ETV Bharat / state

Raghunandan Rao: 'మంత్రుల ఫామ్ హౌస్‌లపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి'

author img

By

Published : Apr 18, 2023, 5:36 PM IST

Updated : Apr 18, 2023, 10:23 PM IST

raghunandan
raghunandan

Raghunandan Rao Comments on Neeranjan Reddy Farmhouse: 'ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా మార్చుకునేందుకేనా ధరణి తీసుకు వచ్చారా...' అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. ధరణి పేరుతో మంత్రులు ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్‌లు కట్టుకున్నారని మంత్రులు కూడా సీఎంను అనుసరించి విలాసవంతమైన ఫామ్‌ హౌస్‌లు కడుతున్నారని రఘునందన్‌ రావు ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్త శుద్ది ఉంటే మంత్రుల ఫామ్ హౌస్‌లపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

'మంత్రుల ఫామ్ హౌస్‌లపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి'

Raghunandan Rao Comments on Neeranjan Reddy Farmhouse: ముఖ్యమంత్రి ఫామ్ హౌస్‌లు కట్టుకున్నారని... మంత్రులు కూడా సీఎంను అనుసరించి విలాసవంతమైన ఫామ్‌ హౌస్‌లు కడుతున్నారని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. జీతాలు, ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాలు బయటపెట్టి ఫామ్‌ హౌస్‌లు కట్టుకుంటే మంచిందని మంత్రులకు సూచించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. అగ్రి, హార్టీ కల్చర్ లోన్‌లు తీసుకుని వ్యవసాయ శాఖమంత్రి ఫామ్ హౌస్‌లో తోటలు పెట్టుకున్నారని విమర్శించారు. వనపర్తి జిల్లా చండూరులో 165 ఎకరాల ఫామ్ హౌస్‌కు కాంపౌండ్ కట్టుకున్నారని పేర్కొన్నారు.

కృష్ణా నదిని ఆక్రమించుకుని గోడ కట్టారని.. ఫామ్ హౌస్‌లో మూడున్నర ఎకరాల్లో సీసీ రోడ్లు వేశారని ఆరోపించారు. అక్కడక్కడా తహశీల్దార్‌ ఆఫీస్‌లు కాలిపోతున్నాయని.. మంత్రి ఫామ్ హౌస్ కట్టుకున్న మానవ పాడు మండల తహశీల్దార్‌ ఆఫీస్ అక్టోబర్21 2021వ సంవత్సరంలో కాలిపోయిందని అన్నారు. 80 ఎకరాలు కొనుక్కొని 165 ఎకరాల్లో ప్రహరీ కట్టారని విమర్శించారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా మార్చుకునేందుకేనా ధరణి తీసుకు వచ్చారని మండిపడ్డారు.

'గట్టుకాడిపల్లిలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి సెంట్‌ భూమి కబ్జా చేయలేదని, తహశీల్దారు ఆఫీస్ దగ్ధం వెనక ప్రభుత్వ ప్రమేయం లేదని వ్యవసాయ శాఖ మంత్రి ప్రమాణం చేయాలి' అని రఘునందన్‌ డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఒక న్యాయం.. అగ్ర కులాలకు ఒక న్యాయమా అంటూ ప్రశ్నించారు. గతంలో ఇద్దరు మంత్రులపై చర్యలు తీసుకున్న సీఎం కేసీఆర్ వ్యవసాయ శాఖ మంత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే మంత్రుల ఫామ్ హౌస్‌లపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

"మంత్రులు విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లు కట్టుకుంటున్నారు. వ్యవసాయ మంత్రి అగ్రి, హార్టికల్చర్‌ లోన్లతో ఫామ్‌హౌస్‌లు కట్టారు. వనపర్తి జిల్లాలో 165 ఎకరాల్లో మంత్రి ఫామ్‌హౌస్‌ ఉంది. కృష్ణానదిని ఆక్రమించుకుని మంత్రి ఫామ్‌హౌస్‌కు గోడ కట్టారు. మంత్రి ఫామ్‌హౌస్‌లో 3.5 ఎకరాల్లో సీసీ రోడ్లు వేశారు. మంత్రి ఫామ్‌హౌస్‌ ఉన్న తహశీల్దార్‌ ఆఫీసు కాలిపోయింది. 80 ఎకరాలు కొన్న మంత్రి 165 ఎకరాల్లో ప్రహరీ కట్టారు. ధరణి తెచ్చింది ప్రభుత్వ భూముల ఆక్రమణకేనా.. భూకబ్జా చేయలేదని వ్యవసాయమంత్రి ప్రమాణం చేస్తారా? గట్టుకాడిపల్లి ఆలయంలో మంత్రి ప్రమాణం చేస్తారా? తహశీల్దారు ఆఫీస్ దగ్ధంలో మంత్రి పాత్ర లేదని ప్రమాణం చేస్తారా?.. వ్యవసాయశాఖ మంత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి"- రఘునందన్‌ రావు, బీజేపీ ఎమ్మెల్యే

స్పందించిన నిరంజన్‌రెడ్డి: ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపణలపై వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పందించారు. రాజకీయ దురుద్దేశంతోనే రఘునందన్‌ ఆరోపణలు చేశారని విమర్శించారు. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న భూములు తప్ప ఇంక్కెక్కడా లేవని.. తన భార్య సొంత డబ్బులతో ఫామ్‌హౌజ్‌ కట్టుకున్నామని తెలిపారు. తన కుమార్తెల స్వార్జితంతో చట్టబద్ధంగా భూములు కొనుగోలు చేశానని స్పష్టం చేశారు. ఎస్టీల పేరిట భూములు కొని మార్చుకున్న మాట అవాస్తవమని.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు రఘునందన్‌ రంధ్రాన్వేషణ చేస్తున్నారని తెలిపారు.

ఇవీ చదవండి:

'కేసీఆర్ స్వార్థ రాజకీయాలతో నిరుద్యోగులకు అన్యాయం'

ఎంత మంచి మనసో.. మానవత్వం చాటుకున్న కోమటిరెడ్డి

LKG చిన్నారిపై లైంగిక దాడి ఘటన.. డ్రైవర్​కు 20 ఏళ్ల జైలు శిక్ష

Last Updated :Apr 18, 2023, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.