ETV Bharat / bharat

వర్క్​ ఫ్రమ్​ హోం అంటూ ఘరానా మోసం.. వలలో పడిన మహిళ.. ఇద్దరు అరెస్ట్​

author img

By

Published : Dec 30, 2022, 12:46 PM IST

నేటి డిజిటల్​ యుగంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని ఆన్​లైన్​లో పనిచేసుకుంటూ సులువుగా డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నారు. కొవిడ్​ రాకతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్​ ఫ్రం హోమ్​ అవకాశాన్ని కల్పించాయి. దీంతో చాలా మంది ఇంట్లో కూర్చొని ఎంచక్కా పని చేసుకుంటున్నారు. అయితే కొందరు సైబర్​ మోసగాళ్లు దీన్ని అవకాశంగా మార్చుకొని అమాయకులను మోసం చేస్తున్నారు. హరియాణాలో ఇదే తరహా మోసం వెలుగుచూసింది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సైబర్​ పోలీసులు ఘరానా మోసానికి పాల్పడుతున్న ఓ బృందాన్ని అరెస్ట్​ చేశారు.

cyber Crime in Faridabad
ఆన్​లైన్ మోసం

వర్క్​ ఫ్రమ్​ హోం పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ఓ ముఠా గుట్టురట్టు చేశారు హరియాణా పోలీసులు. ఓ మహిళ ఫేస్​బుక్​లో పెట్టిన వర్క్​ ఫ్రమ్​ హోం ప్రకటనను నమ్మి.. రూ.1,27,000 మోసపోయింది. దీంతో బాధిత మహిళ సైబర్​ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు.. దిల్లీలో కాల్​సెంటర్​ నిర్వహిస్తున్న ఆ ముఠాలోని ఇద్దర్ని అరెస్ట్​ చేశారు.

ఫరీదాబాద్​కు చెందిన ఓ మహిళ కొన్నిరోజుల క్రితం ఫేస్​బుక్​లో ఓ ప్రకటన చూసింది. అందులో ఇంట్లో కూర్చొని పనిచేస్తూ సులువుగా ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చని ఉంది. దీన్ని నమ్మిన సదరు మహిళ అందులో ఉన్న వాట్సాప్​ నంబర్​కు ఫోన్​ చేసింది. దీంతో తమ వలలో పడిందని గ్రహించిన మోసగాళ్లు.. ఆమెకు మరిన్ని ఆశలు కల్పించారు. దీనికోసం ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు, ఈసీఎస్ చార్జీ, జీఎస్టీ, కొరియర్ చార్జీ, ఇన్సూరెన్స్ పేరుతో మళ్లీ మళ్లీ డబ్బులు వసూలు చేశారు. ఆ తర్వాత వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల ఆ మహిళ మోసపోయినట్లు గ్రహించి.. ఫరీదాబాద్​ సైబర్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

cyber Crime in Faridabad
నిందితులను పట్టుకున్న సైబర్​ బృందం

వెంటనే సైబర్​ అధికారి బసంత్​ నేతృత్వంలో ఓ బృందం రంగంలోకి దిగింది. సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ముఠా దిల్లీలోని రోహిణి ప్రాంతం నుంచి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వారు ఓ కాల్​ సెంటర్​ పేరుతో ఈ మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఆ కాల్​ సెంటర్​పై దాడులు చేసిన సైబర్​ బృందం.. ప్రధాన నిందితుడు ప్రభాత్​, ఓం ప్రకాశ్​ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు బిహార్​ వాసులుగా గుర్తించారు. వారి నుంచి 14 మొబైల్ ఫోన్లు, 13 సిమ్ కార్డులు, రూ.64,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రమేయమున్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.