ETV Bharat / state

ధర్నా చౌక్​ వద్ద ఉపాధ్యాయుల ఆందోళన.. అరెస్టులతో ఉద్రిక్తత

author img

By

Published : Feb 12, 2022, 1:50 PM IST

Updated : Feb 12, 2022, 3:37 PM IST

TPUS protests at Dharna Chowk
ధర్నా చౌక్​ వద్ద ఉపాధ్యాయుల ధర్నా

Teachers protest at dharna chowk: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద చేపట్టిన నిరసనతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. 317జీవోను సవరించాలని కోరుతూ చేపట్టిన మహాధర్నాలో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో తన ఇద్దరు పిల్లలను ఒంటరిగా ఉంచలేక ఓ ఉపాధ్యాయురాలు.. వారితో కలిసి ధర్నా చౌక్​కు చేరుకుంది. బదిలీల్లో న్యాయం చేయాలని కోరుతూ ఎండలో ఆ చిన్నారులు తల్లితో కలిసి రోడ్డుపై బైఠాయించారు.

Teachers protest at dharna chowk: హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోను సవరించాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మహాధర్నా చేపట్టింది. ధర్నాకు వచ్చిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన టీచర్లను అబిడ్స్‌, చిక్కడపల్లి తదితర పోలీసు స్టేషన్‌లకు తరలించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో వివిధ జిల్లాల నుంచి ధర్నాకు తరలివచ్చిన మహిళా ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని పీఎస్​లకు తరలించారు.

పిల్లలతో కలిసి

ఈ క్రమంలో ధర్నాకు వచ్చిన ఓ ఉపాధ్యాయురాలు తన పిల్లలతో కలిసి నిరసన తెలిపింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు.. తన ఇద్దరు చిన్నారులతో కలిసి పాదయాత్ర చేసుకుంటూ ధర్నా చౌక్​కు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. చిన్నారులు కూడా అక్కడున్న వారికి మద్దతుగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న సమయంలో ఉపాధ్యాయురాలితో పాటు పిల్లలను కూడా పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించారు. పోలీసుల తీరుతో చిన్నారులు విలపించడంతో ఇక చేసేదేం లేక ఆ ముగ్గురినీ ఆటోలో అక్కడి నుంచి తరలించారు.

కొందరి లబ్ధి కోసమే

ఉపాధ్యాయులకు మద్దతు, సంఘీభావం తెలిపేందుకు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ధర్నా చౌక్​కు చేరుకున్నారు. ప్రభుత్వం.. ఉపాధ్యాయ సంఘాల నాయకులను చర్చలకు పిలిచి సమస్య పరిష్కారం చేయాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. జీవో 317ను రద్దు చేయాలనడం లేదని కేవలం సవరణలు మాత్రమే కోరుతున్నామని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు తెలిపారు. ఈ జీవోను కొందరి లబ్ధి కోసమే తీసుకొచ్చారని హనుమంతరావు ఆరోపించారు. స్థానికత, ఉద్యోగాలు, నిధులు కోసమే తెలంగాణ ఏర్పడిందని.. కానీ అందుకు భిన్నంగా పాలన సాగుతోందని ఆరోపించారు.

"జీవో 317 లో సవరణలు చేయాలనే ప్రధాన డిమాండ్​తో ధర్నా చేపట్టాం. రద్దు చేయాలని కోరడం లేదు. 70 శాతం ఉన్న వికలాంగులను పరిగణనలోకి తీసుకున్నారు. మరి 40 శాతం ఉన్న వారిని ఎందుకు తీసుకోలేదు.? జీవోలో కొన్ని లొసుగులు ఉన్నాయి. ఉపాధ్యాయ దంపతుల బదిలీలను పరిగణనలోకి తీసుకోవాలి. వితంతువులు, ఉపాధ్యాయ దంపతుల బాధలను అర్థం చేసుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. నిరసనల ద్వారా తెలియజేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ ధర్నా చేపట్టాం." -హనుమంతరావు, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు

ధర్నా చౌక్​ వద్ద ఉపాధ్యాయుల ఆందోళన

ఇదీ చదవండి: ఈనెల 17న తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ సమావేశం

Bandi Sanjay Comments: 'కేసీఆర్‌ చెల్లని రూపాయి.. ఆయన మాటలు ఎవరూ పట్టించుకోరు'

Last Updated :Feb 12, 2022, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.