ETV Bharat / state

Polavaram Dam : పోలవరం ప్రాజెక్టు...నిర్మాణం పూర్తయ్యేదెన్నడు...?

author img

By

Published : Jan 7, 2022, 8:24 AM IST

Polavaram Dam
పోలవరం ప్రాజెక్టు

ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పురోగతి ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. పోలవరం నిర్మాణం మరింత ఆలస్యమవుతుందని సాక్షాత్తూ కేంద్ర మంత్రి తాజాగా ప్రకటించారు. అనుకున్న గడువులోగా పనులు పూర్తి చేయలేదని- కొత్త షెడ్యూలు సిద్ధం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.

కరోనా, భారీ వరదలు, ఆకృతుల ఖరారు విషయంలో అధ్యయనాలు ఆలస్యమవడం, నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్ర కమిటీలు మరింత సమాచారం కోరడం.. వెరసి పోల‘వరం’ ఆలస్యమవుతోంది. ప్రాజెక్టు ప్రధాన డ్యాం నిర్మాణంలో కొంతమేర మినహా మిగిలిన అన్ని చోట్లా పనులు స్తంభించిపోయాయి. పోలవరం నిర్మాణం మరింత ఆలస్యమవుతుందని సాక్షాత్తూ కేంద్ర మంత్రి తాజాగా ప్రకటించారు. అనుకున్న గడువులోగా పనులు పూర్తి చేయలేదని- కొత్త షెడ్యూలు సిద్ధం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.

ఈ ప్రాజెక్టుకు కేంద్రం 2017-18 ధరల ప్రకారం నిధుల మంజూరుకు పెట్టుబడి అనుమతి ఇవ్వాలంటే అసలు మీరు ఎప్పటికి ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తారో కొత్త షెడ్యూలు సమర్పించండని పోలవరం ప్రాజెక్టు అథారిటీ షరతు విధించింది. దీంతో కొత్త షెడ్యూలు తయారీలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ప్రధాన డ్యాం పనులు చేపట్టిన మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ 2021 డిసెంబరు నాటికి వాటన్నింటినీ పూర్తి చేయాలి. పనులు ఇంకా పెండింగులో ఉన్నాయి. తాజాగా మరో ఏడాది గడువు పెంచేందుకు జల వనరులశాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణం ఎంత వరకు వచ్చింది? ప్రధాన డ్యాంతోపాటు కీలకమైన స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌, రాతి, మట్టికట్ట (ఎర్త్‌కం రాక్‌ ఫిల్‌ డ్యాం)ల పురోగతి ఏమిటి? తదితర అంశాలపై క్షేత్రస్థాయి పరిశీలన కథనం..

పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే

పోలవరం ప్రాజెక్టు ఫలాల కోసం నిరీక్షణ కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి ప్రయోజనాలు అందాలంటే ప్రధాన డ్యాం ఒక్కటే నిర్మిస్తే సరిపోదు. దాన్ని కాలువలతో అనుసంధానించే పనులూ పూర్తి కావాలి. సమాంతరంగా కాలువలు తవ్వాలి. డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు చేయాలి. పోలవరం జలాశయంలో నీళ్లు నిలబెట్టాలంటే ముంపు గ్రామాలను ఖాళీ చేయించాలి. నిర్వాసితులకు పూర్తి స్థాయి పునరావాసం కల్పించాలి. ఇవన్నీ సమాంతరంగా సాగితేనే అసలు లక్ష్యం నెరవేరుతుంది. గత రెండున్నరేళ్లలో ప్రధాన డ్యాం నిర్మాణంలో కొన్ని అడుగులు ముందుకు వేయడం తప్ప మిగిలిన అన్నింటా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పరిస్థితి తయారయింది. అధికారుల గణాంకాల ప్రకారమే ఈ రెండున్నరేళ్లలో మొత్తం ప్రధాన డ్యాం పనిలో 11.67 శాతమే జరిగింది. ఎడమ కాలువ పనులు ఒక్క శాతమూ చేసింది లేదు. కుడి కాలువ పనులు గతంలోనే 91 శాతం పైగా పూర్తయ్యాయి. ఇప్పుడు మరొక్క శాతం మాత్రమే అదనంగా చేసినట్లు జలవనరుల అధికారుల నివేదికలే చెబుతున్నాయి.

పునరావాసం పూర్తయ్యేదెప్పుడో?

వేల మంది నిర్వాసితులు ఇప్పటికీ ప్యాకేజీ సొమ్ములు అందక.. పునరావాస కాలనీలు పూర్తి చేయక నానా అవస్థలు పడుతున్నారు. వరద సమయంలో ఆయా గ్రామాలు ముంపులో చిక్కుకుని నిర్వాసితులు బతుకు జీవుడా అని బయటి గ్రామాలకు తరలిపోవాల్సి వస్తోంది. మా గతి ఏమిటంటూ వారు ఇప్పటికే ఆందోళన బాట పట్టారు.

దిగువ కాఫర్‌ డ్యాం నిర్మాణమూ పెండింగ్‌

తొలుత షెడ్యూలు ప్రకారం దిగువ కాఫర్‌ డ్యాం 2020లోనే పూర్తి కావాల్సి ఉంది. 2021 వరదలు వచ్చే లోపైనా పూర్తి చేయాలని పోలవరం అథారిటీ పదేపదే సూచించింది. ఇప్పటికీ ఈ కాఫర్‌ డ్యామ్‌లో 5.80 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని చేయాల్సి ఉంది. దిగువ కాఫర్‌ డ్యాం వద్ద కూడా కొంత మేర ఇసుక కోత ఏర్పడటంతో డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ ఆకృతుల ఖరారు కోసం కొంత పని పెండింగు ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు.

రాతి, మట్టి కట్ట డ్యాం నిర్మాణం ఎప్పుడో?

పోలవరం ప్రాజెక్టులో రాతి, మట్టి కట్టతో ప్రధాన డ్యాం (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యాం) నిర్మించాల్సి ఉంది. 2021 డిసెంబర్‌ నాటికి ఈ పనులన్నీ పూర్తి చేయాలని గడువు నిర్దేశించుకున్నారు. 2022 ఏప్రిల్‌ నాటికైనా మొత్తం పనులు పూర్తి చేసి జూన్‌ కల్లా పోలవరం నీళ్లిస్తామని ప్రభుత్వం అనేకసార్లు ప్రకటించింది. అయితే ఇంకా రాతి, మట్టి కట్ట పనులు ప్రారంభించలేకపోయారు. ప్రధాన డ్యామ్‌ను మొత్తం మూడు భాగాలుగా నిర్మిస్తున్నారు. ఇందులో ఒక భాగంలో కాంక్రీటు డ్యాం నిర్మాణం పూర్తి చేశారు. మరో రెండు భాగాల్లో రాతి, మట్టి కట్టతో డ్యాం నిర్మించాలి. ఇందుకోసం కోటీ 16 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని చేయాలి. ఒక భాగం 1,750 మీటర్లు (అంటే 1.75 కి.మీ. మేర నదికి అడ్డంగా) మరో భాగంలో 500 మీటర్లకు పైగా ప్రధాన డ్యాం నిర్మించాలి. గోదావరికి భారీ వరదల సమయంలో డ్యాం నిర్మాణ ప్రాంతంలోని నదీ గర్భంలో దాదాపు 25 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర ఇసుక కోసుకుపోయింది. ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని ఆశాభావంతో ఉన్నారు.

కొలిక్కివచ్చిన స్పిల్‌ వే

పోలవరంలో ప్రధానమైన స్పిల్‌వే నిర్మాణం కొలిక్కి వచ్చింది. మరో ఆరు రేడియల్‌ గేట్లు ఏర్పాటు చేస్తే, ఫిష్‌ ల్యాడర్‌కు సంబంధించి మరికొంత పని చేస్తే స్పిల్‌వే నిర్మాణం పూర్తయినట్లే. కరోనా సమయంలో జర్మనీ నుంచి సిలిండర్లు రావడం ఆలస్యమవడంతో స్పిల్‌వే పనులు నిలిచిపోయాయి. ఇంకా మరో మూడు సిలిండర్లు రావాల్సి ఉంది. స్పిల్‌వేలో మొత్తం 19.33 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని చేయాల్సి ఉండగా ఇక 60 వేల క్యూబిక్‌ మీటర్ల పని మాత్రమే మిగిలింది. 42 గేట్లు ఏర్పాటు చేశారు. మరో ఆరు గేట్లు పెట్టాలి. తలుపుల తయారీ దాదాపు పూర్తయింది. అటు ఎగువ కాఫర్‌ డ్యాం 42.5 మీటర్లకు, ఇటు స్పిల్‌వే నిర్మాణం దాదాపు పూర్తవడంతో ప్రస్తుతం 25.72 మీటర్ల స్థాయిలో పోలవరం వెనుక నీళ్లు నిలువ ఉన్నాయి. ఆ నీటిని రివర్‌ స్లూయిస్‌ గేట్లు ద్వారా గోదావరి డెల్టా రబీ అవసరాలకు ఇస్తున్నారు. దాదాపు 16 టీఎంసీలు ఇలా వినియోగించుకోవచ్చని అంచనా.

ప్రధాన డ్యామ్‌లో రూ.1,658 కోట్ల పనులు పెండింగు

పోలవరం కుడి కాలువతో, ఎడమ కాలువలకు ప్రధాన డ్యాం నుంచి నీళ్లు మళ్లించేలా టన్నెళ్లు తదితర అనుసంధాన పనులు చేయాలి. మొత్తం ఆరు ప్యాకేజీలుగా చేపట్టిన ఈ పనులు మందగమనంతో సాగుతున్నాయి. ఇటీవలే కొన్ని పనులు ప్రారంభమయ్యాయి. కుడివైపు అనుసంధాన పనులకు మరో రూ.88.21 కోట్లు, ఎడమవైపు అనుసంధాన పనులకు ఇంకో రూ.217.09 కోట్లు కావాలి. మొత్తం ప్రధాన డ్యాం పనులన్నింటికీ కలిపి ఇంకా రూ.1,658.84 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉంది.

ఇంకా చేయాల్సిన పనులివీ..

  • గోదావరి నదిని స్పిల్‌వే వైపు మళ్లించేందుకు అప్రోచ్‌ ఛానల్‌ పనులు చేపట్టారు. ఈ ఛానల్‌ మళ్లింపు తుది ఆకృతిని ఖరారు చేయాల్సి ఉంది. ఇందులో కొంత తవ్వకం పూర్తయింది. మరో 40 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని చేయాలి. డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ కొన్ని సూచనలు చేసింది. ఆ సమాచారం సమర్పించిన తర్వాత తుది ఆకృతులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
  • డ్యాం డిజైన్‌ కమిటీ సూచన మేరకు పోలవరం స్పిల్‌వేను ఆనుకుని ఎగువన ఎడమ వైపున గైడ్‌ వాల్‌ నిర్మాణ పనులు తాజాగా చేపట్టారు.
  • పోలవరం స్పిల్‌ ఛానల్‌లో కొంత కాంక్రీటు పనులు చేయాల్సి ఉంది. 135.33 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకాలు జరపాలి. ఆ పనులు సాగుతున్నాయి. సీసీ బ్లాకులు, గేబియన్ల పని 1.96 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర చేయాల్సి ఉంది. స్పిల్‌ ఛానల్‌ వద్ద ఇరువైపులా మట్టి దిగువకు జారిపోకుండా రక్షణ పనులు చేయాలని ఆకృతుల కమిటీ సూచించింది. అవీ చేయాల్సి ఉంది.

రూ.2,112 కోట్లు రావాలి

ఒకవైపు వరదలు, మరోవైపు కరోనా ఉన్నా పోలవరంలో స్పిల్‌వే వంటి కీలక నిర్మాణాలు పూర్తి చేశాం. స్పిల్‌వే మీదుగా నీటిని మళ్లించాం. 42 గేట్లు ఏర్పాటు చేశాం. కరోనా సమయంలో పనివారు దొరకడం ఇబ్బందయినా.. మేఘా కంపెనీ ఇతర రాష్ట్రాల నుంచి అదనంగా రప్పించి పనులు చేయించింది. కరోనా సమయంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అయిదుగురు ఇంజినీర్లను కోల్పోయాం. ఇలాంటి పరిస్థితుల్లోనూ పనులు చేయించాం. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం నిర్మాణం మరో ఏడాదిలో పూర్తి చేస్తాం. ఎడమ, కుడి కాలువల అనుసంధాన పనులు, రాతి, మట్టి కట్ట డ్యాంతో సహా అన్నీ పూర్తి చేయగలుగుతాం. డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ త్వరలో సమావేశమవుతోంది. ప్రధాన రాతి మట్టి కట్ట, అప్రోచ్‌ ఛానల్‌, దిగువ కాఫర్‌ డ్యాంలకు సంబంధించి ఆకృతుల విషయంలో వారు చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఆ నిర్ణయాలు రాగానే సంబంధిత పనులన్నీ మొదలుపెడతాం.

- సుధాకర్‌బాబు, చీఫ్‌ ఇంజినీరు, పోలవరం

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు చేసిన పనులకు కేంద్రం నుంచి ఇంకా రూ.2,112 కోట్లు నిధులు రావాలని అధికారులు చెబుతున్నారు. ఇందులో రూ.711 కోట్లు త్వరలోనే వచ్చేందుకు అవకాశం ఉందంటున్నారు.

ఇదీ చూడండి: ఎన్నికల వ్యయ పరిమితిని పెంచిన ఈసీ.. తాజా లెక్కలవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.