ETV Bharat / state

కేంద్రంలో రైతు సర్కార్‌ రావాలి: కేసీఆర్

author img

By

Published : Dec 24, 2022, 7:32 AM IST

CM KCR
CM KCR

తెలంగాణ స్ఫూర్తితో దేశంలో రైతు సర్కార్‌ అధికారంలోకి రావాలని సీఎం కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ నమూనా ద్వారానే వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. రైతుబంధు పథకం నిరంతరాయంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

రైతు సంక్షేమమే ధ్యేయంగా ఫలితాలను సాధిస్తున్న తెలంగాణ స్ఫూర్తితో దేశంలో రైతు సర్కార్‌ అధికారంలోకి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. తెలంగాణ నమూనా ద్వారానే దేశ రైతాంగం, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపుల్లలు వేస్తూ, ఆర్థికపరమైన అడ్డంకులు సృష్టిస్తున్నా రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేసీఆర్‌ చెప్పారు. రైతుబంధు పథకం నిరంతరాయంగా కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన దేశ రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపారు.

‘‘తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేళ్ల స్వల్పకాలంలోనే, వినూత్న విధానాలతో వ్యవసాయంలో స్వర్ణయుగానికి బాటలు వేసింది. రైతుల జీవితాలను గుణాత్మక దిశగా అభివృద్ధి పరిచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు అత్యద్భుత ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చడంతో పాటు దేశానికే అన్నపూర్ణగా, విత్తన భాండాగారంగా రూపొందించడం వెనక ఎంతో శ్రమ, మేధో మథనం దాగి ఉన్నాయి. వ్యవసాయరంగంలో సాధించే ప్రగతి సమస్త రంగాలకు చోదకశక్తిగా పనిచేస్తుంది. తద్వారా దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. వ్యవసాయరంగంలో చోటు చేసుకునే ప్రగతి ద్వారా, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. దాని ప్రభావం పరిశ్రమలు తదితర ఉత్పత్తి, సేవారంగాలకు విస్తరిస్తుంది. విద్యుత్తు, వ్యవసాయం, సాగునీటి రంగంతో పాటు పలు వృత్తుల అభివృద్ధి కోసం వెచ్చించే ఖర్చు, సామాజిక పెట్టుబడిగా పరిణామం చెందుతుందని తెలంగాణ ప్రభుత్వం నిరూపించింది’’ అని కేసీఆర్‌ తన సందేశంలో పేర్కొన్నారు.

సైనికుల మృతిపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి: ఉత్తర సిక్కింలోని జైమా వద్ద వాహనం ప్రమాదవశాత్తు లోయలో పడి 16 మంది జవాన్లు మృతి చెందడంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. మరణించిన జవాన్లు, అధికారుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు.మృతి చెందిన జవాన్ల కుటుంబాలను ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

ఇవీ చదవండి: కేంద్రం తీరుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేసిన బీఆర్ఎస్ దళం

ఆర్మీ ట్రక్కుకు ఘోర ప్రమాదం.. 16 మంది సైనికులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.