ్​లు ఉండనున్నాయి. హుస్సేనీఆలం, లాడ్​బజార్, చౌక్ మసీద్, ఈద్​బజార్​లాంటి సమస్యాత్మక, అతిసమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. కూడళ్లు, జనసమర్థ ప్రాంతాలు, నిమజ్జన ప్రదేశాల్లో ఎక్కువ మంది పోలీసులను మోహరించనున్నారు.

మఫ్టీలో పోలీసులు...

శోభాయాత్రలో పాల్గొనే మహిళల రక్షణ కోసం షీటీమ్ పోలీసులు మఫ్టీలో విధులు నిర్వహించనున్నారు. అదనపు డీజీపీ శిఖా గోయల్, అదనపు డీసీపీ శిరీషా ఆధ్వర్యంలో షీటీమ్ పోలీసులు విధులు నిర్వహించనున్నారు. అనుభవనం ఉన్న పోలీస్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పచెబుతున్నారు. 19 బాంబు తనిఖీ బృందాలు మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు నిర్వహించనున్నాయి. 24 జాగిలాలను రంగంలోకి దింపారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, సినిమా హాళ్లుపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటికే పోలీస్ అధికారులు కమిషనర్, డీసీపీ, ఏసీపీ, సీఐ స్థాయిలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. నిమజ్జన ప్రక్రియలో భాగంగా 63 జనరేటర్లు, 56 మొబైల్ జనరేటర్లు, 81 వాచ్ టవర్లు, 82 మొబైల్ టాయిలెట్లు, 15 అంబులెన్సులు, 7 మెడికల్ బృందాలు, 14 అగ్నిమాపక యంత్రాలు ఏర్పాటు చేశారు. గణేశ్​ నిమజ్జనానికి సంబంధించిన ఏ సమస్యలున్నా 9490598985, 040-27852482 నంబర్లకు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు.

శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు...

సీపీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన సీసీ కెమెరాలను అనుసంధానం చేశారు. పోలీసు అధికారులతో పాటు జీహెచ్ఎంసీ, ఇతర విభాగాలకు చెందిన అధికారులు 24గంటల పాటు క్షేత్రస్థాయి పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 17కిలోమీటర్ల మేర సాగే గణపతి శోభాయాత్ర కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఈ మార్గంలో 276 ప్రత్యక సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో 100కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మద్యం దుకాణాలు, బార్లు, పబ్బులు, కల్లు దుకాణాలు రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8 గంటల వరకు మూసివేయనున్నారు. రౌడీషీటర్లు, సమస్యలు సృష్టించేవాళ్లపై పోలీసులు ఇప్పటికే నిఘా పెట్టారు. 406 రౌడీషీటర్లను ముందస్తు అదుపులోకి తీసుకున్నారు. 2.5కిలోమీటర్ల పాటు ఖైరతాబాద్ గణేశ్​ శోభాయాత్ర (Khairatabad Ganesh Shobha Yatra) కొనసాగనుంది. క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జనం చేయనున్నారు.

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు...

నగరంలో ట్రాఫిక్ అంక్షలు (Traffic Restrictions) విధించారు. దీనికోసం ఇప్పటికే సైన్ బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్​పై ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకు ఫేస్​బుక్, ట్విట్టర్, ఎఫ్ఎం రేడియో ద్వారా ప్రకటనలు చేయనున్నారు. వాహనాల రద్దీ, ప్రత్యామ్నాయ మార్గాలపై గూగుల్ మ్యాప్​తోనూ ట్రాఫిక్ పోలీసులు అనుసంధానం చేస్తున్నారు. నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చే ప్రజలు తమ వాహనాలు నిలిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్​లో విశ్వేశ్వరయ్య భవన్, ఎంఎంటీఎస్, ఆనంద్ నగర్ కాలనీ, బుద్ధభవన్, గోసేవా సదన్, కట్టమైసమ్మ టెంపుల్, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కళాశాల, పబ్లిక్ గార్డెన్​లో వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం తర్వాత వాహనాలను నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, వీవీ స్టాట్యూ, కేసీపీ మీదుగా వాహనాలు వెళ్లనున్నాయి. ట్యాంక్​బండ్ మీద నిమజ్జనం చేసే వాహనాలు బీబీఆర్ మిల్, కవాడీగూడ, ముషీరాబాద్, ఇందిరాపార్కు, అశోక్ నగర్, విద్యానగర్ మీదుగా వాహనాలు వెళ్లనున్నాయి. అంతర్రాష్ట్ర బస్సులు, లారీలకు నగరంలో ప్రవేశం లేదు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలకు వెళ్లే వాళ్లు ప్రత్యామ్నయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వాళ్లు బాహ్యవలయ రహదారిని ఉపయోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేలా పోలీసులు కృషి చేస్తున్నారు. 20న ఉదయం కల్లా నిమజ్జనం పూర్తి చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గణేశ్​ మండపాల నిర్వాహకులు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: Balapur Ganesh Laddu: ఆసక్తి రేపుతోన్న బాలాపూర్​ లడ్డూ వేలం... ఈసారి పోటీ రెట్టింపు!
Ganesh Immersion: హుస్సేన్‌సాగర్‌లో గణేశ్​ విగ్రహాల నిమజ్జనానికి సుప్రీం అంగీకారం

Cp Anjani Kumar: 'తొలిసారిగా పీవీ మార్గ్‌లో కూడా నిమజ్జనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.