ETV Bharat / state

ఆ నిధులు ఇవ్వకుంటే ప్రగతిభవన్​ ముట్టడి: పంచాయతీ ఛాంబర్​ అల్టిమేటం

author img

By

Published : Dec 30, 2022, 8:28 PM IST

కేంద్రం నుంచి వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం వాడుకోవడాన్ని తెలంగాణ పంచాయతీ ఛాంబర్​ తప్పుపట్టింది. వెంటనే నిధులు సర్పంచుల ఖాతాల్లో జమ చేయాలని హెచ్చరించింది. లేనిపక్షంలో ప్రగతిభవన్​ ముట్టడించి.. ప్రభుత్వానికి హెచ్చరికలు పంపుతామని పేర్కొన్నారు.

Telangana Government Used Panchayat
తెలంగాణ పంచాయతీ చాంబర్​

సర్పంచ్​ల నిధుల దోపిడీపై తెలంగాణ పంచాయతీ ఛాంబర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్పంచ్​ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ.. హైదరాబాద్​లోని లక్డీకపూల్​లో ఉన్న పంచాయతీ ఛాంబర్ కార్యాలయంలో భవిష్యత్తు కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు వేసిన ఆర్థిక సంఘం నిధుల దోపిడీపై ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని తెలంగాణ పంచాయతీ ఛాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. వారం రోజుల్లో తమ నిధులు తమకు ఇవ్వకపోతే చలో హైదరాబాద్ పేరిట ప్రగతిభవన్​ను ముట్టడిస్తామని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పీఆర్ యాక్ట్ తీసుకొచ్చారని.. రాష్ట్రంలో 12 వందలకు పైగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం నిధులు విడుదల చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు వాడుకుందని వాపోయారు. ఈ నిధులను నిబంధనలకు విరుద్ధంగా వాడుకుందని మండిపడ్డారు. స్టాంప్ డ్యూటీ, మైనింగ్ ఫీజులను ప్రభుత్వం తీసుకుంటుందని.. కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులను సైతం దుర్వినియోగం చేస్తూ ఉపయోగించుకుంటుందని మండిపడ్డారు.

ఫిర్యాదులు రావడంతో గ్రామ పంచాయతీ పేరుతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించిందని పేర్కొన్నారు. కేంద్రం నుంచి నిధులు రాగానే దారి మళ్లించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించిందన్నారు. గ్రామ పంచాయతీ నిధులను ప్రభుత్వం దొంగతనం చేసిందని ఆరోపించారు. గ్రామాల్లో మొక్కలు చనిపోతే కలెక్టర్లు సర్పంచ్​లను సస్పెండ్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారంలోగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక సంఘం నిధులను వెనక్కి ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టి.. ప్రగతి భవన్ తలుపులు బద్దలు కొడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి 6 నెలలు కాలపరిమితి ఉంటే సర్పంచ్​లకు ఏడాది ఉందని.. రానున్న ఎన్నికల్లో తమ సర్పంచ్​ల సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి చూపిస్తామని సత్యనారాయణ రెడ్డి ధ్వజమెత్తారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.