ETV Bharat / state

1,365 పోస్టులతో గ్రూప్- 3 నోటిఫికేషన్ విడుదల

author img

By

Published : Dec 30, 2022, 5:55 PM IST

Updated : Dec 31, 2022, 6:50 AM IST

group 3 notification
group 3 notification

17:53 December 30

1,365 గ్రూప్‌-3 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ ప్రకటన

Group-3 Notifiaction in Telangana : గ్రూప్‌-2 ఉద్యోగ ప్రకటన వెలువడిన మర్నాడే టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-3 కొలువులకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. కొత్త ఏడాది ముంగిట ఉద్యోగార్థుల్లో సరికొత్త జోష్‌ నింపింది. శుక్రవారం సమావేశమైన టీఎస్‌పీఎస్సీ బోర్డు గ్రూప్‌-3 ప్రకటన విడుదలకు ఆమోదం తెలిపింది. మొత్తం 26 ప్రభుత్వ విభాగాల్లో 1365 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనుంది. వీటిలో అత్యధికంగా ఆర్థికశాఖలో 712 పోస్టులు ఉన్నాయి. గ్రూప్‌-3కి జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ తెలిపారు. పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, వేతన స్కేలు, రిజర్వేషన్లు తదితర వివరాలతో జనవరి 24న వెబ్‌సైట్లో సమగ్ర నోటిఫికేషన్‌ పొందుపరచనున్నట్లు పేర్కొన్నారు.

గ్రూప్‌-2 తరహాలో గ్రూప్‌-3 పరీక్ష నిర్వహణపై ప్రాథమిక తేదీని త్వరలో ప్రకటించాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. ఇతర పోటీపరీక్షలను దృష్టిలో పెట్టుకుని ¨ ఇబ్బందులు లేకుండా తేదీ ఖరారు చేస్తామని కమిషన్‌ చెబుతోంది. అభ్యర్థులు సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం ఇస్తామని వెల్లడించింది. తాజా నోటిఫికేషన్‌తో గ్రూప్‌ ఉద్యోగాల ప్రకటనలు పూర్తయినట్లే.

ముందస్తు ప్రణాళికతో.. గ్రూప్‌ ఉద్యోగ ప్రకటనలన్నీ డిసెంబరు 31లోగా జారీ చేయాలని టీఎస్‌పీఎస్సీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు తమ సిబ్బందిని సిద్ధం చేసింది. గ్రూప్‌ ఉద్యోగ ప్రకటనల జారీకి చాలా సమయం పడుతుంది. కమిషన్‌ ఛైర్మన్‌ స్వయంగా ప్రభుత్వ విభాగాధిపతులు, ఇతర అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించడం, సిబ్బందికి అవసరమైన సూచనలు చేస్తూ ప్రతిపాదనలు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకున్నారు. గ్రూప్‌-4, 2, 3 ప్రకటనలు ఒక లక్ష్యం మేరకు జారీ చేసేలా ప్రణాళిక రచించారు. సాధారణంగా గ్రూప్‌-4 ఉద్యోగాలకు ప్రకటన జారీ చేయాలంటే 33 జిల్లాల నుంచి 70 విభాగాల సమన్వయం అవసరం. ఈ ప్రక్రియ పూర్తికావడానికి కనీసం అయిదారు నెలల సమయం పడుతుంది. కానీ ముందుగానే ప్రకటన విడుదల చేసి, ఆ మేరకు ప్రతిపాదనలు నిర్ణీత గడువులోగా తెప్పించేందుకు ప్రయత్నం చేశారు. గ్రూప్‌-4 ఉద్యోగాలకు ఈ నెల 23 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కావాల్సి ఉన్నప్పటికీ.. ప్రతిపాదనల ఆలస్యం, ఇతర సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. గ్రూప్‌-2, 3 పోస్టులకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ విభాగాల నుంచి పూర్తి వివరాలు తెప్పించి, నిబంధనల ప్రకారం సరిగా ఉన్నాయో లేదా పరిశీలించిన తరువాతే ప్రకటనలు వెలువరించింది. గ్రూప్‌-2, 3, 4 పోస్టులు ప్రభుత్వం నుంచి అదనంగా వస్తే, వాటిని ఈ పరీక్ష ద్వారా భర్తీ చేసేందుకు వీలుగా ప్రకటనలోనే నిబంధన ద్వారా వెసులుబాటు కల్పించింది.

సన్నద్ధతకు మరింత సమయం... గ్రూప్‌-1 సమయంలో ఉద్యోగార్థులు తమకు తగినంత సమయం ఇవ్వాలంటూ విజ్ఞప్తులు పంపారు. కమిషన్‌ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రూప్‌-4, 2, 3 ప్రకటనల విషయంలో ముందుకు వెళ్తోంది. ప్రతిపరీక్షకు కనీసం మూడు నుంచి నాలుగు నెలల సమయం ఇస్తూ పరీక్ష తేదీలు ప్రాథమికంగా నిర్ణయించింది. ఇతర పోటీ పరీక్షలకు ఆటంకం లేకుండా షెడ్యూలు రూపొందిస్తోంది. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు ముగిసిన వెంటనే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షల పరంపర కొనసాగనుంది. ఇప్పటికే గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ముగిసింది. ఈ ఫలితాలు జనవరిలో వెల్లడించి, ప్రధాన పరీక్షకు కనీసం మూడు నెలల సమయం ఇవ్వాలని యోచిస్తోంది.

...

ఇవీ చదవండి:

Last Updated :Dec 31, 2022, 6:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.