ETV Bharat / state

'ప్రతి ఇంటికి రాహుల్ గాంధీ సందేశం చేరాలి.. హాథ్ సే హాథ్ జోడో స్టిక్కర్ ఉండాలి'

author img

By

Published : Mar 4, 2023, 7:34 PM IST

manik rao thaker
తెలంగాణ ఇన్​ఛార్జి మాణిక్ రావు ఠాక్రే

Hath Se Hath Jodo Yatra In Telangana: ప్రతి ఇంటికి రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశం చేరాలని.. హాథ్ సే హాథ్ జోడోయాత్రను కాంగ్రెస్ నేతలు అంతా కలిసి కట్టుగా చేయాలని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గాంధీ భవన్​లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేస్తూ.. బీఆర్​ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు.

Hath Se Hath Jodo Yatra In Telangana: కాంగ్రెస్ నేతలంతా విభేదాలను పక్కన పెట్టి .. హాథ్ సే హాథ్ జోడోయాత్రను కలిసికట్టుగా విజయవంతం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జ్ మాణిక్​రావు ఠాక్రే అన్నారు. నేడు గాంధీభవన్​లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ప్రతి ఇంటికి రాహుల్ గాంధీ సందేశం చేరాలని.. ప్రతి ఇంటికి హాథ్ సే హాథ్ జోడో స్టిక్కర్ అంటించాలని కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలంతా కలిసికట్టుగా ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ధరణి పోర్టల్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకోవాలని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం అక్రమాలు, కబ్జాలతో దారుణంగా వ్యవహరిస్తున్న తీరును ప్రజల ముందుకు తీసుకొని వెళ్లి.. బలంగా చెప్పాలని పిలుపునిచ్చారు.

మండల స్థాయి నేతలు హాథ్ సే హాథ్ జోడో యాత్రను ముందుకు తీసుకెళ్లాలని ఠాక్రే పేర్కొన్నారు. 15 రోజుల్లో మళ్లీ వచ్చి సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. జిల్లాల్లో నిర్వహించే ఈ సమావేశానికి పార్టీ అనుబంధ విభాగాలు అన్నింటినీ పిలవాలని సూచించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ సంస్థలను అదానీకి కట్టబెడుతుందని మండిపడ్డారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్​ఎస్​లపై విమర్శలు చేశారు.

మేము తవ్విన కాల్వల్లోనే ప్రభుత్వం నీరు అందిస్తుంది: మరోవైపు బీఆర్​ఎస్​, బీజేపీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు మండల, బ్లాక్ స్థాయిలో హాథ్ సే హాథ్ జోడో యాత్ర చేపట్టాలని చెప్పారు. ప్రతి రోజు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.

బీజేపీ నేతలు దేశాన్ని మత ప్రాతిపదికన విడదీస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సృష్టించిన సంపదతోనే హైదరాబాద్ భూముల రేట్లు పెరిగాయని.. కానీ ఇప్పుడు బీఆర్​ఎస్​ ప్రభుత్వం భూములు అమ్ముకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కట్టి అధికారంలో ఉన్న బీఆర్​ఎస్ రూ.లక్షల కోట్లు తిన్నదని.. ప్రాజెక్టులో నుంచి చుక్క నీరూ పారలేదని ఆరోపించారు. యాదాద్రిలో అసలు విద్యుత్ ఉత్పత్తి కావడం లేదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ తవ్విన కాల్వల్లోనే తెలంగాణ ప్రభుత్వం సాగు నీటికి, తాగు నీటికి నీళ్లు అందిస్తుందని స్పష్టం చేశారు. కృష్ణానదిపై పాలమూరు ప్రాజెక్టు తప్ప.. మరే ఇతర ప్రాజెక్టులు కట్టలేదని తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.