ETV Bharat / state

వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.. కేసీఆర్‌కు రేవంత్‌ లేఖ

author img

By

Published : Jul 12, 2022, 6:40 PM IST

Revanth reddy
వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.. కేసీఆర్‌కు రేవంత్‌ లేఖ

pcc chief revanth reddy letter to a cm kcr: భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇచ్చే పరిహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి లేఖ రాశారు. వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయాలని కోరారు. తక్షణ సాయం కింద ఎకరాకు రూ.15 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో వర్షాల పరిస్థితులపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. పంట నష్టాలను అంచనా వేయాలన్నారు. ఈ క్రమంలోనే తక్షణ సాయం కింద ఎకరాకు రూ.15 చొప్పున పరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు. పంటలు వేసుకునేందుకు విత్తనాలు, ఎరువులు, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలన్నారు. ప్రీమియం చెల్లించి పంటల బీమా అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

లేఖలో రేవంత్‌ వ్యాఖ్యలు... రాష్ట్రవ్యాప్తంగా గతవారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటలు నీట మునిగి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జోరువానతో.. అన్నదాతకు అపారనష్టం వాటిల్లింది. ఇంత నష్టం జరుగుతున్నా... ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మీరేమో ఇవేమీ పట్టించుకోకుండా రాజకీయాలు చేస్తూ... రైతు బతుకులతో చెలగాటం ఆడుతున్నారు. పంట నష్టంపై ప్రభుత్వం నుంచి గానీ, వ్యవసాయ విభాగం నుంచి గానీ ఎటువంటి ప్రకటన రాకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఈ సీజన్‌లో కురిసిన వర్షాలతో ఆదిలాబాద్, నిజామాబాద్‌, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాది కొత్తగూడెం జిల్లాలో 5లక్షల ఎకరాలకుపైగా పంటలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. పత్తి, మక్క, సోయా, వరితో పాటు పనాస పంటలపై వర్షాల ప్రభావం పడింది. వర్ష విలయానికి రైతులు నష్టపోతున్నారు. చాలా ప్రాంతాల్లో పంటలు నీట మునిగి పోతున్నాయి. వరదకు కొట్టుకుపోతున్నాయి. విత్తనాలు, మొలక స్థాయిలోనే ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలా చోట్ల విత్తనాలు మొలకెత్తకుండా వర్షాల వల్ల మురిగిపోతున్నాయి. మొలక వచ్చినవి కూడా పొలంలో నీరు నిలవడంతో చనిపోతున్న పరిస్థితి. ఈ సీజన్లో ఇప్పటికే 2 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. అధికారుల సూచనల ప్రకారం రైతులు వెదజల్లే వరి సాగుకు మొగ్గు చూపారు. వానలకు వరి విత్తనాలు మురిగిపోయి మొలకలు రావడం లేదు. ఫలితంగా మళ్లీ విత్తనాలు వేయడమో, నారు పోసుకుని నాట్లు వేయడమో చేయాల్సిన పరిస్థితి.

ప్రభుత్వాల చేయూత లేకుండా రైతులు స్వయంగా పంటల బీమా తీసుకునే పరిస్థితి లేకపోవటంతో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు భారీ నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి రైతులకు దాపురిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్‌లో నష్టపోయిన రైతులకు భరోసా కల్పించే విధంగా తగిన నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నా...- రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

రేవంత్‌రెడ్డి డిమాండ్స్:

  • భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణం అంచనా వేయించాలి.
  • తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలి.
  • కొత్తగా పంటలు వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు, ఇన్ ఫుడ్ సబ్సిడీ ఇవ్వాలి.
  • తదుపరి పంటల నుంచి ప్రభుత్వం ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకాల అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలి.

ఇవీ చదవండి: భారీ వర్షాలతో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అప్రకటిత బంద్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.