ETV Bharat / state

Nagarjuna Sagar Project: నిధులు లేక నీరసం.. నిరీక్షణలో సాగరం

author img

By

Published : Apr 11, 2022, 4:49 AM IST

Nagarjuna Sagar Project: నిధులు లేక నీరసం.. నిరీక్షణలో సాగరం
Nagarjuna Sagar Project: నిధులు లేక నీరసం.. నిరీక్షణలో సాగరం

Nagarjuna Sagar Project: లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే నాగార్జున సాగర్​ ప్రాజెక్టు మరమ్మతుల్లో జాప్యం కొనసాగుతోంది. ఆధునిక దేవాలయమైన నాగార్జునసాగర్‌ స్పిల్‌వే వోగీ గోతులమయమైంది. 2009లో వచ్చిన భారీ వరదలతో అవి మరింత పెద్దవయ్యాయి. ఇవి ప్రాజెక్టుకు ప్రమాదకరమేనని ఇంజినీరింగ్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Nagarjuna Sagar Project: ఆధునిక దేవాలయం నాగార్జునసాగర్‌ స్పిల్‌వే వోగీ గోతులమయమైంది. తెలుగు రాష్ట్రాల్లో 23 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే ఈ ప్రాజెక్టు మరమ్మతుల్లో జాప్యం కొనసాగుతోంది. సాగునీటితో పాటు భాగ్యనగర దాహార్తి తీర్చే ప్రధానమైన జలాశయమిది. ప్రమాదకరంగా తయారైన గుంతలను పూడ్చేందుకు ఏటా ఇంజినీర్లు ప్రతిపాదనలు పంపడం.. ఇంతలో వర్షాలు కురిసి వరద ప్రారంభం కావడం.. వాయిదా పడటం.. ఇదో అంతులేని కథలా సాగుతోంది. చాలా ఏళ్లుగా స్పిల్‌వేపై ప్రవాహం ధాటికి చిన్నచిన్న గుంతలు ఏర్పడ్డాయి. 2009లో వచ్చిన భారీ వరదలతో అవి మరింత పెద్దవయ్యాయి. ఇవి ప్రాజెక్టుకు ప్రమాదకరమేనని ఇంజినీరింగ్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్పిల్‌వే వోగీపై గుంతలను పూడ్చేందుకు ఏటా ఇంజినీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపుతూనే ఉన్నారు. గత ఏడాది కూడా మరమ్మతులకు అంచనాలు పంపినా నిధులు విడుదల కాలేదు. ఇటీవల నీటిపారుదలశాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి స్టాండింగ్‌ కమిటీలోనూ (ఎస్‌ఎల్‌ఎస్‌సీ) మరమ్మతులపై చర్చించి తీర్మానించినట్లు తెలిసింది. తక్షణం దాదాపు రూ.15.5 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. దీనికి సర్కారు ఆమోదించాల్సి ఉంది. కానీ మరమ్మతులకు ఈ ఏడాది కూడా సమయం చేజారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పూర్తిస్థాయి మరమ్మతులకు కనీసం నాలుగు నెలలైనా కావాలని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు నిధులు విడుదల చేసి టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించడానికి నెల రోజులైనా పడుతుంది. మే నెల రెండోవారం నాటికి పనులు ప్రారంభించినా జులై ఆఖరులోపు పూర్తి చేయాల్సిందే. భారీ వర్షాలు కురిస్తే పనులు కష్టమే. ఈలోగా కనీసం పెద్ద గుంతలనైనా పూడ్చితే కొంతవరకు మేలని నిపుణులు పేర్కొంటున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి జలాశయ నిల్వ సామర్థ్యం 590 అడుగులు. క్రెస్టు స్థాయి (గేట్ల దిగువ) 546 అడుగులు. ప్రస్తుతం క్రెస్టు స్థాయి కన్నా దాదాపు రెండు అడుగులకు పైగానే నీళ్లున్నాయి. రానున్న 15, 20 రోజుల్లో మట్టం తగ్గనుంది. గేట్ల నుంచి నీళ్లు దిగువకు వచ్చే అవకాశాలు ఉండవు. ఈలోగా నిధుల విడుదల, టెండర్లు, ఇతర ప్రక్రియలు పూర్తిచేస్తే మరమ్మతులు చేయడానికి వీలుంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ విషయమై నల్గొండ నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజినీరు శ్రీకాంత్‌రావును ‘ఈనాడు’ వివరణ కోరగా.. ఇప్పటికే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని, నిధులు విడుదల కాగానే మరమ్మతులు చేపడతామని పేర్కొన్నారు.

సాగర్‌ నుంచి ఏటా లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు వదిలే ప్రవాహ సామర్థ్యం గరిష్ఠంగా 20 లక్షల క్యూసెక్కులకు తగినట్లు స్పిల్‌వేను డిజైన్‌ చేశారు. కానీ, 2009లో అంతకుమించి వరద రావడంతో స్పిల్‌ వోగీపై గోతులు పడి దెబ్బతింది. నాటి ప్రభుత్వం చేపట్టిన మరమ్మతుల్లో నాణ్యత లేకపోవడంతో 2011 వరదల్లో మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి. ఏటా ప్రవాహ ఉద్ధృతికి అవి పెద్దవైపోతున్నాయి. వీటిని ఉపేక్షిస్తే సాగర్‌ భద్రతకు ముప్పు అని ఇంజినీర్లు చెబుతున్నారు. మూడేళ్ల కిందట తనిఖీలు నిర్వహించిన డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానెల్‌ (డీఎస్‌ఆర్‌పీ) కూడా మరమ్మతులు చేపట్టాలని నివేదించింది.

ఇదీ చదవండి: madhapur water: వడ్డెరబస్తీలో పెరుగుతున్న బాధితులు.. న‌ల్లాలకు ట్యాప్‌లు బిగించిన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.