ETV Bharat / state

సీనియర్​ నేతలతో పాల్వాయి స్రవంతి భేటీ.. ప్రచారంలో పాల్గొనాలని విజ్ఞప్తి

author img

By

Published : Sep 11, 2022, 8:30 PM IST

పాల్వాయి స్రవంతి
పాల్వాయి స్రవంతి

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఈరోజు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిశారు. మునుగోడు నియోజకవర్గంలో తనకు పూర్తి సహకారం అందించాలని కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఈరోజు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతురావును ఆమె కలిశారు. రెండు రోజులుగా సీనియర్లను కలుస్తూ వారి మద్దతు, సహకారం అందివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవాళ ఉదయం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో సమావేశానికి ముందే.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి తనకు పూర్తి సహకారం అందించాలని, ప్రచారంలో పాల్గొనాలని కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత భట్టి, మధుయాస్కీ, హనుమంతురావులను నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొని విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

మునుగోడులో గెలుపు వ్యూహంపై చర్చ: మునుగోడులో త్వరలో జరగబోయే ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ పార్టీ సమాయత్తమవుతోంది. ఈనెల 18 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న పార్టీ నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం తన నివాసానికి మునుగోడు టికెట్‌ ఆశించిన నేతలను ఆహ్వానించి సమావేశమయ్యారు.

అభ్యర్థి ఎంపిక విషయంలో తీసుకున్న ప్రమాణాలు, పార్టీ ప్రస్తుత పరిస్థితిని నేతలకు వివరించారు. టికెట్‌ రాని వారికి నచ్చజెప్పి పార్టీ కోసం పనిచేసేలా ఒప్పించారు. అభ్యర్థి పాల్వాయి స్రవంతి మినహా మిగిలిన వారికి పార్టీ బాధ్యతలు అప్పగించేవిధంగా రేవంత్‌ ఆలోచిస్తున్నారు. పాల్వాయి స్రవంతితోపాటు టికెట్‌ ఆశించిన నేతలు చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్‌ గౌడ్‌, కైలాస్‌ తదితరులతో ఆయన సమావేశమయ్యారు. మునుగోడులో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నిర్ణయంతో ఉపఎన్నిక అనివార్యంగా మారడంతో... ప్రధాన పార్టీలు ఈ స్థానంపైనే దృష్టిపెట్టాయి. భాజపా అభ్యర్థిగా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రచారం ప్రారంభించారు. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్‌ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన.. అనంతరం మునుగోడులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేంద్రహోంమంత్రి అమిత్‌షా సమక్షంలో భాజపాలో చేరారు. మరోవైపు అధికార పార్టీ నుంచి ఇంకా స్పష్టత రాలేదు. త్వరలోనే తమ అభ్యర్థిని ప్రకటిస్తుందని తెరాస వర్గాలు చెబుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.